నేడు, రేపు భారీ వర్షాలు
హైదరాబాద్ (CLiC2NEWS): వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం, మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో బుధవారం, గురువారం పలు జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీచేసింది.
- బుధవారం
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. - రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరిక జారీచేసింది.
- గురువారం పలు జిల్లాల్లో అతిభారీ, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
- ఆంధ్రప్రదేశ్‌లో అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు.
- వాయువ్య బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడన ప్రభావంతో.. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి సంభవించిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని వెల్లడించారు. తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర- దక్షిణ ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.