రేపటి నుంచి అసెంబ్లీ స‌మావేశాలు

దళితబంధు సహా 8 బిల్లులు సభ ముందుకు..

తొలిసారిగా మండలికి వాణీదేవి, శాసనసభకు నోముల భగత్‌

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు రేప‌టి (శుక్రవారం) నుంచి జ‌రుగ‌నున్నాయి. ఈ మేర‌కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్ర వారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ, మండలి.. అక్టోబర్ 1వ తేదీ వ‌ర‌కు కొనసాగే అవకాశముంది. సభ ఎన్ని రోజులు జ‌రుగుతుంది… ఎజెండా తదితర అంశాల‌పై శుక్ర‌వారం జ‌రిగే బీఏసీ స‌మావేశంలో నిర్ణయిస్తారు.

మొద‌టి రోజు శాస‌న స‌భ మొద‌లైన తర్వాత ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు, మండలి సభ్యుల మృతికి సంతాపం ప్రకటించి వాయిదా పడే అవకాశాలున్నాయి. శని, ఆది వారాల్లో విరా మం తర్వాత తిరిగి ఈ నెల 27 నుంచి వరుసగా ఐదు రోజుల పాటు సభలు సాగే అవకాశముంది. కాగా ప్రొటెం చైర్మన్‌ హోదాలో వెన్నవరం భూపాల్‌రెడ్డి తొలిసారి మండలి సమావేశాలను నిర్వహించనున్నారు. కాగా పట్టభద్రుల కోటాలో ఎన్నికైన సురభి వాణీదేవి తొలిసారిగా, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరుసగా రెండో సారి మండలిలో అడుగుపెడుతున్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన నోముల భగత్‌ కూడా తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ‘దళితబంధు’కు చట్టబద్ధ్దత కల్పించే బిల్లుతో పాటు మరో ఏడు బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

కాగా అసెంబ్లీ సమావేశాలను కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

Leave A Reply

Your email address will not be published.