27న ఉస్మానియా వర్సిటీ స్నాతకోత్సవం
హైదరాబాద్ (CLiC2NEWS): ఉస్మానియా వర్సిటీ 81వ స్నాతకోత్సవం అక్టోబరు 27వ తేదీన జరుగనుంది. ఈ వేడుక ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 9.30 లకు ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి వర్సిటీ చాన్స్‌లర్ హోదాలో తెలంగాణ గవర్నర్ తమిళిసై , ముఖ్య అతిథిగా డీఆర్డీవో చైర్మెన్, కేంద్ర రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి హాజరుకానున్నారు.
ఈ స్నాతకోత్సవంలో 2018-2019, 2019-2020 విద్యాసంవత్సరాలకు సంబంధించిన స్వర్ణ పతకాలు, ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు సాధించిన వారికి వాటిని ప్రదానం చేయనున్నారని ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు.
అలాగే ఈ స్నాతకోత్సవ వేడుకల్లో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ యూనివర్సిటీ నివేదికను సమర్పిస్తారు.
బంగారు పతకాలు, ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు సాధించిన అభ్యర్థులు అక్టోబరు 23, 24 తేదీలలో వర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ కార్యాలయంలో గుర్తింపుకార్డులు, ఆహ్వాన పత్రాలు పొందాలని అధికారులు సూచించారు.