విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-35)

 యువ ఎంఎల్‌ఎల తిరుగుబాటు బావుటా

సభలోనే ఉన్న అధికార పార్టీ సభ్యుల వద్దకు చనువుగా వచ్చి కూర్చున్నాడు చీఫ్‌విప్‌. ఏమిటి, మన పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రతిపక్షాలకు మరింత అవకాశం ఇచ్చే విధంగా మీరంతా సభాకార్యక్రమాలకు అడ్డు తగలడం ఏ విధంగానూ మంచిది కాదు. ముఖ్యమంత్రిగారు చాలా విచారిస్తున్నారు. నలుగురైదుగురు రండి, సిఎంతో మాట్లాడుదురు కానీ,సమస్యలుంటూ మనలో మనం పరిష్కరించుకోవాలి కానీ మన పార్టీని పలుచన చేసుకోరాదు. ఎన్నికల సంవత్సరంలో ఉన్నాం. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే తిరిగి మనం ఎవరం గెలువలేము, ఇది మీకు తెలుసు.

అవును అంతా తెలిసే ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది. మీరంతా సీనియర్లు, రాజకీయాల్లో ఎంతో కాలంగా ఉన్నారు. మరోసారి ఓడిపోయినా మీకు పెద్దగా ఏమి అనిపించదు.మాలో అందరం మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన వాళ్లం. పార్టీ,ప్రభుత్వం పటిష్ఠంగా ఉంటేనే తిరిగి మేము ఈసభలో అడుగుపెట్టడానికిఅవకాశాలున్నాయి. అన్ని విషయాలను నిర్ధారించుకున్న తర్వాతనే మన విజయ్‌ ఇరిగేషన్‌ శాఖ అవినీతిని సభలో ప్రస్తావించారు. ఈ రోజు ఎందుకో ఆయన సభకు రాలేదు విజయ్‌ లేని సమయంలో ఈ చర్చను ముగిస్తున్నారు. అందుకే తప్పు జరిగిందని మాట్లాడుతున్నాం.

విజయ్‌ గురించి నిజంగా నాకు తెలియదు. అందుకే ముఖ్యమంత్రి వద్దకు రండి అన్నివిషయాలు తెలుస్తాయని చీఫ్‌విప్‌ కోరడంతో రంజిత్‌తోపాటు నలుగురు సిఎం ఛాంబర్‌లోకి వచ్చి నిలబడ్డారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి వారందరినీ కూర్చోవాల్సిందిగా, ఆప్యాయంగా పలకరించారు.

చీఫ్‌విప్‌ మీకు అన్నివిషయాలు చెప్పి ఉంటారు. చెప్పండి, మీ సందేహాలేమిటి? పార్టీలో క్రమశిక్షణ ప్రధానం. దీనికి విరుద్ధంగా మీరందరూ సభాకార్యక్రమాలకు అడ్డు తగిలారు. సమస్యలుంటే అంతర్గతంగా మనం చర్చించుకోవాలి కానీ ఇలా చేయరాదంటూ అభ్యర్థిస్తున్నట్లుగానే మాట్లాడారు. సహజంగా యువ సభ్యులంటే పెద్దగా పట్టించుకోని సిఎం ఈ రోజు తగ్గి మాట్లాడుతున్న విషయం వారు కూడా గమనించారు.

ప్రభుత్వ వ్యతిరేకంగా వ్యవహరించిన వారు అయిదారుగురు శాసనసభ్యులైతే సిఎం కరుకుగానే ఉండేవారు, కానీ యువ ఎంఎల్‌ఎలంతా ఎవరో చెప్పినట్లుగా సభను అడ్డుకోవడంతో ముఖ్యమంత్రి దిగిరాక తప్పని పరిస్థితి.

మీరే చెప్పండి ఏమి చేద్దామంటారంటూ ఎంతో సంయమనంతో ప్రశ్నించాడు సిఎం.

సహచర శాసనసభ్యుడు విజయ్‌ ఏ అంశాన్ని ఆషామాషీగా సభ ముందుకు తీసుకురాడు. అయితే ఆయన ప్రస్తావించిన అంశంపై చర్చ ఒక కొలిక్కి రాకముందే ఆ అంశం ముగిసిపోతున్నది. పైగా ఈ రోజు విజయ్‌ సభలో లేడు. ఆయనకు పలుసార్లు కాల్‌ చేసినా అందుబాటులో లేడు.

ఎక్కడికి వెళ్లాడో మీకైనా తెలుసా అంటూ రంజిత్‌ సిఎంను ప్రశ్నించాడు.

అయితే వీరి గొడవకు విజయ్‌కు సంబంధం లేదన్న మాట. వాడు పురికొల్పి ఈ సమస్యను సృష్టించాడనుకున్నా అంటూ సిఎం లోలోన అనుకున్నాడు. తాను అనవసరంగా విజయ్‌ను అనుమానించానని కూడా ముఖ్యమంత్రి మధనపడ్డాడు.

విజయ్‌ మీకు చెప్పలేదా, ఆమె తల్లిని తీసుకొని తిరుపతికి వెళ్లాడు. సభ జరుగుతున్నది తాను ఉండాలని అనుకున్నా. తప్పనిసరి పరిస్థితిలో నేనే ఒప్పించి పంపాను. మా ఆవిడ కు తిరుపతి మొక్కు ఉందని నన్ను తప్పక తోడు రమ్మని అంది. ఈ సమయంలో నేను సభకు గైర్‌హాజర్‌ అయితే పెద్ద సమస్య వస్తుందని విజయ్‌ను ఆమెకుతోడిచ్చి పంపాను.విజయ్‌ ఎక్కడున్నాడనేది మీ సమస్య. ఒకటి రెండు రోజుల్లోనే తిరిగి వస్తారు వాళ్లు. సరేనా..

సరే విజయ్‌ ఆచూకీ తెలిసింది సంతోషం కానీ ఆయన వెలుగులోకి తెచ్చిన కుంభకోణంకు లాజికల్‌ ముగింపు ఉండాల్సిందే. మీడియాకు, విపక్షాలకు మీరు ఏమి చెప్పినా వాస్తవాలు అందరికీ తెలుసు. అవినీతికి పాల్పడిన మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిందే.మీరు చెప్పినట్లుగా దర్యాప్తు తర్వాత ఆయన క్లీన్‌ అని తేలితే..మీ ఇష్టం మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోండి, ఇదే శాఖ ఇవ్వండి…ఇదే మా అందరి నిర్ణయం అంటూ రంజిత్‌ చెప్పడంతో ముఖ్యమంత్రి ముఖం వెలవెల పోయింది.

మంత్రిని కాపాడేందుకు ఇంతగా శ్రమపడినప్పటికీ అంతా బూడిదలో పోసిన పన్నీరు చందమైందని తలపట్టుకున్నాడు. వీరిని ఎలా సముదాయించాలో ఆయనకు వెంటనే ఆలోచన రాలేదు. రాజకీయంగా బుట్టలో వేసుకోవాలనే తలంపుతో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది కదా ఈ దఫా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాం. మీలో కొందరికీ అవకాశం వస్తుంది. విజయ్‌కు ఇద్దాం. అంటూ వారిని ప్రలోభపెట్టేందుకు ఈ బాణం వదిలాడు సిఎం.

మంత్రులవుతారనే ప్రతిపాదనను వారు ఏమాత్రం ఆసక్తిగా కూడా వినలేదు. ఇలాంటి మాయ మాటలతో రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకోవడం వారికి ఇష్టం లేదు.

మంత్రి పదవులపై యువ ఎంఎల్‌ఎలకు ఎవరికీ అంతగా మోజు లేదు సిఎంగారు. సంవత్సరంలోనే తిరిగి ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీ ప్రతిష్ఠ మపకబారితే ఈ టర్మ్‌తోనే మా రాజకీయ జీవితానికి తెరపడుతుంది.ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వస్తే విపక్షాలకు ఇదే అంశం వచ్చే ఎన్నికల్లో మనమే ఇచ్చిన మంచి ఆయుధమవుతుంది. డిపాజిట్లు కూడా రావు మనకు. అందుకే యువ ఎంఎల్‌ఎలు, అక్రమాలకు పాల్పడిన మంత్రి ని భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఇక మీ ఇష్టం అంటూ మరింత చర్చకు అవకాశం ఇవ్వకుండా రంజిత్‌తోపాటు వారు బయటికి వచ్చారు.

ఊహించని ఈ డిమాండ్‌కు నివ్వెరపోయాడు సిఎం. తన పార్టీ వారే ఇంతగా రెచ్చిపోతారనుకోలేదు. పార్టీ సమావేశాల్లో ఎంతో గౌరవంగా చూసేది, తాను చెప్పేది విన్నది వీరే కదా? శాసనసభాపక్ష నేతగా ఉన్న నాతో ఎంతో మర్యాదగా ఉండే వాళ్లు ముఖం మీదనే ఎంత నిష్టూరంగా మాట్లాడారు. హతాశుడయ్యాడు సిఎం. కింకర్తవ్యం. బోధపడటం లేదు.

యువ ఎంఎల్‌ఎ ల డిమాండ్‌ను పట్టించుకోకుండా వదలడం సాధ్యం అవుతుందా? వారంతా తిరుగుబాటు చేస్తే సభలో పార్టీ మెజారిటీ కోల్పోతుంది. దీంతో ఎన్నికల ముందు తాను పదవికి రాజీనామా చేస్తే ..ఇంకా ఆలోచించలేకపోతున్నాడు.

ఈ ఆపత్‌సమయంలో విజయ్‌ ఉండి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదేమో. వారిని సముదాయించే వాడేమో అనుకున్నాడు. ఆ వెంటనే లేదూ వాడే కదా సమస్యకు ప్రధాన కారకుడు, వారంతా అప్పుడప్పుడు ప్రభుత్వ లోటుపాట్లను చర్చించుకుంటున్నారేమో. అసలు వాడే ఇలా తయారు చేసాడు వీళ్లని. మొదటి నుంచి వాడు కొరకరాని కొయ్యగా మారాడు.
ఎలా?ఎలా?ఎలా?

ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి. ఇప్పటికే అధిష్ఠానం తనపై గుర్రుగా ఉంది. ఇక యువ శాసనసభ్యుల తిరుగుబాటు వ్యవహారం బయటికి పొక్కితే, ఇంకేమైనా ఉందా? వెంటనే రాజీనామా చేయమని హస్తిన నేతలు ఆదేశిస్తారు. నా పదవికే గండం వస్తుంది. దీనికి తక్షణ పరిష్కారంగా మంత్రిని క్యాబినెట్‌ నుంచి భర్తరఫ్‌ చేస్తామని ప్రకటించడమే తరుణోపాయం.

ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సిఎం స్థిమితపడ్డాడు. అసెంబ్లీ తిరిగి ప్రారంభించేందుకు కోరం బెల్‌ మ్రోగక ముందే స్పీకర్‌తో ఫోన్లో మాట్లాడాడు. తాను వెంటనే ప్రకటన చేస్తానని, తనకు ముందుగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరాడు.

యువ శాసనసభ్యులు సభలో ఒక్కసారిగా లేచి సభా కార్యక్రమాలకు అడ్డుతగిలడంతో విపక్ష సభ్యులు వారికి తోడు నిలివక తప్పనిపరిస్థితి ఏర్పడిరది. అధికార పక్ష సభ్యులకు మొత్తం క్రెడిట్‌ పోతే ఇప్పటికే విపక్ష నేతలు లంచాలు తీసుకున్నారనే అప్రతిష్ఠను మరింత పెంచుకున్నట్లు అవుతుందని వారిలో ఆందోళన ప్రారంభమైంది.

సభ తిరిగి ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తిరిగి లేచి గలాబా ప్రారంభించారు. స్పీకర్‌ వారందరిని ప్రశాంతంగా ఉండమని, ఈ విషయంపై ముఖ్యమంత్రి గారు సభలో ప్రకటన చేస్తారని చెప్పడంతో సిఎం సమాధానం కోసం అందరూ ఆసక్తిగా ఉండిపోయారు.

అధ్యక్షా,
స్వచ్ఛమైన పాలన అందిస్తామని, నీతి నిజాయితో మంత్రివర్గం వ్యవహరిస్తుందని అవినీతికి, అక్రమాలకు తావుండదని పరిపాలన ఉంటుందని నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడే తెలిపాను. ఎన్నికల సమయంలో మా పార్టీ ప్రజలకు వాగ్దానం చేసింది ఇదే. అందుకే ఎలాంటి కళంకం ప్రభుత్వానికి అంటకుండా నేను, మా మంత్రివర్గ సభ్యులు నిబద్ధతగా పనులు చేస్తున్నాం. పాలనా యంత్రాంగంలో గుమస్తా నుంచి సెక్రటరీ స్థాయి వరకు ఎందరో ఉంటారు. ఎక్కడ లోటుపాట్లు జరిగినా సమిష్టిగా బాధ్యత వహించాలి తప్పదు. ప్రజాస్వామ్యంలో అందరం ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. గతంలో ఎక్సయిజ్‌ శాఖపై ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం ఆనవాయితీ అయినప్పటికీ ప్రజల్లో అనుమానాలు రావద్దని మంత్రి నుంచి రాజీనామా తీసుకున్నా. ప్రభుత్వం నిజాయితీగా కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. అందుకే తమపర బేధం లేకుండా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఇరిగేషన్‌ శాఖలో కొన్ని తప్పులు జరుగుతున్నాయని మా పార్టీ సభ్యుడే విజయ్‌ సభలో ప్రస్తావించారు. అయితే ఈ సందర్భంగా విపక్ష నేతలకు సూట్‌కేసులు చేరాయనే ఆరోపణలు వచ్చాయి. దీనికి ఎవరు బాధ్యులో తేల్చేందుకు ఇప్పటికే విచారణకు ఆదేశించాం.
ఇందులో మంత్రి ప్రమేయం ఉన్నట్లుగా ఎక్కడా కనిపించకపోయినప్పటికీ ఆయనపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మీడియాలోనూ విస్తృత కథనాలు వచ్చాయి.

అవినీతికి సంబంధించి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఏనాడు తాత్సార్యం చేయలేదు. ఇరిగేషన్‌ మంత్రికి ఈ విషయంలో నేరుగా సంబంధం లేకపోయినా, ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వస్తుండటంతో మంత్రి స్వయంగా విచారణకు సిద్దమయ్యారు. ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడటానికి అవసరమైతే రాజీనామాకు వెనుకాడనని తెలిపారు. విచారణ తర్వాత దోషుడుగా తేలితే తప్పక చర్యలు ఉంటాయి. దీనిని గౌరవ సభ్యులందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నా అంటూ యువ శాసనసభ్యులను చూస్తూ కూర్చున్నాడు సిఎం.

దీంతో ఒక్కసారిగా విపక్ష సభ్యులందరూ లేచి ఇరిగేషన్‌ మంత్రి వెంటనే రాజీనామా చేయాల్సిందే నంటూ పట్టుబట్టారు. నినాధాలు చేస్తూ తిరిగి స్పీకర్‌ పోడియం వద్ద బైఠాయించారు. యవ ఎంఎల్‌ఎలు జరుగుతున్న తతంగాన్ని మౌనంగా చూస్తున్నారు.

ఇరిగేషన్‌ మంత్రి వెంటనే లేచి, ముఖ్యమంత్రి సీటు వరకు వచ్చాడు. పక్కన కూర్చోవాల్సిందిగా సిఎం సూచించారు. విపక్ష సభ్యుల నినాదాలతో సభ హోరెత్తుతుండగా, మంత్రి, సిఎం మధ్య చర్చలు జరుగుతుండటాన్ని యువ సభ్యులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

తప్పదు, మంత్రిపదవికి నీవే స్వచ్ఛందంగా రాజీనామా ప్రకటిస్తే గౌరవంగా ఉంటుందని తర్జనభర్జనల తర్వాత సిఎం వివరించాడు. ఏడుపు మొఖంతో మంత్రి తన సీటు వద్దకు వచ్చి కూర్చున్నాడు. ఎవరి సీటులో వారు కూర్చోవాలని, ఇరిగేషన్‌ మంత్రి మాట్లాడుతారని చెప్పడంతో, విపక్ష సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ మరోసారి నినాదాలు చేశారు.

అదే జరుగుతుందన్నట్లుగా స్పీకర్‌ పరోక్షంగా సంజ్ఞ చేయడంతో ఒక్కరొక్కరుగా సభ్యులు లేచి వెళ్లారు.

మంత్రి ఏమిచెబుతారని అందరూ నిశబ్దంగా ఉండిపోగా…

ఇరిగేషన్‌ మంత్రి లేచి
అధ్యక్షా,
నాకు విషమ పరిస్థితి ఏర్పడిరది. ఏ తప్పు చేయకపోయినా విపక్ష సభ్యులు నా రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నారు. మచ్చలేని మా ప్రభుత్వానికి నావల్ల కళంకం అంటరాదు. కానీ ఒకవైపు దర్యాప్తు సాగుతుండగా నన్ను పదవి నుంచి వైదొలగాలని కోరండంలో ఔచిత్యం కనపించడం లేదు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని స్థాయిలో అనేక సంక్షేమ పథకాలను చేపట్టింది. ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడటానికి క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా ఎంతటి త్యాగానికి అయినా వెరువను. మీరు అనుమానిస్తున్న ఈ సమయంలో ఇక ఆ పదవిలో కొనసాగడానికి నా మనస్సాక్షి కూడా అంగీకరించడం లేదు. అందుకే అసెంబ్లీలోనే నా రాజీనామా ను ప్రకటిస్తున్నా…గద్గత స్వరంతో అంటూ కూర్చుండిపోయాడు. స్పీకర్‌ వెంటనే సభను వాయిదా వేసి, తన ఛాంబర్‌లోకి వెళ్లిపోయాడు.

తమ డిమాండ్‌ నెరవేరినప్పటికీ యువ శాసనసభ్యులు గుంభనంగానే ఉన్నారు. పార్టీకి చెడ్డపేరు రావద్దనే లక్ష్యంతో వారు మౌనంగానే ఒకరినొకరు కళ్లతోనే అబినంధించుకున్నారు.
తిరుపతిలో ఉన్న విజయ్‌కు సభా వ్యవహారాలేవీ తెలియవు. తాను అక్కడ లేకపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. తనను ఇక్కడికి పంపడం సిఎం ఎత్తుగడగానే భావిస్తున్నాడు. రంజిత్‌ లేదా ఇతర సహచర సభ్యులను ఫోన్లో సంప్రదించేందుకు కూడా మనస్సు అంగీకరించలేదు. సభ వాయిదా పడిన తర్వాత వెంటనే విజయ్‌ ఫోన్‌ కోసం ప్రయత్నించాడు రంజిత్‌.

వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అప్పుడే గదిలోకి వచ్చిన విజయ్‌ వెంటనే కాల్‌ రిసీవ్‌ చేసుకున్నాడు. దైవ దర్శనానికి వెళ్లినందున ఉదయం నుంచి ఫోన్‌ రూంలో ఉండిపోయింది.

ఏమైంది బ్రదర్‌, ఉదయం నుంచి కాల్‌ చేస్తున్నాం, సిఎం చెప్పాడు మీరు తిరుపతి వెళ్లారని.కానీ అంత అర్జంట్‌గా ఈ ప్రయాణం ఎందుకు పెట్టుకున్నావు. ప్రశ్నించాడు రంజిత్‌.

మీకు చెప్పి రావడం మరిచిపోయాను. సిఎం సతీమణితో పాటు తిరుపతికి తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. ఏమిటి అసెంబ్లీ విశేషాలు.

ముందుగా మిమ్ములను అభినందించాలి. మన యువ శాసనసభ్యులందరం గట్టిగానే ఒత్తిడి తెచ్చాం. ఇరిగేషన్‌ మంత్రి రాజీనామాకు సిద్ధమయ్యాడు.

అవునా, మంచి పని జరిగింది. అవినీతి తిమింగలాలు వెళ్లిపోతేనే మన పార్టీ మరింత పటిష్ఠమవుతుంది.

అవును అందుకే మేం సిఎంపై బాగా ఒత్తిడి తెచ్చాం. ఆయన దిగిరాక తప్పలేదు.

ఏమి చేశారేమిటి? అసెంబ్లీలో గొడవ చేయలేదుగా? అలా చేస్తే మన పార్టీకి నష్టం.

విపక్షాలను మేనేజీ చేసి ఈ సమస్య నుంచి గట్టెక్కాలని సిఎం ప్లాన్‌ చేసాడు. నీవు లేకపోవడంతో ఏదో కుట్ర ఉందని మనవాళ్లంతా అనుకొన్నారు. అందుకే సభలో ఏమీ మాట్లాడకుండా నిలుచున్నాం. విషయం అవగతమైనట్లు ఉంది. సభను వాయిదా వేయించాడు ముఖ్యమంత్రి. తర్వాత ఛాంబర్‌లోకి రమ్మన్నాడు. నీవు లేవు కాబట్టి, ఆ సబ్జెక్టు అంతటితో ఆగిపోవద్దని అడిగాం. లేనట్లయితే మంత్రిని భర్తరఫ్‌ చేయాలని అల్టిమేటం ఇచ్చి వచ్చేయడంతో మన మాటే నెగ్గిందని ఆనందంగా చెప్పాడు రంజిత్‌.

పార్టీకి మేలు జరిగిందని ఫోన్‌ కట్‌ చేసాడు విజయ్‌

ఏమిటీ బాబు, పార్టీకి మేలు ఏమిటి అంటూ అన్నపూర్ణమ్మ ప్రశ్నించింది.

అసెంబ్లీలో జరిగిన విషయాలన్నింటినీ ఆమెకు వివరించడంతో, నీ ప్రయత్నాలన్నీ పార్టీ కోసమే బాబు.అందుకే ప్రజలు నీకు బ్రహ్మరథం పడుతున్నారు. జనం కోసం నీవు పడుతున్న తపన నాకు అర్థం అవుతున్నది. మీ సార్‌ మాత్రం అందరినీ కలుపుకొని పోవాలి, లేకుంటే పార్టీకి ఇబ్బంది అంటుంటారు..ఆమె చెప్పింది.

ఇక నీ ఇష్టం అమ్మా, అసెంబ్లీ కోసం వెంటనే వెళ్లిపోదామని అన్నాను కానీ ఇప్పుడు ఎన్ని రోజులైనా పర్వాలేదు. అన్ని చూసుకొని తిరిగి వెల్దాం. అంటూ లంచ్‌ తర్వాత కానీపాకం వెళ్లి, వినాయక దేవాలయం దర్శనం చేసుకుందామా? లేక ఈ రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకుందామా అన్నాడు విజయ్‌.

రేపు పోదాం బాబు. అలసటగా ఉంది. రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. పైగా దర్శనం కోసం త్వరగా లేచాం కదా,మళ్లీ కారులో ప్రయాణం అంటే కష్టంగా ఉంటుంది. సరేనా అంది.

ఇక్కడికి వచ్చి కూడా రాజకీయాలు ఎందుకు? ఫోన్‌ రెండు రోజులపాటు స్విచ్‌ఆఫ్‌ చేసి ప్రశాంతంగా ఉండు, ఈ దేవున్ని స్మరిస్తూ, అవునూ ఇంతకు దేవున్ని ఏమి కోరుకున్నావురా బాబు అంది ఆమె.

ఏమోనమ్మ, ఆ దివ్యమంగళ మూర్తిని చూస్తూ ఉండిపోయాను. ఎంతసేపు చూసినా తనవి తీరడం లేదు, పక్కన ఉన్నవాళ్లు కదలమని ఒక్కటే ఒత్తిడి. ఎందుకోగాని, నేను గతంలో చూసినట్లుగా శేషశయ్యపై పవలించిన ఆ శ్రీమన్నారాయణుడే కనిపించారు, ఆ క్షణంలో…

అదేమిటిరా, వెంకన్న మొక్కుకుంటున్న సమయంలో ఆ మహావిష్ణువు కనిపించడం ఏమిటి అనుమానంగా అంది.

వెంకటేశ్వర స్వామి కూడా మహా విష్ణువు అవతారమే కదా అలా అనిపించింది నాకు.

అయినా ఇంత దూరం వచ్చి, దైవ దర్శనంచేసుకున్నప్పుడు ఏదో ఒకటి కోరుకోవాలి కదా? మంచి పెళ్లాం రావాలనుకున్నావా? హాస్యమాడిరది అన్నపూర్ణ.

పో అమ్మా, నీకు ఎప్పుడు అదే పెళ్లి మాట. లేదు కానీ, సర్వేజనా సుఖినోభవంతు, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మాత్రం అడిగానమ్మా, అది కూడా అక్కడ ఉన్న వాళ్లు ఇక వెళ్లండి అంటున్న సమయంలోనే, ఇతర విషయాలేమీ గుర్తుకు రాలేదు.

ఇప్పటివరకు ఏమీ తినలేదు కదా మనం, ఫోన్‌లో ఏదైనా ఆర్డర్‌ ఇస్తావా లేక మనమే హోటల్‌కు వెల్దామా, అడిగింది ఆమె.

మీరు ముఖ్యమంత్రి సతీమణి కదా, అంతా వాళ్లే చూసుకుంటారమ్మా, తెస్తారు కొందిసేపట్లే… అంటూ విరంచి గుర్తుకు రావడంతో కాల్‌ చేస్తూ బయటకు వచ్చాడు విజయ్‌.

ఫోన్‌లో విజయ్‌ పేరు చూసి ఎంతో ఆనందంగా కాల్‌ తీసుకున్న కూతురు వైపు చూసింది ఆమె తల్లి. ఆమెకు చెప్పకపోయినా అది విజయ్‌ నుంచి అని ఆమె ఊహించింది.

మీకు నిండా నూరేళ్ల ఆయుషు. ఇప్పుడే అనుకుంటున్నా, కాల్‌ చేయాలని.కానీ అసెంబ్లీ సమావేశాల్లో తీరికలేకుండా ఉండి ఉంటారని ఆగాను. అవును మీరు ప్రత్యక్ష ప్రసారంలో ఎక్కడా కనిపించలేదు. కెమారాకు దొరకకుండా దాక్కున్నారా ఏమిటి. అంది విరంచి.

ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాను. ఇప్పుడే దైవదర్శనం అయింది. అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. అందుకే మీకు కూడా చెప్పలేదు. ముఖ్యమంత్రి సతీమణి, అదే మా అమ్మకు తోడుగా సిఎంగారు పంపించారు.

మీరు అక్కడ ఉన్నప్పటికీ అసెంబ్లీకి సంబంధించి, అంతా మీ గురించే వార్తలు వస్తున్నాయి. ఇది మీ రెండో విజయమని, అవినీతిని నిర్మూలించే ఘటనాఘటన సమర్థుడు విజయ్‌ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు, టివిల వాళ్లు. మేమంతా ఆనందిస్తున్నాం. అమ్మ ఒకటో పోరు, ఇంటికి రమ్మని పిలవమని. ఎప్పుడు ఇక్కడికి వస్తున్నారు, మా ఇంటికి ఎప్పుడు అంటూ తొందరచేసింది విరంచి.

అమ్మ పిలుస్తున్నదా, విరంచియా అంటూ నవ్వాడు విజయ్‌.

ఏం నేను పిలిస్తేనే వస్తారా? ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని నేనే అమ్మతో అన్నాను. మరి పిలవరాదు అంది. అంతే అంటూ విరంచి ఆనేక విషయాలు ఫోన్‌లో ప్రస్తావిస్తూ పోయింది. దీంతో ఫోన్‌కు అతుక్కుపోయి వింటూ గదిలోకి వచ్చి సోఫాలో ఎక్కువ సేపు కూర్చున్న విజయ్‌ను వింతగా చూసింది అన్నపూర్ణమ్మ. రాజకీయాలు కాకుండా ఏదో మాటలు విజయ్‌ నుంచి వినబడుతుండంటం ఆమెకు ఆసక్తి కలిగించింది. ఒక చెవి అటు వేసి వింది. దీంతో ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నట్లుగా గ్రహించి, గుంభనంగా ఉండిపోయింది.

కాల్‌ ముగించి, అమ్మా టిఫిన్‌ వచ్చిందా అంటూ ప్రశ్నించాడు. దీంతో ఆమె గుర్రుగా చూసింది.

ఏమిటమ్మా, ఎప్పుడు లేనిది అలా చూస్తున్నావు, నామీద నీకు కోపమా? ఎప్పుడు లేదే. అంటూ అమ్మ దగ్గరకు వచ్చి ప్రేమగా కూర్చున్నాడు విజయ్‌.

అవునురా, ఎవరితోనో మాట్లాడుతూ అమ్మ ఆకలి గురించి పట్టించుకోలేదు మా బాబు, మరి కోపం రాదా? బుంగమూతిపెట్టింది ఆమె.

ఫ్రెండ్‌ అమ్మా, మాట్లాడుతుంటే అలాగే ఉండిపోయా,

ఫ్రెండ్‌ అంటే ఆడ,మగ, ఆరాతీసింది అన్నపూర్ణమ్మ.

దొంగ దొరికినట్లుగా ఉంది విజయ్‌ పరిస్థితి. ఇప్పుడే విరంచి గురించి చెప్పకూడదనుకున్నాడు. అవునమ్మా, అమ్మాయియే. పిహెచ్‌డి చేస్తున్నదట, ఏవో అనుమానాలుంటే అడిగింది. గతంలోనూ మాట్లాడిరది. పెద్ద విశేషం ఏమి లేదమ్మా, పదా టిఫిన్‌ వచ్చింది కదా తిందాం అంటూ ఈ టాపిక్‌ను డైవర్టు చేసే ప్రయత్నం చేసాడు విజయ్‌.

సరే సీక్రెట్‌ అయితే చెప్పకు, ప్రేమ.దోమ అయితే చెప్పు. వెంటనే కళ్యాణం తంతునామి, ఊ..ఏమంటావు అంటూ ప్రశ్నించింది. పైగా వెంకన్న సన్నిధిలో ఉన్నాం మనం, అలాంటి శుభవార్త ఉంటే చెప్పురా బాబు, మనమళ్లు,మనమరాళ్లను ఎత్తుకోవాలని ఆరాటపడుతున్నది ఈ అమ్మ

నా జీవితంలో మీరే ముఖ్యం నాకు.ఏదైనా అనుకుంటే తప్పకు నీకు ముందుగా చెబుతాను, నన్ను నమ్ము అమ్మ అంటూ డైనింగ్‌ టేబుల్‌పై ఉన్న మరో ఇడ్లీని ఆమె ప్లేట్‌లో వేసాడు విజయ్‌.

సరే నీ ఇష్టం కానీ, ఆ ముచ్చటేదే వెంటనే కానియ్‌ రా. ఎన్నాళ్లు ఇలా ఒంటరిగా ఉండిపోతావు. రాజకీయాలు ఎప్పుడు ఉండేవే. ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలంటారు. నీకు పెద్దదిక్కుగా నేను ఆరాటపడుతున్నా…

అమ్మా, ఎన్నికల సంవత్సరంలోకి వచ్చాము, మళ్లీ ఎన్నికల తర్వాత తప్పక చేసుకుంటా…కొద్ది నెలలే కదా..అంటూ గోముగా చెప్పాడు విజయ్‌.

ఆనందం వేసింది ఆమెకు. నా ఆరాటం కానీ, నీ లక్ష్యాలు నీకుంటాయి. అలాగే కానీ… అంది అన్నపూర్నమ్మ.

అసెంబ్లీ సమావేశాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని పత్రికల్లోనూ ఇరిగేషన్‌ మంత్రి రాజీనామాను ప్రచురించాయి.

విజయుడు అనే శీర్షికతో సచిత్రంగా వచ్చిన వార్తలను చూసి అన్నపూర్ణమ్మ కూడా మురిసిపోయింది. నా బాబే అంటూ అక్కున చేర్చుకుంది. రాజకీయంగా విజయ్‌ ఎదుగుదల ఆమెకు సంతృప్తినిస్తున్నది.
రాష్ట్రంలో విజయ్‌పేరు మారుమ్రోగుతోంది. ఆయన అభిమానాలు స్వీట్లు పంచుకున్నారు. ఆయన కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. రంజిత్‌ సహచరులైన యువ ఎంఎల్‌ఎలు వివేక్‌, యాదగిరి, మల్లేశం, వెంకటరెడ్డి తదితర బృందం హడావుడి ఇంతఅంతకాదు. అయితే విజయ్‌ ఆ సమయంలో వేరే ప్రాంతంలో వెలితిగా కనిపించడంతో ఒక శాసనసభ్యుడు కాల్‌ చేసాడు. రేపు రాత్రికి నగరానికి చేరుకుంటాయనని, విజయ్‌ వారికి నచ్చచెప్పాడు.
ముఖ్యమంత్రి బంగ్లా. ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు సిఎం. అసెంబ్లీలో తనకే అవమానం జరిగినట్లుగా మధనపడుతున్నాడు. యువ ఎంఎల్‌ఎల మాటలు చెవుల్లో గింగుమంటున్నాయి. మంత్రిని భర్తరఫ్‌ చేసి, పార్టీని కాపాడుకోవాల్సిందే అంటూ వారిచ్చిన అల్టిమేటం…గతంలో ఇంత ఘోరంగా ఎవరూ తనపై ఒత్తిడి తీసుకురాలేదు.
అప్పటికే రెండు రౌండ్స్‌ అయిపోగా, మూడో పెగ్‌ కోసం చూస్తున్నాడు. భార్య తిరుపతి నుంచి రాకపోవడంతో ఈ రోజు కొంత ఎక్కువగానే తాగుతున్నాడు సిఎం. వర్కర్‌ అన్ని సిద్ధం చేసి పెట్టింది. ఫ్రిజ్‌లో ఉన్న చికెన్‌ తీసి ఫ్రై చేయడంతోపాటు, ఉదయం చేసిన చేపల పులుసులోని ముక్కలు కూడా ప్లేట్లలో పెట్టి వెళ్లాడు.
వాళ్లకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది. నన్నే ఎదిరిస్తారా. ఒకరిద్దరైతే ఇప్పటికే వారిని సస్పెండ్‌ చేయించే వాన్ని. ఇంకా ఎంఎల్‌ఎ పదవి కూడా పోగొట్టేలా స్పీకర్‌కు డిస్‌క్వాలిఫికేషన్‌ నోటీసు ఇప్పించి వాళ్లను అసెంబ్లీ ముఖం చూడకుండా చేసే వాన్ని. కానీ అంతమంది ఒక్కసారిగా తిరుగుబాటు చేస్తారా?ఇదంతా విజయ్‌ ప్లాన్‌…వాడే వాళ్లకు నాయకుడు,నేను కాదన్నమాట. పార్టీ టికెట్లు ఇప్పించి, గెలిపిస్తే ఇదా వాళ్లు నాకిచ్చే గౌరవం…ఇలాగే వదిలేయడానికి లేదు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. అధిష్ఠాన వర్గానికి ఇది తెలిస్తే…అలా జరగరాదు. నేను వాళ్లను ఏమి చేయలేక నిస్సహాయునిగా మిగిలిపోయానని తెలిస్తే మొదటికే మోసం…ఈ పదవి ఒక నాకుండదు. మరొకరిని లీడర్‌గా ఎన్నుకోవాలని చెబుతారు…అది విజయ్‌ కావచ్చు…ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలో తెలియక అయోమయంలో పడిపోయి,నాలుగో పెగ్‌ కూడా పూర్తి చేసాడు.
వర్కర్‌ను పిలిచి మరో బాటిల్‌ తీయమన్నాడు. వద్దు సార్‌, ఇక భోజనం చేయండి, అంటూ చనువు తీసుకొని ప్లేట్‌ పెట్టి చపాతి ఇచ్చి, కింద కూర్చున్నాడు. రెండు పెగ్గులకు మించి ఎప్పుడూ తాగని సిఎం ఈ రోజు ఎక్కువగా తీసుకున్నానని తనకే తెలియడంతో ఇక మౌనంగా ఆహారం తీసుకొని బెడ్‌ మీదికి వచ్చాడు.
తాగిన మందు కూడా పనిచేయడం లేదు. కంటికి కునుకే రాకపోవడంతో ఆలోచనలతో మెదడు మొద్దుబారింది. విజయ్‌ వల్లనే కదా ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది…ప్రభుత్వంపై అవినీతి ముద్ర పడుతున్నది. కీలక శాఖల్లో సీనియర్‌ మంత్రులు వాళ్లు. మింగలేక కక్కలేక పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మళ్లీ మంత్రిగా తీసుకుంటానని వాళ్లకు మాట ఇచ్చాను కానీ, ఈ పరిస్థితుల్లో వీలవుతుందా? విచారణ జరిగితే అక్రమాలు వెలుగులోకి వస్తాయి. ఏదో నెపంతో దర్యాప్తును జాప్యం చేయించవచ్చు కానీ, మంత్రివర్గంపై పడిన మచ్చను ఎలా తుడిచివేయగలను? మళ్లీ విజయ్‌పైకి వెళ్లాయి ఆలోచనలు. నక్క వినయాలు వాడు… వాడికి నాభార్య వంతపాట. పైగా వీలునామా వానిపేరున రాయించాలట. ఏదో దాని సంతృప్తి కోసం చెప్పానే కానీ, ఇప్పుడే ఏదీ రాయద్దు అని అడ్వకేట్‌కు చెప్పిన విషయం పాపం ఆమెకు తెలియదు. తెలిస్తే ఎంత బాధపడుతుందో అంటూ భార్య పట్ల అభిమానం చూపుతున్నాడు మరో పక్క.
అసెంబ్లీలో రేపటి నుంచి నా ముఖం ఎలా చూపను. పరాజితునిగా వాళ్ల ముందు నిలబడాల్సిందేనా… వాడిదే విజయం, విజేత వాడే, విజయుడుగా అన్ని పత్రికలు కీర్తిస్తుంటే అసూయతో రగిలిపోయాడు సిఎం. ఎలా,ఎలా, ఎలా,… ఇవే ప్రశ్నలు పదేపదే నన్ను తొలిచేస్తున్నాయా? హతవిధి, పరిష్కారం లేదా? తలను గోడకు కొట్టుకున్నాడు.
35.సిఎంకు నిద్రను దూరం చేసిన అసూయ

 

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-34)

Leave A Reply

Your email address will not be published.