నేను, నాది అనే ఆలోచనే మానసిక సమస్యలకు సృష్టి..
మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ డైరెక్టర్ డా.హిప్నో పద్మా కమలాకర్

హైదరాబాద్ (CLiC2NEWS): నేను,నాది అనే ఆలోచనే మానసిక సమస్యలు పెరగడానికి కారణమని మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ డైరెక్టర్ డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. అక్టోబర్ 10 న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో గురువారం మానసిక సమస్యలపై మూఖాముఖి నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నేను’ నాది అనే అహం బుద్ధిని పక్కదారి పట్టించే ఆలోచనలకు ఆజ్యం పోస్తుందన్నారు. ఇవే మానసిక సమస్యలకు మూలాలన్నారు. వీటి కారణంగానే శారీరక, మానసిక రుగ్మతలు తలెత్తుతాయన్నారు.శరీర పోషణకు అన్నపానాదులు అవసరమైనట్టే, మానసిక ప్రశాంతతకు మంచి ఆలోచనలు అవసరమన్నారు.. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంత తాపత్రయపడతామో, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకూ అంతకంటే ఎక్కువ శ్రమించాలన్నారు. మనసు అశాంతిని, శాంతిని సృష్టించే విధంగా ఆలోచిస్తుందన్నారు. శాంతి ఆలోచనలు ఉత్తమ మార్గం వైపు నడిపిస్తే, అశాంతి మనసును అల్లకల్లోలంగా మార్చివేస్తుంది న్నారు. శరీర అనారోగ్యానికి వైద్యం అవసరమైతే, మానసిక అనారోగ్యాన్ని కలగజేసే ఆలోచనల్ని ఎల్లవేళలా అదుపులోఉంచుకోవాలన్నారు.
అసలు సమస్య అంతా మనసుతోనే: క్లినికల్ సైకాలజిస్ట్ హిప్నో సరోజా రాయ్
అందరికీ మానసిక ఆరోగ్యరక్షణ అవసరమని దీనిని నిజం చేద్దామని క్లినికల్ సైకాలజిస్ట్ హిప్నో సరోజా రాయ్ అన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్యదినం నిర్వహిస్తోందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది ఒక థీమ్‌ను తీసుకుని ప్రచారం చేస్తారన్నారు.. 2021లో అందరికీ మానసిక ఆరోగ్యం అనే అంశాన్ని ఎంపిక చేసుకున్నారన్నారు. ఈ ఏడాది ‘అసమాన ప్రపంచంలో మానసిక ఆరోగ్యం’ అనే అంశాన్ని ఎంచుకున్నారని చెప్పారు.
మనిషి ఇంటిని, ఒంటిని శుభ్రం చేసుకుంటాడే తప్ప మనసులోని మకిలివదిలించుకోడన్నారు. అసలు సమస్య అంతా మనసుతోనే నని తెలిపారు. ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, ప్రవర్తిస్తాడు, అందరితో ఎలా ఉంటాడు అన్న విషయం అతని మానసిక ఆరోగ్యస్థితిని నిర్దారిస్తుందన్నారు.మానసిక ఆరోగ్యమంటే మనకు చాలా చిన్నచూపు న్నారు.
మానసిక ఒత్తడి కలిగినప్పుడు… మనం ఒంటరి కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.
అసలు కుటుంబ సభ్యుల మధ్య మాటలే కరువయ్యాయని, ఫోన్‌లోనే జీవిస్తున్నారని తెలిపారు. మాటలే మందు..!పలకరించాలి. మాట్లాడుకోవాలి. గతంలో సాధించిన గెలుపు ఓటములను ప్రస్తావించాలని చెప్పారు. పరిస్థితులు మారుతాయిని చెప్పాలన్నారు. చిన్న విషయాలకు సైతం మథనపడేవారిని గుర్తించి కుటుంబ సభ్యులు, స్నేహితులు వారికి అండగా నిలవాలిచి, సైకోథెరపీ, హిప్నో థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, యాంటీ డిప్రెసెంట్ మందుల ద్వారా వారికి చికిత్స అందించాలన్నారు. ఎంతటి సమస్యనైనా సులభంగా ఎదుర్కోగలమనే స్థైర్యాన్ని అలవరచుకొంటే మానసిక సమస్యలు దరి చేరవన్నారు. ఈ కార్యక్రమం లో డా.హిప్నో కమలాకర్ గారి విజ్ఞానాన్ని జె డి ఇన్ఫ్ర గ్రూప్ జనరల్ మేనేజర్ ఎన్.ఎమ్.రావు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందచేయటానికి తీసుకున్నారని తెలిపారు. లెక్కల టీచర్ మాణిక్యం, సి.హెచ్.మంజు, విద్యార్థులు పాల్గొన్నారు.