ఇంటర్ పరీక్షల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో తాము జోక్యం చేసుకోలేమ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ నెల (అక్టోబ‌రు) 25 నుంచి జ‌ర‌గాల్సిన ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర త‌ల్లిదండ్రుల సంఘం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై ఉన్న‌త న్యాయ‌స్థానం ఇవాళ అత్య‌వ‌స‌ర విచార‌ణ చేప‌ట్టింది. ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దని పిటిషనర్ కోరారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను రెండో సంవత్సరానికి పంపుతున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయాన్ని ఉన్నత న్యాయస్థానానికి గుర్తుచేశారు. ఈ నిర్ణయం తర్వాత విద్యార్థులంతా ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ పాఠాలు చదువుకుంటున్నారని, ఇలాంటి సమయంలో మళ్లీ ఫ‌స్ట్ ఇయ‌ర్ పరీక్షలు నిర్వహిస్తే వారు గందరగోళంలో పడిపోతారని తల్లిదండ్రుల తరఫు న్యాయవాది వాదించారు.

విద్యార్థులు కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు కూడా రాయలేదని, వచ్చే ఏడు కూడా ఏవైనా అవాంతరాలు వచ్చి ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు కూడా రాయలేకపోతే ఈ విద్యార్థుల నైపుణ్యాలను ఎలా పరిగణించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని ఇంటర్‌ బోర్డు తరఫు న్యాయవాది వివరించారు.

ఈ నెల 25 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా.. ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలపింది. ఉన్నత న్యాయస్థానం నిర్ణయంతో తల్లిదండ్రుల సంఘం పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

Leave A Reply

Your email address will not be published.