బాలు మృతికి ప్రముఖుల సంతాపం!

హైదరాబాద్ః ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు అనే వార్త అటు సెలబ్రిటీలను ఇటు అభిమానులను కంటతడిపెట్టిస్తోంది. తన అద్భుత స్వరంతో ఎన్నో మైమరిపించే పాటలను అందించిన బాలుకి ప్రతి ఒక్కరూ అశ్రునయనాలతో తుది విడ్కోలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్, తెలంగాణ సిఎం కెసిఆర్, ఎపి సిఎం జగన్, చంద్రబాబు సహా పలువురు రాజకీయ, సీనీ ప్రముఖులు బాలుకు నివాళులు అర్పిస్తున్నారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ః దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు అస్తమయం దేశ సంగీత రంగానికి తీరని లోటు. గొప్ప సుమధుర గాయకున్ని దేశం కోల్పోయింది.
ప్రధాని మోడీః ఎస్పీ బాలసుబ్రహ్యణం మరణంతో మన కళా ప్రపంచం గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ప్రతి ఇంట్లోనూ ఆయన గళం కొన్ని దశాబ్దాల పాటు అలరించింది. ఈ విచారకర సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ః బాలు మరణం దేశ సంగీత రంగానికి తీరని లోటు.
తెలంగాణ సీఎం కేసీఆర్ః దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సినీ లోకానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
ఏపీ సీఎం జగన్ః గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం..
టీడీపీ అధినేత చంద్రబాబుః కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు. బాలసుబ్రహ్మణ్యంగారు ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉంది. ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసింది. ఇది దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటు. బాలసుబ్రహ్మణ్యంగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి ఫొటో
చిరంజీవిః సంగీత ప్రపంచానికి చీకటి రోజు. సంగీత జ్ఞాని ఎస్పీ బాలసుబ్రహ్మణం మృతితో ఓ శకం ముగిసింది. నాకు బాలుగారు ఎన్నో పాటలు పాడారు. నా విజయంలో ఆయన గాత్రానికి కూడా ప్రధాన పాత్ర ఇవ్వాలి.
రజినీకాంత్ః బాలుగారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఎన్నో ఏళ్లు ఆయన నాకు గాత్రధానం చేశారు. మీరు, మీ వాయిస్ నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా
నాగార్జునః బాలుగారితో నా అనుభవాలు, సంభాషణలు కన్నీళ్ల రూపంలో వస్తున్నాయి. `అన్నమయ్య` చూసిన తర్వాత ఆయన చేసిన ఫోన్ కాల్ నాకు ఇప్పటికీ గుర్తుంది. దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో .
మోహన్ బాబుః నాకు అత్యంత ఆత్మీయుడు, ఆప్తమిత్రుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. శ్రీకాళహస్తిలో మొదలైన మా స్నేహం, ఆత్మీయత చెన్నైలోనూ కొనసాగింది. ఆయన ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు. అన్ని దేవుళ్ల పాటలు పాడి ఆ దేవుళ్లనందరినీ మెప్పించిన గాన గంధర్వుడు. అలాంటి దిగ్గజ గాయకుడిని కోల్పోవడం యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు, యావత్ దేశానికీ ఎంతో బాధాకరం. నాకు వ్యక్తిగతంగా ఎంతో లోటు.
వెంకటేష్ః ఈరోజు మనం ఒక లెజెండ్‌ను కోల్పోయాం. `ప్రేమ`, `పవిత్రబంధం` వంటి చిత్రాల్లో ఆయనతో కలిసి నటించే గౌరవాన్ని దక్కించుకున్నాను. మీ లెగసీ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
మహేష్ః బాలసుబ్రహ్మణ్యంగారు లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. ఆయనలాంటి వాయిస్ ఎవరికీ ఉండదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన లెగసీ అమరం. ఆయన కుటుంబానికి నా సంతాపాన్ని ప్రకటిస్తున్నాను.
ఎన్టీయార్ః తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే.
కొరటాల శివః బాలు గారు ఇక లేరు అనటం తప్పు. పాట ఉన్నంత కాలం ఆయన మన మధ్యే ఉంటారు. కాని ఆయన ఇక పాట పాడరు అనే విషయమే జీర్ణించుకోలేని నిజం. గానగంధర్వుడికి శోకతప్త హృదయంతో అశృ నివాళులు.
రాజమౌళిః బాలుగారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. ఆ ఏలిక మరి రాదు. ఆయన పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయి. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
జయప్రకాశ్ నారాయణః బాలుగారు మృతి మన సంస్కృతికి, సమాజానికి తీరని లోటు. ఆయన అద్భుత సంగీతకారుడు, గొప్ప గాయకుడు, మంచి నటుడు. ఆయన ఎప్పటికీ గుర్తిండిపోయే మహోన్నత వ్యక్తి.
హరీష్‌రావుః గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం దురదృష్టకరం. సినీ లోకానికి వారు చేసిన సేవలు వెలకట్టలేనివని, అనేక భాషలలో పాటలుపాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న బాలు గారు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిదన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
సీహెచ్ విద్యాసాగర్ రావుః బాలసుబ్రమణ్యం కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాన్నా.
తలసాని శ్రీనివస్ః 100కు పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. పాటల దిగ్గజం బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. గాయకుడిగా, నటుడిగా చలనచిత్ర రంగానికి అనేక సేవలు అందించారు. బాలు మృతితో చలనచిత్ర రంగం ఒక ప్రఖ్యాత గాయకుడిని కోల్పోయింది. బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం.
ఎర్రబెల్లి దయాకర్ రావుః గాయకుడు ఎస్పీ బాలు గారి మరణం అత్యంత బాధాకరం. పాటల ప్రపంచంలో ఆయన గాన గంధర్వుడు. అనేక భారతీయ భాషల్లో పాడిన అద్భుత గాయకుడు. వారి మరణం యావత్తు దేశానికి, పాటల ప్రియులకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.