కాబుల్ విమానాశ్రయంలో వాటర్ బాటిల్ రూ.3వేలు, ప్లేట్ రైస్ రూ.7500
కాబూల్ (CLiC2NEWS): ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. అప్ఘాన్‌లో ఉన్న స్థానిక
ప్రజలు, విదేశీయులు ప్రాణాలు కాపాడుకునేందుకు దేశాన్ని వీడుతున్నారు. ఈ క్రమంలో కాబుల్ చుట్టుపక్కల అన్ని దారులు మూసివేశారు. దీంతో చేసేదేంలేక వారంతా కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.
అక్కడి తిండిదొరక్క వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. తినడానికి, నీళ్లుతాగడానికి తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. విమానాశ్రయంలో ధరలు చుక్కలనంటాయి. ఒక వాటర్ బాటిల్ ధర దాదాపు రూ.3వేలు (40 డాలర్ల)కు చేరింది. ఇక ప్లేట్ రైస్‌కు రూ.7500 (వంద డాలర్లు) పెట్టి కొనాల్సిన పరిస్థితి నెలకొంది.
దీనికి తోడు స్థానిక ఆఫ్ఘన్ కరెన్సీని విమానాశ్రయంలో ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదు. అంతా డాలర్లపై నడుస్తోంది అక్కడి వ్యాపారమంతా. దీంతో అఫ్ఘన్‌ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చాలా మంది అర్ధాకలితో గడిపేస్తున్నారు. ప్రస్తుతం విమానాశ్రయం వద్ద దాదాపు 50వేల మంది వరకు జనం ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఏదో విధంగా అఫ్ఘన్‌ను వీడేందుకు విమానాశ్రయంలో వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో కొందరిని మాత్రమే అధికారులు విమానాశ్రయం లోపలికి అనుమతిస్తున్నారు.