TS: హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతపై హైకోర్టులో పిల్‌

హైదరాబాద్ (CLiC2NEWS): హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతపై తెలంగాణ హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖలైంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను నిలిపివేయాల‌ని కోరుతూ సామాజిక వేత్త మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిష‌న్‌లో ఇసి, సిఇఒ, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌తివాదులు గా పేర్కొన్నారు.

హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక‌ల దృష్ట్యా ద‌ళిత‌బంధు నిలిపివేయాల‌ని ఇసి ఆదేశించింది. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యం స‌హేతుకంగా లేదు, రాజ్యాంగ విరుద్ధంగా ఉంద‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. ఇప్ప‌టికే కొన‌సాగుతున్న ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను నిలిపివేయాల్సిన అవ‌స‌రం లేద‌న్న విష‌యాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింద‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టి కే కొన‌సాగుతున్న మిగ‌తా ప‌థ‌కాల జోలికి వెళ్ల‌కుండా కేవ‌లం ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని మాత్ర‌మే ఆపాల‌ని ఈసీ ఆదేశించ‌డం స‌హ‌జ న్యాయ‌సూత్రాల‌కు విరుద్ధ‌మ‌ని పిటిష‌న్‌లో వివ‌రించారు. హూజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళిత‌బంధు అమ‌లు చేసే విధంగా ఆదేశాలు జారీచేయాల‌ని పిటిష‌న‌ర్ కోరారు.

కాగా మొదట ద‌ళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌లో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన విషయం తెలిసిందే. హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికలు పూర్తయ్యే వరకు దళితబంధు పథకం అమలును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్‌ చేస్తూ మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టును ఆశ్రయించారు.

Leave A Reply

Your email address will not be published.