విజయుడు (ధారావాహిక నవల పార్ట్-19)

విజయ్ వెళ్లే వరకు ముఖ్యమంత్రి జానకి రామయ్య కూడా ఇంటి వద్దనే ఉన్నారు. ఎప్పుడు వచ్చి వెళ్లే ఎంఎల్‌ఎ కావడంతో గుర్తుపట్టి ఎలాంటి ప్రశ్నలు వేయకుండానే సెక్యూరిటీ సిబ్బంది విజయ్ కారును గేటు తీసి, లోనికి పంపారు.
రా.. రా విజయ్ చాలా రోజులైనట్లుంది బంగ్లాకు రాక. అన్నపూర్ణ నాలుగు రోజుల నుంచి నిన్ను అడుగుతున్నది. నీకు తెలుసు కదా వరదల భీభత్సం, క్యాబినెట్ మీటింగ్ అంతా బిజి షెడ్యూలు.. నేను ఫోన్ చేయలేదు సరే రోజూ ఉదయమే పలకరించే వాడివి. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎందుకో కాల్ రాలేదు నీ నుంచి. ప్రయాణ బడలికతో ఉన్నావని నేను ప్రయత్నించలేదనుకో..
నేను ఆగ్రాకు వెళ్తున్నానని ఆరోజు మీకు చెప్పినప్పుడు, రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయని, వరదలకు అధిక నష్టం జరుగుతున్నదని నాకు చెప్పనే లేదేమిటి సార్ అని విజయ్ ప్రశ్నించడంతో, ఆ రోజున కాదు తర్వాతి రోజు నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు తగ్గిన తర్వాత నేనే స్వయంగా వాకబ్ చేశాను. సిఎంఒ కార్యదర్శిని అడిగాను, ఢిల్లీలోని మన భవన్ అధికారులను కూడా పురమాయించినట్లు ఆయన చెప్పారు. నిజమే ఆ తర్వాత నాలుగు అయిదు రోజుల వరకు నీ సమాచారమే నాకు రాలేదు, ఏమై ఉంటుందని అడిగాడు సిఎం.. దీంతో విజయ్ మరోసారి ఆలోచనలో పడిపోయాడు.
ఎప్పుడూ రాజకీయాలేనా, ఇంటికి వచ్చిన విజయ్‌ను కాస్తా స్థిమితంగా ఉండనీయండి. భోజనానికి టైం అయింది రండని అన్నపూర్ణమ్మ పిలవడంతో ఈ సంభాషణ నిలిచిపోయింది. మంచి రుచికరమైనా వంటలు, పైగా తల్లిలాగా కొసరి కొసరి వడ్డించడంతో కొంత ఎక్కువగానే తిన్నాడు విజయ్. మీ చేతి వంట ముందు ఇతర ఎక్కడ తిన్నా ఆ రుచి రాదు. ఫైవ్ స్టార్ హోటళ్లలో భుజించినా సిఎం బంగ్లాలో చేసిన వంటలకు అవి ఎందుకు కొరగావు అమ్మా.. అన్నాడు విజయ్.
లేదు ఈ కూర కూడా రుచి చూడాల్సిందే,అంటూ పుట్ట గొడుగుల కూర పెడుతూ, ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది తప్పక తినాల్సిందే అంటూ కొసరి,కొసరి వడ్డిస్తున్న అన్నపూర్ణమ్మలో విజయ్ తన మాతృమూర్తిని చూసుకుంటున్నాడు.
తర్వాత ఇక చాలు అని పెరుగన్నం తర్వాత చేతులు కడుక్కున్నాడు. మనిషికి కావాల్సింది ముందుగా పుష్టికరమైన, ఆరోగ్య కరమైన అహారం, ఒంటరిగా ఉంటున్న నీకు ఇవి లభించవు…అందుకే ఇక్కడే ఉండి పొమ్మని అంటున్నా నీవు ఒప్పుకోవడం లేదు. ఏమండీ మీరైనా అబ్బాయికి చెప్పవచ్చు కదా అంటూ సిఎంను అడిగింది.
నీవు చెప్పినా వినని విజయ్, నా మాటలు మాత్రం వింటారా అంటూ సిఎం చేతులు కడుక్కున్నాడు. తర్వాత ఇద్దరూ ఆఫీసు రూంకు వెళ్లారు.
ఇదేమిటి సార్ మంత్రులు ఇలా నాపై విరుచుకుపడ్డారు అంటూ తన వద్ద ఉన్న పత్రికను విజయ్, ముఖ్యమంత్రి జానకి రామయ్య ముందుంచారు. ఇది వాస్తవమేనా, ఇతర సమస్యలు ఏమీ లేనట్లుగా క్యాబినెట్‌లో మొత్తం నాగురించే అంత సమయం వృధా చేశారేమిటి సార్.
మీరే అన్నారు కదా ప్రభుత్వ లోటుపాట్లు మనమే ఎత్తి చూపితే, ప్రతిపక్షాలు మంత్రులను విమర్శించడానికి ఏమీ ఉండదని, పైగా మీరు ఎప్పుడూ ఈ విషయాలు మాట్లాడరాదని కూడా నాకు చెప్పలేదు.
పత్రికల్లో ఇలా వస్తే ప్రజలు ఏమనుకుంటారో మంత్రులు ఆలోచించకుండా ఉంటే ఎలా సార్ . మీరు ప్రారంభంలోనే మంత్రులను కట్టడి చేసి ఉండాల్సింది. అయినా మంత్రివర్గ సమావేశంలో ఏమిజరిగినా అది పత్రికలకు లీక్ అవుతుంది. నా మీద అంత ఆగ్రహం ఉంటే మీ ఛాంబర్‌కు వచ్చి వాళ్లు మాట్లాడి ఉంటే సరిపోయేది.తర్వాత మీరు నాతో చర్చించే అవకాశం ఉండేది అంటూ జానకి రామయ్యను చూసాడు విజయ్.
మక్కీకి మక్కీ ఆ పత్రికలో వచ్చింది. ఎవరో మన మంత్రిగారే ఆ విలేకరికి చెప్పి ఉంటాడు. అసలు ఇదంతా మీటింగ్‌లో అది కూడా మీ సమక్షంలో జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నా సార్. అని విజయ్ తన ఆవేధన వ్యక్తం చేశారు.
పత్రికలను మనం కంట్రోల్ చేయలేం విజయ్. వారు ఏదోదో రాస్తుంటారు. అందులో కొంత నిజం లేకపోలేదు. నేనే వారిస్తున్నా ఒక్కో మంత్రి నీ పై ధ్వజమెత్తుతూ నన్ను ఇరుకున పెట్టారు విజయ్. వద్దని చెబుతున్నా, నిన్ను సమర్ధిస్తున్నా వారు వినిపించుకోలేదు. నీవు చెబుతున్న విషయాల్లో తప్పులు ఏవిటో చెప్పాలని కూడా నేను మాట్లాడిన మంత్రులను నిలదీసాను. కానీ వారు ఆగలేదు. ఎంతైనా నా మంత్రివర్గంలోని సభ్యులు కదా నాయకునిగా అందరిని సమానంగా చూస్తున్నట్లుగా మెలగక తప్పదు నాకు. అవన్నీ నీవు మనస్సులో పెట్టుకోకు. ఇప్పటికే అధిష్ఠానాన్ని పలుసార్లు అడిగా. రాష్ర్ట పార్టీ ఇన్‌చార్జీతోనూ సంప్రదించా..విజయ్‌ను క్యాబినెట్‌లోకి తీసుకుందామని. ఇప్పుడే తొందరపడవద్దని, ఫస్టుటైం ఎంఎల్‌లు ఎక్కువ మంది ఉన్నందున వారు కూడా పోటీపడతారని,అసమ్మతిని పెంచుకోవద్దని అధిష్ఠానమే నాకు చెబుతున్నది. ప్రతి కొత్త శాసనసభ్యుడు తనకూ అర్హతలున్నాయని ఏదో ఒకటిచెప్పి క్యాబినెట్‌లో బెర్తు కావాలంటారు. నీలాంటి వాడు క్యాబినెట్‌లో ఉంటే నాకు పని తక్కువ అవుతుంది. కానీ ఏం చేద్దాం. కొంత ఓపిక పట్టు. అని సిఎం అనడంతో…
నాకు మంత్రి పదవి కావాలనే ఆశ ఏమాత్రం లేదు. ప్రజల పక్షాన వారి సమస్యలను ప్రభుత్వానికి అసెంబ్లీ వేధికగా వివరిస్తున్నాను. మీడియా వారు అడిగితే మాట్లాడక తప్పడం లేదు. పార్టీకి కూడా మేలు జరిగేలా నేను వ్యవహరిస్తున్నాని మీరే పలుసార్లు అంగీకరించారు కూడా… అయినా ప్రతిసారీ మీకు చెప్పే కదా ఇదంతా చేస్తున్నాను అని విజయ్ అనడంతో సిఎం ముఖంలో రంగులు మారాయి.
ఇదంతా ఎందుకు నీ పనిలో నీవుండు. పార్టీ అందరిది కదా. అదే నేను మంత్రులకు వివరించా… ఇంకా నీపై ఫిర్యాదులు చేస్తుంటే ఇక చాలు అని మీటింగ్‌ను కూడా ఆపి బయటకు వచ్చా. అందరిని మెప్పించలేము కదా విజయ్. అంతా అదే సర్దుకుంటుంది.ఇవేమీ నీ కార్యకలాపాలకు అడ్డు రావు. ప్రశాంతంగా ఉండు అని సిఎం చెప్పడంతో విజయ్ కొంత భరోసా ఫీల్ అయ్యాడు. అన్నపూర్ణమ్మ గదిలోకి రావడంతో వారి మధ్య సంభాషణ నిలిచిపోయింది.
ఎప్పుడు రాజకీయాలేనా… విజయ్‌కు ఎవరున్నారని. ఒంటరిగా ఉంటున్నాడు. ఒక ఇంటివాడైతే బాగుంటుంది. మనమే పూనుకోవాలి కదా ఏమంటారంటూ సిఎంను ప్రశ్నించింది. ఆమె.
వద్దమ్మా ఇప్పడే పెళ్లి. ఈ కాలంలో అమ్మాయిలు కూడా 30 ఏళ్లు వచ్చినా తమ కెరియర్ ముఖ్యమంటూ వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నారు కదమ్మా. మళ్లీ ఎన్నికలు మరో రెండేళ్లలో జరుగుతాయి. అప్పటికి నాకు 30 ఏళ్లు దాటుతాయి. మీరే ముందుండి నాపెళ్లి జరిపిద్దురు కానీ అంటూ విజయ్ చెప్పడంతో అంతా నీయిష్టం అంటూ ఆ గది నుంచి వెళ్లిపోయింది.
ఎప్పటిలాగే నాకు ఉదయమే ఫోన్ చేసి రాష్ర్టంలో ఏమి జరుగుతుందో చెప్పాలి విజయ్. నాకు ఇంటలిజెన్స్ అధికారులిచ్చే వివరాల కంటే నీ నుంచి వచ్చే విషయాలు ముఖ్యమని నీకు తెలుసు కదా. కొద్ది రోజులుగా ఉదయం నీవు కాల్ చేయడం లేదు. రేపటినుంచి ఈ గ్యాప్ రావద్దు సరేనా అనడంతో ..
మీరు కొద్ది సేపు అయిన రెస్టు తీసుకోండి. మధ్యాహ్న భోజనం తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే తర్వాత హుషారుగా పనులు చేస్తారు మీరు అంటూ విజయ్ సెలవు తీసుకొని బయలుదేరుతూ మరోసారి అన్నపూర్ణమ్మ కాళ్లకు నమస్కరించి కదిలాడు.
మంత్రివర్గ సమావేశంలో తనపై దాడి చేసిన మంత్రులకు తిరిగి పత్రికా ముఖంగానే జవాబు ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నాడు. సచివాలయ అధికారులకు కొందరికి ఫోన్ చేసి తనకు కావాల్సిన సమాచారం తెప్పించుకున్నాడు. ఈ వివరాలన్నింటిని క్రోఢీకరించుకొనడానికి రెండు రోజుల సమయం తీసుకొని నిర్ధారణ చేసుకున్నాడు. తాను చెప్పేది ఏ కొద్ది సమాచారం కూడా అవాస్తమని మంత్రులు చెప్పలేని విధంగా వివరాలను సంపాదించాడు.
కీలక ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న పలు అవకతవకలను మీడియా కు వివరించిన విజయ్ సంతృప్తి ఫీలయ్యారు. చూద్దాం దీని తర్వాత అవినీతి మంత్రుల ప్రతిస్పంధన ఎలా ఉంటుందో వేచి చూడాలని అనుకున్నాడు.
మర్నాడు ఉదయం ముఖ్యమంత్రితో యధావిధిగా మాట్లాడిన విజయ్‌తో సిఎం ఈ వార్తల గురించి ప్రస్తావించలేదు. ఇతర విషయాలపై చర్చించారు. కానీ విజయ్ అనుకున్నట్లుగా మంత్రులు కొందరు నేరుగా ముఖ్యమంత్రి బంగ్లాకు వెళ్లి మరోసారి విజయ్ విషయం ఏదో ఒకటి తేల్చాలని గట్టిగా కోరినట్లు ఎలక్ట్రానిక్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్‌గా వచ్చింది.ఇది చూసి విజయ్ తాను ఇక నుంచి అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో ఆయన ఫోన్ రింగ్ అయింది.
మీడియా సమావేశంలో మీరు చెప్పిన వివరాలను పత్రికలో చదివాను. మంత్రుల ఆందోళన అంటూ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తున్నా… మీరు ప్రజల పక్షాన నిలబడటం ఆనందంగా ఉందని విరంచి అంటున్నది.
నిజంగానా.. అయితే నాకు ఈ విషయంలో మద్దతుగా నిలబడుతారా అంటూ విజయ్ ప్రశ్నించడంలో ఇందులో ఏదో శ్లేష ఉందని విరించికి అర్థమైంది. నాకు కూడా మీలాగే తెలుగు సాహిత్యంలో ప్రవేశం ఉందని గతంలోనే చెప్పాను. రెండు అర్థాలు ధ్వనించేలా మాట్లాడుతున్నారు మీరు.మీకు మద్దతుగా తప్పక ఉంటాను. ఏ విషయాల్లో మద్దతు కావాలో వివరంగా మాట్లాడుకుందాం ఇంటికి రండి అని ఆహ్వానించింది.
(సశేషం)