కర్షకుల కాలం కాదిది

పాలకుల పాలసీలే కాదు ప్రకృతి వైపరీత్యాలు
అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, కష్ట కాలం
కుంగదీస్తున్నాయి, కర్షకులను తలెత్తనీయకుండా
వర్షబీభత్సం, వరదల తాకిడి
పంటను చీల్చుకుంటూ కొట్టుకుపోతున్నది పొలం
భూమి కోత, ఇసుక మేటలు
చేతికి వచ్చిన పంట చెరువు పాలవుతుంటే
గుండె చెరువై, కన్నీటి సంద్రమై,బతుకు చింద్రమై
వినిపించడం లేదెవరికీ వారి యథార్థ గాథలు
కనబడటం లేదు వారి కన్నీటి వ్యథలు
పాలకులెవరైనా రైతుకు బంధువులనే ప్రచారమే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొసలి కన్నీరు
తీర్చేవి కావు, ఆర్చేవి కావు రైతుల కష్టాలు
బడాబాబుల కోసమే సవరణ చట్టాలని,
నినధిస్తున్నారు, నెలల తరబడి,
చల్లని చలిలో, వర్షతాకిడిలో
హలదారులు నిర్భందాల నడుమ సాగిస్తున్నారు
రోడ్డున పడి, ఉద్యమ పంథాను విడవకుండా
సాగు చట్టాల సవరణలేవైనా, మా మంచికి కావని
మార్కెటింగ్ వ్వవస్థలో మేలు ఎక్కడుందని
నడ్డి విరుగుతున్నది, కొత్త నియమనిబంధనలతోనని,
అలుపెరగని రైతుల ఆరుగాలం కష్టం
గిట్టుబాటుకు కడుదూరం ధాన్యాలు ఏవైనా,
అగ్గిపెట్టె, గుండిసూది, సబ్బుబిళ్ల సరుకేదైనా
ఉత్పత్తిదారుకే ధర నిర్ణయాధికారం అక్కడ
అక్కరరాదు ఏ చట్టం మరి అన్నదాతకు
అదే సౌలభ్యం ఎందుకు లేదిక్కడ
వరి ఉరి, పత్తికి పోవద్దు, నూనె గింజలు సరే
అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి
తూకంలో మోసాలు తేమ కోతల పర్వం
పైకం చేతికి వచ్చే నాటికి అప్పులకుప్పలు
సంప్రదాయ సాగును వదిలి రాలేక
వర్తమానమే కాదు, భయపెడుతున్న భవిష్యత్తు
గొంతుక వేలాడుతున్నది రుణ పాశానికి
అన్నీ లోటుపాట్లే,మార్పు ఎప్పుడా అని మనస్సు ఆరాటం
-కోనేటి రంగయ్య
సీనియర్ పాత్రికేయులు
తప్పక చదవండి:
తాలిబన్ అర్థం విద్యార్థి.. కానీ