మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌శౌరిపై కేసు

న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి, ఆర్థికవేత్త, జర్నలిస్ట్ అరుణ్‌శౌరిపై సిబిఐ ప్రత్యేక కోర్టు అవినీతి కేసు నమోదు చేసింది. రాజస్థాన్‌లోని ఉదరుపూర్‌లో లక్ష్మీ విలాస్ ప్యాలెస్ హోటల్లో పెట్టుబడులు పెట్టారన్న అక్రమ కేసులో మాజీ మంత్రి అరుణ్‌శౌరిని నిందితుడిగా పేర్కొంది. అరుణ్‌శౌరితో పాటు మాజీ ప్రభుత్వ అధికారి ప్రదీప్ బైజాల్, జ్యోత్న శౌరిలను కూడా నిందితులుగా పేర్కొంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో పెట్టుబడుల మంత్రిగా పనిచేసిన అరుణ్‌శౌరి హోటల్స్ విక్రయంలో అవతవకలకు పాల్పడ్డారని, భారీ నష్టం వచ్చినట్లుగా ప్రభుత్వానికి లెక్కలుచూపారని కోర్టు పేర్కొంది. హోటల్స్ విక్రయాన్ని తిరిగి ప్రారంభించాలని ఆదేశించినపుడు ఈ అక్రమం వెలుగులోకి వచ్చిందని తెలిపింది. హోటల్ లక్ష్మీ విలాస్ ధర రూ. 252 కోట్లు కాగా, కేవలం రూ. 7.5 కోట్లకు విక్రయించినట్లు కోర్టు వెల్లడించింది. 2019లో ఈ కేసును సాక్ష్యాధారాలు లేవంటూ సిబిఐ కేసును కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తిరిగి విచారణ చేపట్టాలంటూ జోద్పూర్ ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
దర్యాప్తు సంస్థ యొక్క నివేదిక ప్రకారం, ప్రభుత్వం నడుపుతున్న లగ్జరీ హోటల్ లో పెట్టుబడులు పెట్టడం వలన “ప్రభుత్వానికి దాదాపు రూ.143.48 కోట్లు నష్టపోయింది. నిందితులకు వ్యక్తిగతంగా / సంయుక్తంగా తప్పుడు లాభం వచ్చింది.” ఈ ఆస్తి రూ.7.85 కోట్లకన్నా తక్కువ విలునది అని ఒక ప్రైవేట్ సంస్థ మెస్సర్స్ కాంతి కరంసే సంస్థ చేసిన విలువ మదింపు ఆధారంగా రిజర్వ్ ధరను రూ.6.12 కోట్లుగా నిర్ణయించారని సీబీఐ తన నివేదికలో పేర్కొన్నది. “దర్యాప్తులో మేము ఆదాయపు పన్ను శాఖ ద్వారా ఆస్తిని పున: పరిశీలించి దాని విలువ రూ. 193.28 కోట్లుగా మదింపు వేసాం. కాంతి కరంసే అండ్ కంపెనీ ఆస్తిని తక్కువ అంచనా వేయడం వల్ల ఖజానాకు నష్టానికి దారితీసింది” అని సీబీఐ వర్గాలు తెలిపాయి.
కోర్టు ఆదేశాలు చూసిన తర్వాత వ్యాఖ్యానిస్తా : అరుణ్ శౌరీ
ఈ వ్యవహారంపై అరుణ్శైరీ స్పందించారు. “నేను ఇంతవరకు కోర్టు ఆదేశాలు చూడలేదు. తమ న్యాయవాదులు ఈ ఉత్తర్వును పరిశీలిస్తారు. తరువాత ఏమి చేయాలో నిర్ణయిస్తాం” అని సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వుపై అరుణ్ శౌరీ అన్నారు.