తెలంగాణ‌లో `త్రీ` ఐ సూత్రాన్ని పాటిస్తున్నాం: మంత్రి కెటిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్‌ నగరం గూగుల్‌కు గుండెకాయ, అమెజాన్‌కు ఆయువుపట్టులాంటిదని టిఆర్ఎస్ కార్య‌నిర్వ‌హ‌క అధ్య‌క్షుడు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల‌ మంత్రి కెటిఆర్ అన్నారు. హైద‌రాబాద్లోని హైటెక్స్‌లో సోమ‌వారం జ‌రిగిన టిఆర్‌ఎస్‌ ప్లీనరీలో మంత్రి పాలన సంస్కరణలు, విద్యుత్‌, ఐటి, పారిశ్రామికాభివృద్ధిపై తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ .. ఇండియాకి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల నిండిన సందర్భంగా గతేడాదిన్నర క్రితం కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించిందని, ఈ సందర్భంగా ఏరకమైన కార్యక్రమాలు చేస్తే నవభారతాన్ని నిర్మించవచ్చో సూచనలు ఇవ్వండని వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని ప్రధాని ఆహ్వానించారన్నారు. పార్టీ తరఫున కార్యనిర్వహక అధ్యక్షుడిగా తాను సమావేశానికి హాజరయ్యానని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలో `త్రీ ఐ` సూత్రం పాటిస్తున్నామ‌ని ప్ర‌ధాని మోడీకి వివ‌రించిన‌ట్లు చెప్పారు. ‘త్రీ ఐ’ అంటే ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూసివ్‌ గ్రోత్‌ అని వివ‌రించారు.

శాంతిభద్రలు పటిష్టంగా ఉంటానే రాష్ట్రం సురక్షితంగా ఉంటుందన్నారు. గతంలో రాష్ట్రంలో కేవలం పోలీస్‌ కమిషనరేట్లు ఉంటే.. ఇప్పుడు తొమ్మిది కమిషనరేట్లతో.. దేశంలోనే లా అండ్‌ ఆర్డర్‌లో తెలంగాణ ‘ఫస్ట్‌ ఇన్‌ సేఫ్టీ.. బెస్ట్‌ ఇన్‌ సెక్యూరిటీ’ అనే విధంగా గొప్ప పేరుతెచ్చుకుంటుందన్నారు.

త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా స‌మ‌గ్ర భూ స‌ర్వే నిర్వ‌హించి.. అక్షాంశాలు, రేఖాంశాల‌తో భూముల‌ను గుర్తించి పాసు పుస్త‌కాలు జారీ చేస్తామ‌న్నారు. కెసిఆర్ అంటే కాలువ‌లు, చెరువుల‌, రిజ‌ర్వాయ‌ర్లు అని కెటిఆర్ అన్నారు. నిరంతర విద్యుత్‌తో నిరంతర సంపద సృష్టి జరుగుతోందని, పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమన్నారు.

తెలంగాణ వస్తే ఉద్యోగాలు రావన్నారని, ఉన్న పెట్టుబడులు పోతాయని వెక్కిరించారని.. టీఎస్‌ ఐపాస్‌తో తెలంగాణకు కంపెనీలు క్యూకట్టాయన్నారు. ఒకప్పుడు విమర్శించిన వారే.. ప్రశంసిస్తున్నారన్నారు. తయారీ పరిశ్రమలో తెలంగాణకు ఎదురులేదని, ఫార్మా రంగంలో అగ్రస్థానంలో ఉన్నట్లు చెప్పారు. టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికి రాజధానిగా మారామని, నాడు ఆగమైన తెలంగాణ నేడు దేశానికి ఆదర్శమైందన్నారు. గతంలో ఐటీకి హైదరాబాద్‌ బ్యాక్‌ ఆఫీస్‌గా ఉండేదని, ఇవాళ హైదరాబాద్‌ బ్యాక్‌ బోన్‌ అయ్యిందన్నారు. గూగుల్‌కు గుండెకాయ.. అమెజాన్‌, ఆపిల్‌కు ఆయువుపట్టు హైదరాబాద్ అని కెటిఆర్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.