బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీ.. 70 మంది గల్లంతు

గుహవాటి (CLiC2NEWS): అసోంలోని బ్రహ్మాపుత్ర నదిలో పెను విషాదం చోటుచేసుకుంది. జోర్హాత్లో నిమతి ఘాట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొని బోల్తా పడ్డాయి. ప్రమాద సమయంలో రెండు పడవల్లో మొత్తం 120 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 50 మందిని రక్షించగా, గల్లంతైన మిగతా 70 మందికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో ఎంత మంది మరణించింది ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు (ఎన్డీఆర్ఎఫ్- ఎస్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగారు. నీటిలో గల్లంతయిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఈ ఘటనపై కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో వెంటనే ఫోన్లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. గాలింపు చర్యలు, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.