విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-6)

మహాదేవా… శ్రీరామావతారంపై తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కవిగా ప్రసిద్ధులైన వేమన పద్యం మరింత కఠినంగా ఉంది… భార్య అడిగిందని, భూమి మీద ఉండని బంగారు జింకను పట్టుకోవడానికి శ్రీరాముడు ఎలా వెళ్లాడు, అమాయకుడా దేవుడు అంటూ వేమన ప్రశ్నించాడు. ఈ మాయ జింక కంటే రావణ, కుంభకర్ణులను తుదముట్టించేందుకు మరో మంచి కారణం ఉంటే ఇలాంటి విమర్శలు రాకపోయేవని కొందరు అభిప్రాయపడుతున్నారు.

నీవు చదివిన గ్రంథాలు, చూసిన సినిమాల వల్ల ఈ అభిప్రాయంతో ఉన్నావు కదూ, అంటూ నారాయణుడు… ఇంకా ఏమైనా చెబుతావా అన్నట్లుగా చూశారు శ్రీ మహా విష్ణువు. ఇంకా చాలా సందేహాలున్నాయి స్వామి.. వీటన్నింటికి కంటే నన్ను ఎవరు, ఎందుకు హత్య చేశారనే సంశయమే అన్నింటికంటే ఎక్కువగా నన్ను వేధిస్తున్నది ప్రభు.

దేవుడు… జీవుని సంభాషణలు ఎటు నుంచి ఎటో వెళ్లిపోతున్నాయి అంటూ లక్ష్మీ దేవి జోక్యం చేసుకుంది.

వైకుంఠ ప్రవేశం తర్వాత కూడా ఈ జీవుడు భూలోకంలో తనకు జరిగిన అన్యాయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు స్వామి.. తనను ఎవరు, ఎందుకు హత్య చేయించారో తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఆరాటమే అధికంగా ఉంది ఈ జీవికి…

వైకుంఠ ప్రవేశమే దుర్లభం. పైగా నా దర్శనం కూడా నీకు సంతృప్తికరంగా లేకుంటే స్వర్గానికి పంపిస్తాను. అక్కడ సర్వ భోగభాగ్యాలను కనులారా చూడు. వారు అక్కడ అనుభవిస్తున్న సర్వ సౌకర్యాలను కూడా తెలుసుకున్న తర్వాత నీ మనస్సు కుదటపడుతుందో చూద్దాం. వెళ్లి వస్తావా… అక్కడే ఉంటావో ఆలోచించుకో..

ఇలాంటి అవకాశం ఎవరికీ లభించలేదు ఇప్పటివరకు, ఇక ముందు కూడా ఎవరికీ దక్కకపోవచ్చు.

కురుక్షేత్ర యుద్దం తర్వాత వీర మరణం పొందిన వారెందరో యోధులు అక్కడ ఉంటారు. యుద్ధానంతరం హస్తినాపురి సింహాసనం అథిరోహించి ప్రజలకు సుపరిపాలన అందించిన ధర్మరాజు అక్కడే ఉన్నారు.

కలి పురుషుని ఆగమనంతో వారసులకు సింహాసనం అప్పగించి సోదరులతో సహా స్వర్గానికి బయలు దేరినా.. చివరికి సశరీరంతో ధర్మజుడు ఒక్కడే గమ్మాన్ని చేరుకున్న ప్రాంతం అది. ఒక్కసారి అమరావతిని చూసిరా అంటూ విజయ్ వైపు చూసాడు స్వామి.

ఏమి స్వర్గం స్వామి.. నాకు ఆ స్వర్గాధిపతి దేవేంద్రునిపై విశ్వాసం లేదు. పైగా ఇంద్రుడు చేసిన పాప కార్యాయాలు అన్నీ ఇన్నీ కావు. తన సీటును పదిలం చేసుకునేందుకు మా భూలోకంలో రాజకీయ నాయకులకు మించిన తప్పులు చేసినా ఆయనను దండించే వారే లేరు. మా లోకంలో అలాంటి వారిని మళ్లీ ఎన్నుకోకుండా శిక్ష విధిస్తారు లేదా కోర్టుల ద్వారా న్యాయం జరుగుతుంది. కానీ ఇంద్రుని అపరాధాన్ని గుర్తించి శిక్షించే అవకాశాలే ఉన్నట్లుగా ఏ కథలో చదవలేదు. రాక్షస రాజులు దండెత్తి వచ్చినప్పుడు తప్పని పరిస్థితిలో మాత్రమే ఆయన తన సింహాసనం దిగినట్లుగా ఉంది. మీరు ఆ రాక్షసులను తుదముట్టించగానే తిరిగి దర్జాగా స్వర్గాన్ని ఏలుకున్నాడు. ఎంతటి దుర్మార్గం అంటే తన పదవిని కాపాడుకోవడానికి మహిళలను కూడా చెరబట్టాడు కదా ఇంద్రుడు అంటూ విజయ్ తన ఆవేధన అంతా వెలిబుచ్చారు. స్వామి ఈ విషయంలో జీవుడు చెప్పిన దానిలో కొంత వాస్తవం కనిపిస్తున్నది కదా అని అన్నారు, లక్ష్మీదేవి. ఎవరి పరిధిలో వారు తమ ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి. దానికి కొన్ని నియమాలుంటాయి కానీ కనీస నిజాయితీ లేని స్థితి రావద్దు అని దేవి కూడా తనలో తాను అనుకున్నా.. అందరికీ వినబడింది. స్వర్గాధిపతిపై నీకున్న ఆగ్రహం ఎలా ఉన్నప్పటికీ నీవు అక్కడికి వెళ్లి రా తర్వాత మాట్లాడుకుందామంటూ నారాయణుడు దేవదూతను పురమాయించారు.

మహా ప్రభు.. ఆగ్రహించకండి.. మీరు నాపై చూపుతున్న దయకు ఎల్లకాలం కృతజ్ణునిగా ఉంటాను. మిమ్ముల్నే స్మరిస్తూ, మీ ద్యానం, ద్యాసతోనే మీ సేవలు చేస్తూ ఇక్కడే ఉంటాను దేవా… నన్ను స్వర్గానికి పంపకండి. దేవాది దేవ అనుగ్రహించండి. ఇంత సేపు మీతో మాట్లాడే మహద్భాగ్యం కలగడమే నా పూర్వ జన్మ ఫలం. సధా మీ నామ స్మరణలోనే నేను తరించేలా అనుమతివ్వండి స్వామి అంటూ ముఖిలిత హస్తాలతో వేడుకున్నాడు విజయ్.. నీపై నాకు ఎలాంటి ఆగ్రహంలేదు. ఒకసారి వైకుంఠ ద్వారం దాటి వచ్చిన వారికి సద్గతే కాని మరో శిక్ష ఉండదు, అన్నారు మహా విష్ణువు.

ధన్యోస్మి స్వామి, ధన్యోష్మి. ఇంతకంటే నాకు మరేమి అక్కర లేదు. అందుకు స్వర్గం కూడా వద్దనుకుంటున్నాను. వైకుంఠవాసమే నాకు కావాలి. ఎండకన్ను ఎరగని ఇంద్రుని ఇల్లాలు విహరించే ఉద్యాన వనంలో నాకు లభించే అవకాశం కూడా వద్దు. పారిజాత వృక్ష చ్ఛాయలో నిలబడే మహద్భాగ్యం వద్దు. రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనకల నాట్యంతో అనునిత్యం ఆహ్లాదంగా, మనోహరంగా సాగే… అష్ట దిక్పాలురతో కొలువుండే మహేంద్ర సభకు ప్రవేశం నాకు అక్కర లేదు. మీ సమక్షంలో ఉండటమే నా అభీష్టం దేవా అంటూ విజయ్ పరిపరి విధాలుగా వేడుకున్నారు. జీవుని అభ్యర్థనకు సుముఖంగానే ఉన్నట్లుగా తలాడిస్తూ శ్రీహరి కనిపించడంతో విజయ్‌లో అనందం తాండవించింది. స్వర్గంలో ఉండాలంటే అందరూ ఎగిరి గంతు వేస్తారు.. నీ వెందుకయ్యా అలా బేగా మాట్లాడావు. కేవలం ఒకసారి స్వర్గ సౌఖ్యాలు ఎలా ఉంటాయో చూసి, వీలైతే అనుభవించి రమ్మని మాత్రమే నా ఆజ్ఞ. స్వర్గలోకం వెళ్లక ముందే అక్కడి విషయాలన్నీ ఏకరువు పెట్టి విముఖత వ్యక్తం చేసిన తీరు కూడా బహు ప్రసంశనీయంగా ఉంది. దేవ దేవ.. ఇప్పటికే మీతో ప్రస్తావించాలనుకుంటున్నా.. దేవతలందరూ గ్రాంధిక భాష లేదా దేవ భాషలో మాత్రమే మాట్లాడుతారని నేను చూసిన సినిమాల్లో కనిపించింది. కానీ శిష్ట వ్యావహారికంలో మీరు ఇప్పటివరకు నాతో చేసిన సంభాషణలు నాకెంతో ఆనందదాయకంగా ఉన్నాయి. భూలోకంలో శ్రీరామావతారం, కృష్ణావతారంలో మీరు ఏ భాష మాట్లాడారో కాని ఇలా ఈ సమయం మీతో ఉండటం నా జన్మ ధన్యమైంది, మహాదేవా… అంటూ విజయ్ సాష్టాంగపడ్డారు.

మహాలక్ష్మి కలుగజేసుకుంటూ ఈ జీవికి స్వర్గం పట్ల అయిష్టత అధికంగా కనిపిస్తున్నది…అయితే రంభాది అప్సరసల రూప లావణ్యం ముందుగానే పసిగట్టినట్లున్నాడు జీవుడు …అనడంతో నవ్వడం శ్రీహరి వంతు అయింది. ఈ మాటలకు విజయ్ సిగ్గుపడ్డాడు.. క్షమించు తల్లి అన్నట్లుగా శ్రీదేవివైపు చూసి ప్రణమిల్లాడు. స్వర్గ సందర్శన కుతూహలం నీకు లేకపోయినా ప్రభు ఆజ్ఞ కాబట్టి వెళ్లిరా అని చెప్పగానే దేవ దూత వెంట విజయ్ బయలు దేరారు.

విజయ్ స్వర్గదామం వైపు బయలు దేరగానే శ్రీదేవి తన అనుమానాన్ని బయట పెట్టింది. ఏమిటి స్వామి ఈ జీవున్ని తిరిగి భూలోకానికి పంపే ఉద్ధేశ్యం మీకు ఉందా.. అధిక సమయమే ఆ జీవితో మాట్లాడారు. ఏమంటారు అని శ్రీహరి వైపు చూసింది. ఆ జీవుడు ఇంకా మూడు దశాబ్దాల వయస్సు కూడా దాటకుండానే మృత్యువును కౌగలించుకోవడం బాధాకరమే. పైగా ఈ జీవి చేసిన నేరం కూడా కనిపించడం లేదు. అతన్ని నేరుగా మీ సమక్షంలోకి పిలిపించుకున్నారు. తిరిగి అతనిని తన దేహంలో ప్రవేశపెట్టడానికి అవకాశాలున్నాయా? భూలోకంలోకి తిరిగి పంపడం ద్వారా ఈ జీవితో ఏదైనా ప్రజోపయోగం, మహత్కార్యం ఏమైనా నెరవేర్చాలని భావిస్తున్నారా ప్రభూ, అంటూ లక్ష్మీ దేవీ పలు సందేహాలను వెలిబుచ్చినప్పటికీ అంతా వింటూ కూడా శ్రీహరి మౌనంగానే ఉండి పోయారు.

ఢిల్లీలో పోలీసుల హడావుడి…

రోడ్డు ప్రమాదంలో మరణించిన విజయ్ దేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండానే డాక్టర్లు శవాన్ని మార్చురికి తరలించారు. అతి శీతలమైన ఈ మార్చురిలో శవం వారం, పదిరోజుల కంటే అధికంగానే ఎలాంటి వాసన కూడా రాకుండా భద్రంగా ఉంటుంది. అందుకే పోలీసులు ప్రత్యేకంగా రిక్వస్టుచేసి మార్చురీలో పెట్టాలని డాక్టర్లను కోరారు. పైగా శవంపై ఎలాంటి గాయం లేదు. ఎత్తు మీది నుంచి అతి వేగంగా బలంగా కిందపడటంతో గుండె ఆగిపోవడంతో ఊపిరి ఆగిపోయి మరణించినట్లుగా పోస్టుమార్టం రిపోర్టులో నమోదు చేశారు.

నిందితుల ఆచూకీ కోసం కేసు దర్యాప్తు ఎలా ప్రారంభించాలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ తివారికి అంతుబట్టడం లేదు. విలేకర్లను పిలిచి మృతుని ఫోటో ఇచ్చి ప్రముఖంగా ప్రచురించి సహకరించాలని కోరారు. దీంతో మర్నాడు లోకల్ ప్రముఖ వార్తా పత్రికల్లో ఫోటోతో సహ ప్రమాద విషయాలు ప్రచరితమైనాయి. ఢిల్లీ శివారులో జరిగిన ఈ ప్రమాదం పై ప్రత్యేక కథనాలు రాస్తూ కీలకమైన ఈ రహదారిపై ఆగ్రా వరకు కూడా సిసి కెమరాలు ఏర్పాటు చేసి ఉంటే నింధితుల ఆచూకిని తేల్చడం సులువయ్యేదని వార్తలు వచ్చాయి. ఆ రోజు ఢిల్లీ నుంచి ఆగ్రాకు బయలు దేరిన కార్లను సిసి కెమరాల ఫుటేజి ద్వారా పరిశీలించారు సిఐ. వందల సంఖ్యలో వాహనాలు ఆనాడు ఆగ్రాకు వెళ్లడంతో ప్రతి వాహనాన్ని పరిశీలించడం కష్టంగానే మారింది. అయితే ఆగ్రా నుంచి సాయంత్రం బయలు దేరిన కార్లను పరిశీలిస్తే తొందరగా సమాచారం లభిస్తుందని సిఐ ఆగ్రా పోలీసులతో మాట్లాడి మధ్యాహ్నం నుంచి ఢిల్లీకి బయలు దేరిన వాహనాల ఫుటేజీని తెప్పించుకున్నాడు. సిఐ ఈ కేసును సీరియస్‌గా తీసుకోవడంతో సబ్ ఇన్స్‌పెక్టర్ కూడా చొరవ తీసుకొని… సార్, దేశ రాజధాని కావడంతో దేశంలోని 29 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఢిల్లీకి వస్తారు కదా..ఈ మృతుని ఫోటోను అన్ని రాష్ట్రాల పత్రికల్లో ప్రచురించేలా మనం ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందేమో ఆలోచించండి అని కోరాడు.

అవును నిజమే.. మృత దేహం ఎవరిదో తేలితే.. నిందితుల ఆచూకీకి ప్రయత్నించ వచ్చు. మనకు ఇప్పటివరకు ఎవరు పిర్యాదు చేయలేదు. కనీసం పత్రికల్లో వచ్చిన ఫోటో చూసిన తర్వాత ఎవరూ పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసి వివరాలు తీసుకోలేదు. అంటే మృతుడు ఢిల్లీ, దాని సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాదని భావించాల్సి వస్తున్నది. చద్దాం ఇతర రాష్ట్రాల విలేకర్లను పిలిచి సహకరించాలని కోరుదాం. న్యూఢిల్లీలో దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన పత్రికల కార్యాయాలు ఉన్నాయి. పెద్ద పత్రికలకు ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ప్రత్యేక భవనం పార్లమెంట్ భవనానికి, సమాచార భవన్‌కు సమీపంలోనే ఉంది. మరో కానిస్టేబుల్‌ను తీసుకొని అక్కడికి వెళ్లు. లేదా ప్రెస్ ట్రస్టు ఆఫ్ ఇండియా (పిటిఐ)న్యూస్ ఏజెన్సీకి ఇచ్చినా వారు అన్ని పత్రికలకు,ఎలక్ట్రానిక్ మీడియా కు పంపిస్తారు. ఫోటోతోపాటు ప్రెస్‌నోటు తయారు చేసి ఇవ్వండి. శ్రద్ధ తీసుకొని ప్రతి పత్రికా కార్యాలయానికి అది అందేలా ప్రయత్నించండి అని ఎస్‌ఐకి పురమాయించారు తివారి. మరో కొద్ది రోజులు వెయిట్ చేద్దాం.. అన్ని రాష్ట్రాలో వార్తలు పబ్లిష్ అయిన తర్వాత ఫీడ్‌బ్యాక్ తీసుకొని తదుపరి చర్యలు తీసుకుందామని సిఐ భావించారు.

త‌ప్ప‌క‌చ‌ద‌వండి episode -5విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-5)

Leave A Reply

Your email address will not be published.