AP: వైద్య, ఆరోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
తాడేపల్లి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖలో నియామకాల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. వైద్యారోగ్యశాఖపై సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత సిబ్బందికి కావాల్సిన సిబ్బందిపై పూర్తి వివరాలను సిఎం అడిగి తెలుసుకొన్నారు. ప్రాథమిక ఆసుపత్రుల నుంచి బోధనాసుపత్రుల వరకు సుమారు 14,200 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉండకూడదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు.
ఈ మేరకు అక్టోబరు 1 నుంచి ప్రక్రియ మొదలుపెట్టి నవంబరు 15 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఈ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ..
‘ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నాం, తీరా అక్కడ చూస్తే.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి. సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నాం. ఇకపై దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని.. వైద్యం కోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలి. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా అడుగులు వేయాలని’ అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశం చేశారు.
వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్కు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ దాదాపు 14,200కు పైగా పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ తెలిపారు. ఈ ప్రక్రియను అక్టోబర్ 1న మొదలు పెట్టి నవంబర్ 15 నాటికి కార్యాచరణ పూర్తిచేసేలా ఉండాలన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ఆళ్ల నాని, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సలహాదారు గోవిందహరి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఏ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.