AP: దూసుకొస్తున్న `గులాబ్‌`

అమరావతి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉత్తరాంధ్ర తీరం వైపు గులాబ్‌ తుపాను దూసుకొస్తోంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కి.మీ. వేగంతోనూ.. గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈ నెల 27వ తేదీ వరకూ మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేర‌కు ఉత్తరాంధ్ర, ఒడిశాలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తుపాను తీరం దాటే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, సోంపేట, గంజాం జిల్లాల్లో మీటరు ఎత్తు వరకూ అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో చెట్లు నేలకొరిగే ప్రమాదం ఉంది. బొప్పాయి, అరటి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రైతులు అప్రమత్తంగా వ్యవహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ మేర‌కు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు సూచించారు.

ముందు జాగ్రత్తగా విశాఖపట్నంలో ఒక ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) బృందం, ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) బృందాన్ని సిద్ధంగా ఉంచారు. శ్రీకాకుళానికి మరో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న 86 వేల కుటుంబాలను గుర్తించి తుపాను షెల్టర్లకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అవసరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో 24 గంటలు పనిచేసేలా ‘స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ సెంటర్‌’ ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.