మంచిర్యాల జిల్లా ఉపాధ్యాయుడికి `గ్లోబల్ ` అవార్డు

ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు. సమాజమనే దేవాలయానికి నిజమైన అర్చకుడు, రక్షకుడు. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు.
సాధారణ ఉపాధ్యాయుడు పాఠాల్ని బోధిస్తాడు. మంచి ఉపాధ్యాయుడు వాటిని వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు విశదీకరిస్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు స్ఫూర్తి అందిస్తాడు. ఇప్ప‌డు మ‌నం అలాంటి ఓ ఉపాధ్యాయుడి గురించి తెలుసుకుందాం….

మంచిర్యాల జిల్లాలోని నెన్నెల‌ జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయు ఉప్పలేటి శ్రీనివాస్ గ్లోబల్ టీచర్ 2021అవార్డుకు ఎంపికయ్యారు. `అలర్ట్ నాలెడ్జ్, ఏకేఎస్ ఇన్నోవేటివ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్` వరల్డ్ వైడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ సహకారంతో అందిస్తున్న‌ ఈ అవార్డు కు దాదాపు 110 దేశాల నుంచి సుమారు 2 లక్షల నామినేషన్లు వస్తాయి. అయితే ఇంత మందిలో కేవ‌లం 500 మందిని మాత్ర‌మే నిర్వాహ‌కులు ఎంపిక చేస్తారు.

ఉపాధ్యాయ వృత్తిలో మంచి బోధన నైపుణ్యాలు కలిగి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీస్తూ విద్యాప్రమాణాలు పెంపోందించుటకు కృషి చేస్తున్న వారికి ఈ అవార్డులను అందజేస్తారు.

అక్టోబ‌రు 10వ తేదీన 110 దేశాలకు చెందిన ఉపాధ్యాయులంతా ఈ అవార్డును తీసుకోనున్నారు. వీరిలో మ‌న శ్రీనివాస్ ఉన్నారు. అయితే ఈ అవార్డును వర్చువల్ మోడ్లో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా చూడవచ్చని శ్రీనివాస్ క్లిక్‌2న్యూస్‌కు తెలిపారు.

ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా ఉన్న శ్రీ‌నివాస్ విజ్ఞాన శాస్త్ర రంగంలో ఇప్ప‌టికే ఎన్నో అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు.
ఆయ‌న 2003లో ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించి వినూత్న‌మైన బోధన పద్దతులను అనుసరిస్తూ విద్యార్థుల కెరీర్‌కు చ‌క్క‌ని బాట‌లు వేస్తున్నారు. శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో స్టూడెంట్లు జవహర్లాల్ నెహ్రు మాథ్స్ అండ్ సైన్స్ ఎన్‌విరాన్మెంట్ ఎడ్యుకేషన్, ఇన్ స్పైర్ – మనాక్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్, సైన్స్ సెమినార్, సైన్స్ క్విజ్, బాలోత్సవ్ లలో ఎగ్జిబిట్స్ అండ్ కాంపీటీషన్లో ఆరు జాతీయ, 13 రాష్ట్ర స్థాయి, 35 జిల్లా స్థాయి అవార్డులను సాధించారు.

Leave A Reply

Your email address will not be published.