కోస్తా, రాయలసీమల్లో నేడు వర్షాలు..

అమ‌రావ‌తిః రాయ‌ల‌సీమ‌, కోస్తాంధ్ర‌లోని ప‌లు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్యప్రదేశ్‌ దాని పరిసర ప్రాంతాల్లో నేడు బలహీనపడనుంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో తిరిగి ఈశాన్య దిశలో పయనించే అవకాశం ఉంది. దాంతో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు. వరి, సోయా, పత్తి పంటలు వేసిన రైతులు కష్టాల్లో మునిగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాజెక్టుల్లో నీటిమట్టం పెరిగిపోయింది. దాంతో గేట్లను ఎత్తేసి నీటిని వదులుతున్నారు.

 

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం..

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేశారు. ఇన్‌ ఫ్లో 2,10,420 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 2,52,459 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 210.9946 టీఎంసీలుగా నమోదయ్యింది. మరోవైపు కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.