విజయుడు (ధారావాహిక నవల పార్ట్-36)

సిఎంకు నిద్రను దూరం చేసిన అసూయ
ఫోన్ పట్టుకొని ఒక నెంబర్‌కు కాల్ చేసాడు. ఇంత రాత్రి సమయంలో ఫోన్ ఎవరూ అనుకుంటూ నిద్రపోతున్న ఇంటలిజెన్స్ చీఫ్, సిఎం పేరు చూసుకొని అలర్టు అయ్యాడు. నమస్తే సార్ అంటూ గొంతులో వినయం.
ఏమిటయ్యా, నీకు నిద్ర ఎలా పడుతున్నది. అసెంబ్లీలో నాకు ఇంత అవమానం జరిగితే… అంతా నీవల్లే.. ఏ ఒక్క పని సక్రమంగా చేయలేకపోయావు, అందుకే ఈ దుస్థితి.
అవతలి వైపు నుంచి మౌనం. వింటున్నట్లుగా సార్ అన్నాడు చీఫ్.
కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఏడాదిలోనే, ఏమి జరుగనుందో…గొణుక్కుంటూ కాల్ కట్ చేసాడు.
ఏమండి, ఈ సమయంలో ఫోన్ అంటూ భార్య ఆయనపై చేయివేసి పడుకుంది.
పనిచేయాలంటాడు, ఇక్కడ వద్దంటాడు, మళ్లీ ఎప్పుడో చెబుతానంటాడు? గుంభనంగా అన్నీ జరిగిపోవాలంటాడు, ఏమిటో ఈ ముఖ్యమంత్రి, పదవిపై ఆరాటం బహుశ నిద్రకు దూరం చేసి ఉంటుంది. అసెంబ్లీలో ఎలాగైనా ఉదయం కలుస్తాను కదా ఏమంటాడో అనుకుంటూ నిద్రలోకి జారాడు చీఫ్.
తిరుపతితోపాటు, కాణిపాకం,శ్రీకాళహస్తి దేవాలయాలను దర్శించుకొని ఒక రోజు ఆలస్యంగానే ఇంటికి చేరుకుంది అన్నపూర్ణమ్మ, విజయ్‌తోపాటు. విమానంలో కంటే కారులో బయలు దేరి మధ్యలో కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయాన్ని కూడా దర్శించుకుందామని, కర్నూలు జిల్లాలో ఉన్న మహానంది, అహోబిలం,తర్వాత శ్రీశైలం కూడా వెళ్దామని అన్నపూర్ణమ్మ కోరినా, మరోసారి వద్దామని విజయ్ ఆమెను బుజ్జగించి తిరుగు ప్రయాణం చేయించాడు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, ఎక్కువ రోజులు తాను సభకు వెళ్లకపోతే బాగుండదని ఎంతగానో నచ్చ చెబితే తప్ప ఆమె అంగీకరించలేదు.
నీతో ఇలా దేవాలయాలు సందర్శిస్తుంటే నాకు ఎంతో మనశ్శాంతిగా ఉందిరా… నీవే నా కొడుకువు అనుకుంటున్నా, ఈ వయస్సులో మాకు నీవేరా అండ. మీ సార్‌కు కూడా చెప్పా. సిఎం గారికి నీవంటే ఎంతో అభిమానం. రాజకీయంగా మీరు ఎలా ఉన్నా, నాకు మాత్రం ఎప్పుడు నీవు మా ఇంట్లోనే ఉండి అమ్మా అంటూ కొంగుపట్టుకు తిరిగితే ఎంత బాగుంటుందో. ఎందుకురా బంగ్లాలో ఉండనని భీష్మించుకుంటావు. మాకు మాత్రం ఎవరున్నారురా…అయినా ఎప్పటికైనా నీవు మా దగ్గర ఉండాల్సిన వాడివే…ఇంకా ఏదేదో అంటూ విజయ్‌ను ప్రేమగా లాలిస్తుంటుంది.
తల్లిదండ్రులను కోల్పోయిన విజయ్‌కు కూడా ఆమె అంటే ప్రాణం.
అందుకే అసెంబ్లీ సమావేశాల్లో తప్పక ఉండాల్సిన పరిస్థితుల్లోనూ ఆమె కోసం ఈ ప్రయాణానికి అంగీకరించారు. కలలో కూడా ఆమెను కాదనని పరిస్థితికి వచ్చాడు విజయ్. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమెకు కష్టం కలుగకుండా చూసుకోవాలని కృతనిశ్చయానికి వచ్చాడు. కనీసం ప్రతి ఆదివారం అయినా బంగ్లాకు వచ్చి ఆమ్మను తప్పక చూడాలి. ఆమె చేతి భోజనం తినాలనుకున్నాడు విజయ్.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రాజీనామాలతో ఇద్దరు మంత్రులు ఆ సభలో లేకపోవడంతో ఆ శాఖలను నేరుగా సిఎం పర్యవేక్షిస్తున్నారు. సభలో వచ్చే ప్రశ్నలకు సంబంధించి, ఇతర మంత్రులకు సమాధానాలు చెప్పే బాధ్యత అప్పగించినప్పటికీ, శాఖా ఉన్నతాధికారులు సిఎంకు ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తున్నారు. కీలకమైన ఎక్సయిజ్, ఇరిగేషన్ శాఖల్ల తనకు తెలియకుండా జరిగిన అనేక పరిణామాలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చాయి. దిగువ స్థాయిలోనే మంత్రులు, అధికారులు కుమ్ముకై ఈ పనులు చేసినట్లుగా వెల్లడి కావడంతో సిఎంకు ఆగ్రహం వచ్చింది. అధికారులను కూడా మందలించాడు. మీ సర్వీసు రిజిస్టర్‌లో ఈ లోటుపాట్లను రాయమని సిఎస్‌కు చెబుతానని హెచ్చరించాడు. పునరావృతం కాకుండా జాగ్రత్తగా లేకపోతే, కేంద్రానికి సరెండర్ చేస్తామని కూడా బెదిరించాడు.
మంత్రులు ఒత్తిడి తేవడంతో ఇదంతా చేసినట్లుగా వారు వివరించారు. అంతా సిఎంకు తెలుసు అని వాళ్లు మమ్ములను కూడా ప్రలోభపెట్టారని… దీంతో నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పనులు చేసినట్లుగా రెండు శాఖల అధికారులు తప్పు ఒప్పుకున్నారు. తాము గడ్డితిన్నామని,ఈ సారికి క్షమించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే సభలో విజయ్ చేసిన ప్రస్తావన అంతా వాస్తవమే, మరి మంత్రి తన వద్దకు వచ్చి ఏ తప్పుచేయలేదని వంగివంగి దండాలు చెబుతూ చెప్పాడు. అయితే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించకపోవడం, మంత్రులను పూర్తిగా విశ్వసించడం తన లోపంగా భావించాడు సిఎం.
ఆ రోజు సభ వాయిదా పడిన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తన ఛాంబర్‌కు పిలిచాడు. ప్రతి మంత్రిత్వ శాఖలోనూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే సందర్భంలో సెక్రటరీలు తప్పనిసరిగా ఆ ఫైళ్లను సిఎస్‌కు పంపాలని, ముఖ్యమంత్రి కార్యాయలాకు కూడా సమాచారం ఇవ్వాలని సర్కులర్ పంపాలని ఆదేశించారు. మార్గదర్శకాలు ఈ మేరకు ఇప్పటికే అమలులో ఉన్నా, మన అధికారులు ఎందుకు పాటించలేదని సిఎస్‌ను నిలదీశారు జానకి రామయ్య ఇక నుంచి అయినా శాఖాధిపతులు,కార్యదర్శులపై నిఘా పెట్టాలని కూడా చీఫ్ సెక్రటరీకి సూచించారు సిఎం.
పాలన గాడిలో పెట్టి, ఇక అక్రమాలకు చోటు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఉపక్రమించాడు. ఎన్నికల సంవత్సరంలో చిన్న తప్పుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అప్రమత్తమయ్యాడు.
అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో అన్ని శాఖల అధికారులతోనూ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, శాఖల వారీగా పరిస్థితిని సమీక్షించారు. లోటుపాట్లకు తావివ్వకుండా నడుచుకోవాలని, పెండిరగ్ ఫైళ్లనంటినీ త్వరగా పరిష్కరించాలని కోరారు. భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇప్పటివరకు జరిగిన సహాయ కార్యక్రమాలు, మరమ్మత్తుల వివరాలపై ఆరా తీయడంతోపాటు, ఇంకా పనులు జరగని ప్రాంతాల్లో సెక్రటరీలు స్వయంగా వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారు.
జిల్లాల వారీగా టూర్లకు కూడా సిఎం ప్రణాళికను రూపొందించారు. అయితే ఎన్నికల కోసం తన పర్యటనలు అని కాకుండా జిల్లాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలకు అవకాశం ఉంటే అదే పనిగా టూర్లు ఉంటే బాగుంటుందని, తన కార్యాలయం అధికారులు చేసిన సూచనను పరిగణలోకి తీసుకొని వాటి వివరాలు ముందుగా తెప్పించాలని సూచించారు. ఒక్కో జిల్లా కలెక్టర్‌తో సంప్రదించి,అధిక వ్యయంతో పనులు చేసి, పూర్తి అయిన ప్రాజెక్టుల వివరాలను సేకరించాలని తన కార్యదర్శికి సలహా ఇచ్చారు. అదే విధంగా కొత్తగా ఏ పనులు చేపడితే ప్రజల్లో పాపులారిటీ వస్తుందో కూడా జిల్లా వారీగా తెలుసుకోవాలని చెప్పారు.
నాలుగైదుసార్లు తన నియోజక వర్గ పరిధిలో జనంతో మమేకం అయి, వారి కష్టనష్టాలను తెలుసుకున్న విజయ్ ఇటీవల మొత్తంగా తన ఇంటికే పరిమితం అవుతున్నారు. రోజూవారీగా తనను కలిసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన దగ్గరకే వస్తున్నారు. ప్రభుత్వంలో పనులు జరగాలంటే విజయ్ ద్వారానే తప్పక నెరవేరుతాయనే ధీమా జనంలో కలిగింది. విజయ్ కూడా తనను కలిసిన ఏ ఒక్కరిని కూడా నిరుత్సాహపర్చడం లేదు. సమస్య తీవ్రతను బట్టి, ప్రభుత్వంలోని అధికారులు, సిబ్బందికి కాల్ చేసి చెబుతున్నాడు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, పోలీసు అధికారులతోనూ మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ వస్తే ఎలా స్పందిస్తున్నారో అధికారులు, విజయ్ నుంచి వచ్చే ఫోన్‌కు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. సచివాలయం స్థాయిలోనూ అధికారులు ఎక్కువ మంది విజయ్ అంటే అభిమానంతోనో లేదా భయంతోనో తెలియదు కానీ ఆయన చెప్పిన పనులన్నీ తప్పనిసరిగా అటెండ్ అవుతున్నారు. లేనట్లయితే అసెంబ్లీలో నిలదీస్తారనే ఆందోళన కూడా వారిలో ఉంది. పైగా ముఖ్యమంత్రికి దగ్గరవాడనే పేరు కూడా ఉంది.
ప్రజాధరణ విషయంలో రోజురోజుకు విజయ్ గ్రాఫ్ పెరుగుతున్నది. ఆయన ఒక సాధారణ శాసనసభ్యుడైనప్పటికీ ప్రజలకు ఆయనంటే గురిపెరిగింది. కాగా యువ శాసనసభ్యుల బృందం ఇటీవలి కాలంలో తరుచుగా సమావేశమవుతున్నారు. భావసారుప్యత కలిగిన వారి మీటింగ్స్ గా వాటికి నామకరణం చేసుకున్నారు. రాష్ట్రం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటిలాగే ఢిల్లీకి ఫాక్స్‌లో వెళ్తున్నాయి. విజయ్‌కు పెరుగుతున్న ప్రజాధరణపై అధిష్ఠానం సమాచారం సేకరిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి, అక్రమాలు ప్రతిపక్షాలకు ఆయుధంగా ఉపకరిస్తే, వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తప్పదనే వార్తలు కూడా హస్తినకు చేరుతున్నాయి.
విజయ్‌పై హత్యా ప్రయత్నం
అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడి నాంపల్లికి వచ్చేందుకు బయలు దేరాడు విజయ్. అక్కడే కంట్రోల్ రూం ఎదురుగా ఉన్న ట్రాఫిక్ జంక్షన్‌లో రెడ్ సిగ్నల్ పడటంతో కారు ఆగింది. సరిగ్గా అదే సమయంలో సాయుధులైన ఇద్దరు దుండగులు విజయ్ కారు సమీపానికి వచ్చి, విండో అద్దంపై వేలితో టక్‌టక్ అంటూ కొట్టారు. వారిచేతుల్లో పేపర్లు కనిపించాయి. వారి సమస్యల గురించి తనను కలిసి వినతి పత్రాలివ్వడానికి వచ్చారనుకొని కారు అద్దం దించి ఏమిటన్నట్లుగా చూసాడు విజయ్.
శాసనసభ్యులు విజయ్ మీరే కదా సార్ అంటే అవునని చెప్పడంతో
నమస్కారం సార్, మీ కోసమే వచ్చామంటూ, జేబులో ఉన్న రిలాల్వర్ తీసి ఇద్దరు కూడా ఆయనపై గుండ్ల వర్షం కురిపించారు.
ఊహించని ఈ హఠాత్‌పరిణామానికి విజయ్ కారు లోనే కుప్పకూలిపోయాడు. అంగరక్షకులు తమ గన్స్ తీసేలోగా అగంతకులు తమ పని పూర్తి చేసారు. తర్వాత తమ రివాల్వర్లు రక్షకభటుల వైపు తిప్పి గురిపెట్టడంతో వారు అచేతనులయ్యారు. అంతా కళ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. గురిపెట్టిన రైఫిళ్లను చూపుతూ తప్పించుకొని పోతున్న వారిపై కాల్పులు జరపడానికి వీలు లేకుండా ఉంది వారి పరిస్థితి. చుట్టూ గుమికూడిన ప్రజలు. హాహా కారాలు. వాహనాలను అక్కడే వదిలేసి పరగులు తీసిన తుపాకుల మోత విని అసెంబ్లీ పరిసరాల్లోనే ఉన్న మీడియానే ముందుగా అక్కడకి చేరుకోగా, పోలీసులు కూడా అక్కడి వచ్చారు. వాహనాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. సరిగ్గా పోలీసు కంట్రోల్ రూం ప్రాంతానే ఎంపిక చేసుకున్నారు హంతకులు. నాలుగు రూట్లలో వాహనాలు వస్తాయి, అక్కడే సులువుగా తప్పించుకోవచ్చనేది వారి ప్లాన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని వెళ్లారు.
ఒకసెకన్‌లో ట్రాఫిక్ సిగ్నల్ దాటిపోతామని అనుకున్నంతలో సిగ్నల్ పడటంతో కారును ఆపాడు డ్రైవర్. అగంతకలు ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు కానీ, విజయ్‌ను అతి సమీపం నుంచే కాల్చి, శరీరాన్ని బులెట్లతో నింపారు. పోలీసులు వచ్చిన వెనువెంటనే వచ్చిన అంబులెన్స్‌లో విజయ్‌ను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే టివిల్లో బ్రేకింగ్ న్యూస్ రావడంతో నగరంలోని ఆయన అభిమానాలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
మీడియాలో వస్తున్న వార్తలు చూసి కుప్పలూలిపోయింది అన్నపూర్ణమ్మ. అక్కడే ఉన్న భార్య పరిస్థితికి ఆందోళన పడ్డాడు. ఆమెపై చన్నీళ్లు చల్లి వర్కర్ల సహాయంతో బెడ్‌పైకి తీసుకు వచ్చాడు.
మెలుకువ రాగానే …అయ్యే బాబు అంటూ విలపించింది.ఎవరా దుర్మార్గులు, ఎంత పనిచేశారు? ఏమండి, మన బాబండి, వానికేమైన అయితే తట్టుకోలేనండి అంటూ విలపిస్తున్న భార్యను ఓదార్చడం ముఖ్యమంత్రి తరం కాలేదు. పదండిబాబును చూద్దాం, ఆస్పత్రికి వెంటనే బయలు దేరండి అంటూ తొందర చేస్తున్నది అన్నపుర్ణమ్మ.
అలాగే వెల్దాం, పరిస్థితి తెలుసుకుందామంటూ సిఎం వెంటనే డిజిపికి, ఇంటలిజెన్స్ చీఫ్‌కు కాల్ చేశాడు. హైదరాబాద్ పోలీసు కంట్రోల్ రూంకు అతి సమీపంలోనే ఇద్దరు సాయుధులు వచ్చి, కారులో ఉన్న విజయ్ గారిపై పాయింట్ బ్లాంక్‌లోనే చాతిపై కాల్పులు జరిపి పరారయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విజయ్ గారు అపస్మారక స్థితిలో ఉన్నారు. రివాల్వర్‌లోని మొత్తం బుల్లెట్స్ అయిపోయేవరకు ఇద్దరు కూడా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్ష్యులుగా ఉన్న గన్‌మెన్‌లు
చెప్పారట. నేను ఆస్పత్రికి వెళ్తున్నా సార్ అని డిజిపి సమాధానం చెప్పారు.
పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు నాకు నేరుగా కాల్ చేసి చెప్పు. మేడం ఆస్పత్రికి వస్తానంటున్నది. ఇద్దరం వస్తాం, ఎప్పుడు వస్తే బాగుంటుందో కూడా వెంటనే తెలుసుకొని చెప్పు అంటూ కాల్ కట్ చేసాడు సిఎం.
కొద్ది సేపట్లో మనం ఇద్దరం వెల్దాం, డిజిపికి చెప్పాను. అక్కడికి మనం వెంటనే పోతే డాక్టర్లకు ఇబ్బంది అవుతుంది. చికిత్సకు అంతరాయం కలుగుతుంది. ఈ నీళ్లు తాగు అంటూ భార్యను అనునయించే ప్రయత్నం చేస్తున్నాడు సిఎం. ఇంతలో ఇంటలిజెన్స్ చీఫ్ నుంచి కాల్.
సార్, కొన ఊపిరితో అబులెన్స్‌లో పడుకోబెట్టారు. బతకం అసాధ్యం. పథకం ప్రకారం, ఆ దారిలో విజయ్ గారు వస్తారని తెలిసి, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కారు ఆగగానే మాటల్లోపెట్టి కాల్చేశారు. ఏదైనా మిరకిల్ జరిగితే తప్ప ఆయన ప్రాణాలతో ఉండే అవకాశమే లేదని, ఇంకా ఏవేవో వివరాలు చెప్పాడు ఐజి.
కుటుంబ రావు ఇంటిలోనూ విషాధం నెలకొంది. విరంచి కంటికి మింటికి ఏకదారగా ఏడుస్తూ కూర్చుంది. తల్లి కూడా కంటతడిపెడుతూ కూతురును సముదాయించడం సాధ్యం కాని స్థితిలో తాను గట్టిగా ఏడ్చేస్తున్నది. ఏమిచేయాలో కోటేశ్వర రావు అర్థం కాలేదు.
నాన్నను పట్టుకొని ఏడ్చుతున్నది విరంచి. ఆమె పరిస్థితి తెలిసిన తండ్రి కూడా మౌనంగా రోధించసాగాడు. విజయ్‌కు ఎలా ఉంది డాడీ, బుల్లెట్లతో శరీరం జల్లెడ అయిందని అంటున్నారు టివి వాళ్లు .. మనం ఆస్పత్రికి వెళ్లి చూద్దాం డాడి అంటూ రోధిస్తున్న విరంచిని ఓదార్చడం తల్లిదర్రడులకు సాధ్యం కావడం లేదు.
అంబులెన్స్‌లో విజయ్‌ను పడుకోబెట్టిన తర్వాత నాడి చూస్తున్న డాక్టర్‌కు ఆశ్చర్యం వేసింది. బుల్లెట్లన్నీ చాతి చుట్టూ తాకి రక్తం దారాలంగా కారుతున్నా, నాడి కొట్టుకోవడంతో బిత్తర పోయిన ఆ డాక్టర్ త్వరగా పోనియి అంటూ డ్రైవర్‌ను మరింత తొందరపెట్టాడు. కృత్రిమ ఊపిరి, సెలైన్ అందిస్తూ ప్రాథమిక చికిత్స, చాలా జాగ్రత్తగా కొనసాగిస్తున్నాడు. అప్పటికే నిమ్స్ డాక్టర్లకు సమాచారం ఉండటంతో ఆపరేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్ అక్కడికి చేరుకున్న వెంటనే ఏ మాత్రం జాప్యం చేయకుండా నేరుగా ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు.
చాతి భాగం మొత్తం బులెట్ల గాయాలున్నాయి. అయినా గుండె పనిచేస్తున్నది. ఊపిరిపీల్చుకున్నారు స్పెషలిస్టులు. మరణించలేదని వారికి ఒకవైపు ఆనందం ఉండగా, మరోవైపు ఇన్ని తూటాలు పేలినా ఇంకా గుండె ఎలా కొట్టుకుంటున్నదనే ఆశ్యర్యం కలుగుతున్నది. ఇలాంటి ఆలోచనలు తర్వాత అనుకుంటూ ముందుగా శస్త్రచికిత్స చేస్తూ, ఒక్కో బుల్లెట్‌ను వెలికి తీస్తున్నారు డాక్టర్లు. గుండె,ఊపిరి తిత్తులను కూడా చీల్చుకుంటూ బుల్లెట్ల వెళ్లాయి. వాస్తవంగా ఇది ఎంతో ప్రమాదకర పరిస్థితి. ఈ గాయాలు ఎవరినైనా వెంటనే మృత్యు ముఖానికి తీసుకెళ్లాల్సిందే. ఒకవైపు గాయాల తీవ్రతను చర్చించుకుంటూనే శరవేగంగా చికిత్సను కొనసాగిస్తున్నది డాక్టర్ల బృందం.
(సశేషం)