జైలులో అగ్ని ప్రమాదం.. 41 మంది ఖైదీల మృతి

జకర్తా (CLiC2NEWS): ఇండోనేసియా రాజధాని జకర్తాలోని టాంగెరాంగ్ జైలులో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 41 మంది ఖైదీలు మృతువాత పడ్డారు. 39 మంది తీవ్రంగా గాయపడగా. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటనతో ఆ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రపంచం ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో జైలులో మంటలు చెలరేగాయి. అయితే నిద్రలో ఉన్న ఖైదీలు ఈ విషయం తెలియకపోవడంతో అగ్నికీలలకు ఆహుతయ్యారు.
ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది ఖైదీలు ఉన్నారనేది తెలియరాలేదు. ప్రస్తుతం మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఇండోనేసియా జైళ్లలో సామర్థ్యాని మించి ఖైదీలను ఉంచడం గత కొన్ని రోజులుగా పెద్ద సమస్యగా మారింది. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు జైళ్ల శాఖ ప్రతినిధి రికా అప్రియంతి వెల్లడించారు.