ఉస్మానియా వర్సిటీలో మాదక ద్రవ్యాలపై అవగాహన
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో మాదకద్రవ్యాల నిరోధానికి పోలీసు శాఖ నడుం బిగించింది. యువతలో అవగాహన కల్పించడానికి చర్యలు చేపడుతోంది. మాదకద్రవ్యాలు తీసుకోవడం వలన కలిగే అనర్థాలపై కళాశాలలు, పాఠశాలల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాదక ద్రవ్యాలపై అవగాహన నడక నిర్వహించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్-గంజాయి రహిత హైదరాబాద్’లో భాగంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదక ద్రవ్యాల అవగాహన వాక్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాదకద్రవ్యాలను తీసుకోవడం వలన కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. దేశవ్యాప్తంగా మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడ (హైదరాబాద్) మాదక ద్రవ్యాల సమస్య అంతగా లేదని తెలిపారు. అయినప్పటికి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఓయూ వీసీ రవీందర్, పోలీసు సిబ్బంది, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.