విజయుడు (ధారావాహిక నవల పార్ట్-28)
ఇది లోకరీతి. అందులో ఎవరు మీ శత్రువులు అంటే ఏ ఒక్కరిని నేను వేలుపెట్టి చెప్పలేను కదా. అన్నాడు భజంగం. అంతా వింటున్న విజయ్
ఇలాగైతే ఎలాగండి,లోటుపాట్లు సరిదిద్దుకోవాలి కదా.. ప్రభుత్వం పట్టించుకోదు. ఈ మేరకు నియమించిన నిఘా సంస్థలన్నీ కళ్లు మూసుకుంటున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో లోపాలను సరిదిద్దకుంటే ప్రజాధనం ఏమి కావాలండీ… ఎవరో ఒకరు నడుం కట్టకపోతే సమాజం మరింతగా కుళ్లిపోతుందనేదే నా ఆవేధన. మీరుచెప్పిన ప్రమాదం నాకుంటుందని తెలుసు. దాడి జరుగుతుందనో ఇంకా ఎదో జరుగుతుందని నేను అందరిలాగా మౌనంగా ఉండలేను. నా నైజం అదికాదు. అందరం చూస్తూ ఊరుకుందామా చెప్పండి అంటూ ఆయన కళ్లలోకి సూటిగా చూశాడు విజయ్.
వెంటనే ఏమి చెప్పాలో అర్థం కాలేదు భుజంగానికి. వాస్తవాలు చెప్పమని మీరు అడితేనే ఈ విషయాలను ప్రస్తావించాను విజయ్ గారు. లోకం పోకడ ఇది. మీకు ఏమైనా జరగరానిది జరిగితే ప్రజలు సహించరు, మీ పట్ల జనంలో పెరుగుతున్న ఆదరణ అది. ఇది తెలిసే నీ శత్రువులు సాహసించడం లేదు. సామాన్య వర్తకులు, నేతలకు కూడా మీరంటే హడల్.
డిసెంబర్ 31 నాడు రాత్రి నూతన సంవత్సర వేడుకలంటూ మనం మీ హోటల్లోనే డిన్నర్ చేశాం. ఆరోజు నేను వెళ్లిన తర్వాత ఏమైంది? ఎందుకో నాకు కొంత అనుమానం ఉంది.నేను ముందుగా వెళ్లాను కదా, తర్వాత మిగిలిన వారెవరో నాపై దాడి జరాగే ప్రమీతమంటూ మాట్లాడారని అన్నారు. ఆయన ఎవరు, ఏ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మాట్లాడారో తెలిస్తే నాకు విషయం తెలుస్తుంది. ఈ క్లూతో తదుపరి కార్యాచరణ తీసుకోవాలనే మీతో ఈ చర్చ ప్రారంభించానన్నాడు విజయ్. చివరలో నిమ్మకాయ, వేడినీళ్లు ఉన్న బౌల్ తెచ్చిన బేరర్, సార్ మీరంటే మా అందరికీ ఎంతో అభిమానం. మీరు టివిలో కనిపిస్తే చాలు అందరం అక్కడ గుమికూడుతామని మాట్లాడుతూ.. యజమాని వైపు చూసి మౌనం వహించాడు. పని వదిలేసీ ఇవేమి పనులని ఆయన కోప్పడుతాడని భయపడ్డాడు. పర్వాలేదులే అంటూ భుజంగం అనేసరికి విజయ్ పట్ల తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ సెల్ఫీ కావాలని కోరారు. చేతులు కడుక్కొన్న తర్వాత అనడంతో సంతోషపడ్డాడు బేరర్.
దానికి అంత ప్రాధాన్యత లేదు విజయ్ గారు. మీ రాజకీయాలపై చర్చ జరిగింది వాస్తవం. తలోమాట అన్నారు. ముఖ్యమంత్రితో మీ సన్నిహితత్వం మాట్లాడుకున్నాం.కానీ మీ నిజాయితీ కూడా ప్రతిబంధకం అవుతుందని, మీలాంటి వ్యక్తులపై గతంలో జరిగిన దాడులు ప్రస్తావనకు వచ్చాయి. పోలీసు అధికారి కూడా ఇదే అన్నారు. మన మిత్రునిగా రాబోయే ప్రమాదాలపై ఆయనను హెచ్చరిస్తే మంచిదని మాత్రమే మేం అందరం అనుకున్నాము కానీ మీకు వ్యతిరేకంగా ఎవరూ ఏమి అనలేదు. అనరు కూడా..మేమంతా మీ శ్రేయోభిలాషులమే. ప్రమాదం ఎక్కడ నుంచి అనేది మాకు తెలియదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పాలనుకున్నామే కానీ ఇతరత్రా కాదు. అంటూ ముగించాడు భుజంగం.
అంటే ఢల్లీి ప్రమాదంతో వీరెవరికీ సంబంధం లేదు.ఎలాంటి క్లూ రాలేదు.మరిఎలా తెలుసుకునేది అంటూ తన భావనలు బయటకు కనిపించకుండా కళ్లు మూసుకున్నాడు విజయ్.
విజయ్ గారు పెద్దగా ఆలోచించకండి.మీ మంచితనమే మిమ్ములను కాపాడుతుంది. పైన దేవతలున్నారు. మంచి మనస్సు ఉన్న మీకు వారి చల్లని దీవెనలుంటాయన్నాడు భుజంగం. ఢన్నిర్ పూర్తిచేసి టైం చూసుకున్నారు. మీరు డ్రిరక్ తీసుకోనందున నేను తగ్గించాను. అందుకే తొమ్మిది గంటలకే పూర్తి చేశాం కదా అన్నారు. ఇద్దరు ఛాంబర్ నుంచి బయటకు రాగానే హాల్లో కలకలం. ఒక్కసారిగా పది మంది విజయ్‌పైకి దూకడానికా అన్నట్లుగా ముందుకు వచ్చారు. అలర్టు అయిన భుజంగం తన సిబ్బందిని బిగ్గరగా పిలిచి అలర్టు చేశారు. వారంతా అక్కడి చేరారు. దాడికి సిద్దమైనట్లుగా వచ్చిన వారు విజయ్‌తో వాగ్వివాదానికి దిగి, ఎక్సయిజ్ మాజీ మంత్రిపై ఎందుకు ఆరోపణలు చేశారంటూ నిలదీస్తూ మీదిమీదికి రావడంతో పాటు ఆయన చొక్కాపట్టుకొని కుదిపివేశారు.దీంతో ఒక్కసారిగా వారిని విదిలించుకొని, విజృంభించాడు విజయ్. ఫట్‌ఫట్ అని శబ్దం మాత్రమే వినబడిరది. హోటల్ సిబ్బంది రక్షణకు వచ్చే లోగానే విజయ్ తనపై దాడికి వచ్చిన వారిని గట్టిగానే ఎదిరించాడు. అయిదారుగురు దెబ్బలకు తట్టుకోలేక పరుగందుకున్నారు. ఇంకా మిగిలిన అగంతకుల్లో ఒకడు చాకు తీసి ముందుకు రావడానికి ప్రయత్నించగా, ఒడుపుగా తప్పించుకొని ఒక కిక్ ఇచ్చాడు, ఈ సమయంలో వాని చాక్ చేతికి కొద్దిగా తాకింది. రక్తం కూడా కనిపించడంతో రెచ్చిపోయిన విజయ్ ఒక్కరొక్కరిని దునుమాడారు. కసరత్తు చేసిన శరీరం కావడంతో ప్రత్యర్థులను మట్టిగరిపించారు. ఈ దశలో హోటల్ సిబ్బంది పిడిగుద్దులు గుద్దుతూ వారందరినీ పంపించివేయగా తమ నేతకు అనుకూలంగా నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు.
ఈ హఠాత్తు పరిణామానికి భుజంగం కూడా ఖిన్నుడయ్యాడు. తన అతిధిగా వచ్చిన విజయ్‌పై దాడి ప్రయత్నం ఏమిటని ఆందోళనలో పడ్డారు. హోటల్లో వేరే కార్యక్రమానికి వచ్చిన మీడియా సిబ్బంది ఇదంతా షూట్ చేయడంతో వారిని వారించడం కూడా సాధ్యం కాలేదు. వెంటనే అన్ని టివిల్లోనూ ఈ విషయం బ్రేకింగ్ న్యూస్‌గా వచ్చింది. విజయ్‌తో మాట్లాడేందుకు మీడియా ముందుకు వస్తుండగా వారిని సముదాయించి బయటకు పంపిన భుజంగం వెంటనే విజయ్ను తీసుకొని తిరిగి తన ఛాంబర్‌కు వచ్చాడు.చేతికి తగిలిన కత్తిపోటు చిన్నది కావడంతో బ్యాండేజీ తెప్పించి వేశాడు. జరిగిన దుర్ఘటనకు సారీ చెబుతూ మీరు ఇక్కడికి వచ్చినట్లుగా వారికి ఎలా తెలిసిందని మధనపడ్డారు. టివిల్లో కీలక వార్తగా వస్తున్న విజయ్దాడి విషయాన్ని తెలుసుకున్న పోలీసు అధికారి హోటల్‌కు చేరుకున్నారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి సిసి కెమరాల ఫుటేజీని పరిశీలించే పనిలో పడ్డాడు. మీడియా వాళ్లు డిసిపిని కలసి వివరాలడిగారు. సిసి పుటేజ్ ఆధారంగా నింధితులను పట్టుకుంటామని, దీని వెనుక ఎంత పెద్దవారున్నా వదలమని మీడియాకు చెప్పారు. అయితే ఎక్సయిజ్ మాజీ మంత్రికి అనుకూలంగా నినధించారని చెప్పడంతో దర్యాప్తుచేసి తప్పక చర్యలు ఉంటాయన్నారు.
విజయ్‌పై దాడి విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మీడియా కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. విజయ్ ఫోన్ నిరవధికంగా మ్రోగుతున్నది. విషయం తెలుసు కాబట్టి ఫోన్ కూడా తీసుకోలేదు. ఎలా జరిగిందనే విషయంపై భుజంగం ఆరా తీసాడు. విజయ్ అంటే వీరాభిమానం ఉన్న బేరర్, డిన్నర్ విషయం తోటి సిబ్బందికి తెలపడంతో అందరూ చర్చించుకుంటుండగా అక్కడికి వచ్చిన వారు తెలుసుకున్నట్లుగా వెల్లడైంది. విజయ్ గారు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.పదండి మీ క్వార్టర్లో దింపి వస్తానంటూ భుజంగం అనడంతో కాదనలేకపోయాడు. విజయ్ కారు తాళాలు తన సిబ్బందిలో ఒకరికి ఇచ్చి తన కారువెంట ఫాలో కావాలని చెప్పాడు.
కారులో కూర్చున్న విజయ్‌కు నేరుగా ముఖ్యమంత్రి నుంచి ఫోన్. దెబ్బలు తగలలేదు కదా, గాయం ఎలా ఉంది, అసలు ఎక్కడికెళ్లావ్, ఎలా జరిగిందంటూ ఆరా తీసాడు. కొద్దిగా గీసుకుపోయింది, ఇబ్బంది ఏమీలేదంటూ అన్ని వివరాలు చెప్పాడు విజయ్. డిజిపికి చెప్పాను, వెంటనే గన్మెన్లను అలాట్ చేయమని, ఆయన నీకు ఫోన్ చేస్తాడు, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, నీవే వద్దని మొండికేసావు. శత్రువులు ఏ రూపంలో అయినా రావచ్చు… మనం కూడా ఎవరికీ అవకాశం ఇవ్వకుండా తగిన రక్షణలో ఉండాలంటూ సిఎం హితబోధ చేశారు.
సిఎం జానకి రామయ్య ఫోన్ పెట్టేసిన మరుక్షణమే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి డిజిపి నుంచి కాల్, క్షేమ సమాచారాలు తెలుసుకొని,కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, రేపు ఉదయమే మీ దగ్గరికి గన్మెన్లు వస్తారని చెప్పారు.
కాదు సార్, నేను ఒక్కడినే ఉంటున్నాను, ఎక్కడపడితే అక్కడ తింటా, అంగరక్షకులంటూ ఉంటే వారి బాగోగులు ఎలా చూడాలి సార్. వద్దని పట్టుబట్టాడు విజయ్
లేదూ, ముఖ్యమంత్రిగారు గట్టిగా చెప్పారు. తప్పదు విజయ్‌గారు. గన్మెన్లకు మీరేమి చూసుకోవాల్సిన పనిలేదు. వారే తమ ఆహారం తెచ్చుకుంటారు. వారికి మీరు ఏమీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయక్కర లేదు.మీరు ఎక్కడికి వెలితే అక్కడకు వస్తారు అంతే.కానీ మీ వాహనంలోనే వారు తప్పక ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది మీకు అభ్యంతరకమైనా తప్పదు.
కారులో వారుంటే నాకేమి అభ్యంతరం ఉండదు కానీ పాపం వాళ్లకు సమయానికి భోజనం ఉండదేమోనని నసిగాడు విజయ్.
అదంతా వారే చూసుకుంటారు. కేసు విషయంలోనూ డిసిపితో మాట్లాడాను. నిందితులను వెంటనే పట్టుకుంటాం, మీరు నిశ్చింతగా ఉండండి అటూ కాల్ కట్ చేశాడు డిజిపి.
ఇలాంటి సంఘటనలు జరుగుతాయని మనం ఊహించలేము కదా, అయినా గన్మెన్లు ఎంతవరకు రక్షణ కల్పించగలరో నాకు అర్థం కావడంలేదు. మనం డిన్నర్ చేసే సమయంలోనూ అంగరక్షకులను పెట్టుకోలేం కదా. మన ఇద్దరం బయటకు వచ్చాం. ఆకస్మికంగా వారు వచ్చి దాడి చేస్తుంటే గన్మెన్లు కాల్పులు జరుపగలరా? ఏమో సిఎంగారి ఆజ్ఞ అట. ఉండనీయండి అని భుజంగంతో అన్నారు విజయ్.
మీరు ఇప్పటికే రక్షణ తీసుకొని ఉంటే బాగుండేది. మీ నీడంట వారు తప్పక ఉంటారు. దాడి చేసే వాళ్లు కూడా భయపడుతారని భుజంగం వివరించారు. ఈ లోగా క్వార్టర్స్ రావడంతో విజయ్‌కు గుడ్‌బై చెప్పారు. వీరి వెనుకనే విజయ్ కారు కూడా రావడంతో దానిని పార్కు చేసి సిబ్బంది తాళం చెవి అందించారు. థాంక్స్ చెప్పి తన గదిలోకి వెళ్లిన విజయ్ పరిస్థితిని సమీక్షించుకుంటూ సెల్ఫోన్లో రికార్డు అయిన మిస్సుడ్ కాల్స్‌ను పరిశీలించారు. చాలా మంది నెంబర్లు ఉన్నాయి. రేపు ఉదయం వాళ్లకు మెసేజి ఇద్దామనుకుంటూ బెడ్‌మీదకు వెళ్లాడే కానీ నిద్ర రావడం లేదు. ఈ కాల్స్‌లో విరంచి నుంచి నాలుగైదు ఉండటం విజయ్‌కు కొంత ఊరటనిచ్చింది.
ముఖ్యమంత్రిలో అసహనం. ఎవరు చేయించారు ఈ పని. అధిష్ఠానం నుంచి ఎలాంటి మాట వస్తుందోననే ఆందోళన ఎక్కువైంది. వాడసలే హస్తిన బేబీలాగా ఉన్నాడు. వానిపై ఈగవాలినా వారు తట్టుకోలేరు. ఢల్లీి నుంచి ఫోన్ వచ్చినా రావచ్చు అనుకుంటున్న సిఎం ఫోన్ రింగ్ కావడంతో ఒక్కసారి టెన్షన్ ఫీలయ్యాడు. కానీ మాజీ మంత్రి నుంచి వచ్చిన ఆ కాల్ రిసీవ్ చేసుకుంటూనే…ఏం బుద్దిందా? ఏమిటిది..మనం అనుకున్నదేమిటి జరిగింది ఏమిటీ. కొన్నాళ్లు వేచి చూస్తే తర్వాత పదవి గురించి ఆలోచిద్దమన్నాను కదా ఎందుకు పంపావు రౌఢీలనంటూ సిఎం అగ్గిమీద గుగ్గిలయ్యాడు.
అదేమిటి సార్ అలా మాట్లాడుతారు. అంత పిచ్చిపని నేనెందుకు చేస్తాను.వాళ్లు ఎవరో నాకు ప్రత్యక్షంగా తెలియదు కూడా. అయితే గియితే ఏదోపని కోసం నా వద్దకు వచ్చి ఉంటారు. నేను సహాయం చేసి ఉంటాను. అంతేసార్. నాకు సమస్య వచ్చిందని వారు రియాక్టు అయి ఉంటారే తప్ప నేను ఎవరినీ పురమాయించలేదు. నా మాట నమ్మండి అంటూ మాజీ మంత్రి లబోదిబో అన్నాడు.
పోలీసులు వారిని పట్టుకొని వస్తే నీ పేరు చెబితే నీకే నష్టం చూడు నీ చేష్టలు ఎన్ని ఇబ్బందులకు కారణమవుతున్నాయో. నీకు సంబంధం లేదంటే ఎవరూ నమ్మరు. రేపు పత్రికలన్నీ నిన్నే అపరాధిగా ముద్రవేస్తాయి. దీనికంటే రాష్ట్ర ప్రజలు ఎలా రియాక్టు అవుతారో అనే భయం ఉందయ్యా నాకు. అధిష్ఠానం ఏమి ఆదేశిస్తుందో అన్నీ సమస్యలే..నీ మీదికి రాకుండా చూసుకో..లేకుంటే స్వంత పార్టీ ఎంఎల్ఎపైనే దాడి చేయించావనే అపఖ్యాతితో నీ రాజకీయ భవిష్యత్తుకే మరింత నష్టం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి మెచ్చరించారు.
నాకు అలాంటి దురుద్ధేశ్యమేదీ లేదు సార్, రాజీనామా ఇచ్చిన సందర్భంలో కూడా, విజయ్ను కంట్రోల్ చేయాలని మిమ్ములనే కోరాను కానీ,ఎలాంటి ప్రతికారం ఆలోచన కూడా రాలేదు నాకు.
వారు భయపడినట్లుగానే దాదాపు అన్ని పత్రికల్లోనూ విజయ్‌పై దాడి వార్తలు ప్రముఖంగా పబ్లిష్ అయ్యాయి. దీని వెనుక తప్పక మాజీ మంత్రి హస్తం ఉండి ఉంటుందని మీడియాలో విశ్లేషణలు వచ్చాయి.
విజయ్‌పై దాడి జరిగిందనే వార్తలు ప్రజల్లో అధిక ప్రభావాన్నే చూపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికివారు స్పంధించి రోడ్డుమీదికి వచ్చారు. ఎవరూ చెప్పకుండానే వ్యాపార సంస్థలు, దుకాణాలు వారంతవారే బందు పాటించారు. షాపులకు తాళాలు తీయకుండానే స్వచ్ఛందంగా నిరసన పాటించారు. పెద్ద గ్రామాల నుంచి మొదలు మండల కేంద్రాలతో పాటు పట్టణాలు, నగరాల్లో ప్రజలు ఆందోళనకు దిగారు. ముందు జాగ్రత్తగా పోలీసు అధికారులు కూడా కూడళ్లలో పికెంటింగ్ పెట్టారు. బస్సుల దహనాలు, ఇతర నష్టం జరుగుతుందనే భయంతో ఆర్టీసీ అధికారులు బస్సులను నిలిపివేశారు. మండల రెవెన్యూ కార్యాలయాలన్నింటి వద్ద జనం గుమికూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేస్తూ విజయ్‌పై దాడికి భాద్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు కనిపించడంతో, ఇదే సమాచారాన్ని పోలీసు ఇంటలిజెన్స్ విభాగం ముఖ్యమంత్రికి తెలియజేసింది. ఇద్దరు యువకులు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేయగా పోలీసులు సకాలంలో రక్షించారని, ప్రభుత్వం వెంటనే స్పంధించకుంటే పరిస్థితి దారణంగా ఉంటుందని కూడా ఇంటలిజెన్స్ వర్గాలు తెలపడంతో ముఖ్యమంత్రికి ముచ్చెమలు పట్టాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుంచి ఇలాంటి వార్తలే రావడంతో సిఎంకు ఆందోళన మరింత పెరిగింది. తనపక్కనే ఉండి మాట్లాడే విజయ్‌కు ఇంత పాపులారిటీ ఏమిటా అని మధనపడసాగాడు. మీడియాలో వస్తున్న వార్తల ప్రభావంతో యువకులుమరింతగా రెచ్చిపోతూ ప్రభుత్వ ఆస్తులకు డ్యామేజీ చేస్తున్నారు. ఒక నగరంలో జరిగిన ఇలాంటి సంఘటన టివిల్లో ప్రసారం కాగానే అన్ని పట్టణాలు, మండల కేంద్రాలకు విస్తరించింది.
యువకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు ప్రకటిస్తూ ఆందోళనలను ఉదృతం చేశారు.అధికార పార్టీ శాసనసభ్యునికే రక్షణ లేకుంటే పరిస్థితి ఏమిటనే విధంగా టివిలో చర్చలు వస్తున్నాయి. పరిస్థితి చేయిదాటక ముందే స్పంధించతప్పదని భావించిన ముఖ్యమంత్రి, డిజిపికి ఫోన్ చేశాడు. వెంటనే విజయ్‌తో మాట్లాడి తాను సేఫ్‌గా ఉన్నానని, ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని, ప్రజల ఆస్తులను విధ్వంసం చేయవద్దని ప్రకటన ఇప్పించాలని ఆదేశించారు. దీంతో విజయ్‌కు గన్మెన్లను ఇవ్వడంపై రాత్రి నిర్ణయించుకున్నందున సంబంధిత అధికారికి ఫోన్ చేసి, వారిని వెంటపెట్టుకొని క్వార్టర్స్‌కు రావాలని చెప్పాడు డిజిపి.
డిజిపి స్వయంగా విజయ్ వద్దకు వెళ్తున్నారని సమాచారం రావడంతో మీడియా మొత్తం ఎంఎల్ఎ క్వార్టర్‌కు బయలు దేరింది. పోలీసు ఉన్నతాధికారి ఒక్కడే విజయ్ ఇంటికి వెళ్లి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు.
జరుగుతున్న సంఘటనలు నన్ను కలిచి వేస్తున్నాయి, డిజిపి గారు. ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో కానీ ప్రజల్లో ఇంతటి ఆందోళన వస్తుందని నేను కూడా అనుకోలేదు. నేనే మీడియాను పిలిచి చెబుదామని కిందికి వస్తుండగామీరు వచ్చారు. ఉదయం నుంచి మీడియా ఇక్కడే ఉంది. వెల్దాం పదండి అంటూ విజయ్,డిజిపిని కూడా తీసుకొని మీడియా ముందుకు వచ్చారు.
శాసనసభ్యునికే రక్షణ కల్పించలేని విధంగా పరిస్థితులు ఎందుకు ఏర్పడినాయని మీడియా వాళ్లు ముందుగా డిజిపి పైనే ప్రశ్నలు ఎక్కుపెట్టారు.
విజయ్ గారి గురించి మీకందరికీ తెలుసు. ఎవరికీ కూడా కలలోనూ హాని తలపెట్టని మనస్తత్వం ఆయనది. నేనే స్వయంగా ఎన్నో సార్లు గన్మెన్ల రక్షణ కల్పిస్తానని చెప్పినా ఆయనే తీసుకోలేదు. ఇప్పుడు ఆయన వద్దంటున్నా, ఇద్దరు అంగరక్షకులు ఎప్పుడూ ఆయన వెంట ఉండేలా నియమిస్తున్నాను. పగలు, రాత్రి రెండు షిఫ్టులు ఇద్దరు చొప్పున రక్షణగా ఉంటారని, స్పష్టంచేశారు. ఈ లోగా పోలీసు అధికారి ఒకరు తీసుకువచ్చిన కానిస్టేబుళ్లను మీడియాకు చూపారు. నింధితుల ఆచూకీ తెలిసింది. వారిని వీలైనంత తొందరగా అరెస్టు చేస్తామని డిజిపి ప్రకటించారు. వెంటనే విజయ్ మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. మీ అధారాభిమానాలుకు కృతజ్ఞతలు. రౌఢీ మూకలు దాడికి ప్రయత్నిస్తే వారికి నేను అప్పుడే బుద్ది చెప్పాను. మీరు టివిల్లో చూశారుగా..చిన్న గాయమే ఇది అంటూ చేయి చూపుతూ…నేసు సురక్షితంగా ఉన్నాను. నాపై అభిమానంతో మీరంతా నిరసన తెలపడం అర్థం చేసుకుంటున్నా కానీ, మీరు మన ఆస్తులకే నష్టం కలిగిస్తే ఎలా…ఇది మనందరి ఆస్తి. మనందరం పన్నుల రూపేణ ప్రభుత్వ ఖజానాకు జమచేసిన ఒక్కోపైసానే ఈ ప్రభుత్వ ఆస్తి. జాగ్రత్తగా వినండి ప్రజలారా…మనం రేయనక, పగలనకా, శ్రమించి కూడబెట్టిన ధనంతోనే ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టినా, భవనాలు నిర్మించినా, ఏ చిన్న పని చేసినా ఈ ఖజానా నుంచే ఖర్చు చేస్తుంది… ఇది మీ డబ్బు. మీశ్రమ. దయచేసి ఎవరూ ఇలాంటి అరాచకాలకు పాడుపడవద్దు. నేను త్వరలో అన్ని జిల్లాలు పర్యటిస్తాను. మీ ముందుకు వస్తాను. ఏమైనా ఇబ్బందులుంటే కలసి మాట్లాడుకుందాం. వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించేందుకు నేను చొరవ తీసుకుంటాను.మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ప్రజల పక్షపాతి, మీరే చూశారు అవినీతి ఆరోపణలు రాగానే మంత్రిని కూడా ఉపేక్షించకుండా రాజీనామాతీసుకున్నారు. ఆయన నాయకత్వంలో మనందరం రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది వైపు అడుగులు వేసేలా ప్రయత్నిద్దాం.ఎల్లవేళలా అంకిత భావంతో మీ బాగు కోసం,శ్రేయస్సు కోసం పాటుపడతానంటూ విజయ్ చేసిన ప్రసంగం లైవ్‌లో అంటే ప్రత్యక్ష ప్రసారాల ద్వారా రావడంతో అది ప్రజలపై అధిక ప్రభావమే చూపింది. ఆ తర్వాత ఎలాంటి అవాంచనీయ సంఘటనలు రిపోర్టు కాకపోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
ముఖ్యమంత్రి కూడా రిలీఫ్ పీలయ్యాడు. లంచ్ సమయానికే అంతా సద్దుమణగడంతో సిఎం ఇక సమస్య లేదని భావిస్తున్న సమయంలోనే ఫోన్ మోగింది. సార్, ఢిల్లీ నుంచి అంటూ కాల్ కనెక్టు చేశాడు పిఎ. అనుకున్నట్లే అయిందనుకుంటూ…
నమస్కారం సార్, అంతా సద్దుమణిగింది, మన ఎంఎల్ఎ విజయ్‌కు పూర్తి రక్షణ కల్పించాం. నింధితులను గుర్తించామని రౌండప్ చేస్తున్నట్లు డిజిపి ఇప్పుడు చెప్పాడు. అంతా కంట్రోల్లో ఉంది సార్ అంటూ వివరణ ఇస్తున్నా, అవతలివైపు వార్నింగ్‌లు రావడంతో ఫోన్ పెటేసి, తలపట్టుకు కూర్చున్నారు.
ఈ కొత్త తలనొప్పులు ఏమిటా అంటూ ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళనలో పడ్డారు. రిపోర్టర్‌గా మంచి ప్రతిభ కనబరుస్తున్న విజయ్ను గుర్తించి తానే రాజకీయ ప్రవేశం కల్పించి,ఎంఎల్ఎ టికెట్‌కూడా అందిస్తే వాడు గెలిచి తన సీటుకిందికే నీళ్లు తెచ్చేలా ఉన్నాడేమిటి అంటూ మరింత బాధపడ్డాడు. పైగా ఇతర శాసనసభ్యులు, మంత్రుల కంటే వాని మీదనే ఎక్కువ అభిమానం చూపుతున్నా కూడా వాని వల్లనే హైకమాండ్ నుంచి హెచ్చరికలు రావడం మరింతగా కృంగ దీసింది సిఎంను. ఏదో ఒకటి చేయాలి. మరోసారి ప్రమాదం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దృఢ నిశ్చయానికి వచ్చాడు. తన ఆలోచనలకు భంగం కలిగిస్తూ ఫోన్..
ఏమండీ, విజయ్ ను చూడాలి. పిఎ తన కాల్ తీసుకోవడం లేదంటున్నాడు…మీరైనా మాట్లాడి ఇంటికి తీసుకురండి అంది అన్నపూర్ణమ్మ . ఆమె ప్రాదేయపడుతున్నట్లుగా మాట్లాడుతున్నా, సిఎంకు చికాకుగానే ఉంది. వాడి వల్ల నాకు ఎంతగా సమస్య వస్తుందో తెలియని పూర్ణ పదేపదే వాన్ని వెనుకేసుకొస్తున్నట్లుగా ఉంది. కోపం కనిపించకుండా, నీ స్వంత ఫోన్ నుంచి కాల్ చేసి పిలువు వస్తాడంటూ కాల్ కట్ చేశాడు. భర్త కాల్ అయిపోగానే విజయ్‌కు తన ఫోన్ నుంచి కాల్ చేసింది. వెంటనే ఫోన్ తీసుకున్న విజయ్, అమ్మా నేనే కాల్ చేద్దామనుకున్నాను. నాకు ఏమీకాలేదమ్మా అంటూ చెప్పాడు. లేదురా నీవు వెంటనే బంగ్లాకు వచ్చేయి. నిన్ను చూడాలిరా అంటూ ఆప్యాయంగా పిలిచింది. టివిలో చూసి ఎంత కంగారు పడ్డానో తెలుసా. వెంటనే ఫోన్ చేయించా. నీ ఫోన్ రావడం లేదని చెప్పాడు పిఎ. నాలుగైదు సార్లు చేశాడట, ఉదయం కూడా కాల్ చేసినా నీ నుంచి జవాబు రాలేదట. ఎలా ఉన్నావురా, అయ్యో ఎవరురా వాళ్లు, నీపైకి ఎందుకు వచ్చారు అంటూ ఆవేధన చెందింది. సాయంత్రం వస్తానమ్మా, తప్పక వస్తా ఆన్నాడు. లేదురా వెంటనే రాలేవా, లేదు అమ్మా, కొందరు మనుష్యులున్నారు, వారితో మాట్లాడుతున్నా, అనగానే సరే, సాయంత్రం తప్పక రావాలి, వచ్చేయి.. మాతోపాటు రాత్రి భోజనం కూడా చేద్దువు కానీ అంటూ కాల్ కట్ చేసింది.
(సశేషం)