విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-39)

వైద్య రంగంలో చారిత్రిక ఘట్టం

విజయ్‌ ఆరోగ్యం క్రమంగా మెరుగవుతున్నది.ఒక మనిషి శరీరంలోకి అది కూడా గుండె, ఊపిరి తిత్తులు ఉండే చాతి భాగంలో బుల్లెట్ల వర్షం కురిస్తే బతికి బట్టకట్టం వైద్య చరిత్రలో ఇప్పటివరకు లేనే లేదని కానీ విజయ్‌ ఎలా కోలుకుంటున్నాడో ఎక్కువ మంది డాక్టర్లకు అంతుబట్టలేదు. అసలు ఈ కీలక అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో వారికి అర్థంకాలేదు. సాధారణంగా గుండెకు ఒక బులెట్‌ తగిలనా తీవ్ర రక్తస్రావం అయి వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు. ఒకవేల గుండెకు కొంత పక్క నుంచి బుల్లెట్‌ దూసుకుపోతే అతి క్లిష్టమైన ఆపరేషన్‌ చేసిన తర్వాత కూడా ప్రాణహాని జరగదనే గ్యారంటీ ఉండదు. అలాంటిది విజయ్‌ చాతిలోకి ఎక్కువ సంఖ్యలో బుల్లెట్లు దిగినా ఎలా జీవించి ఉన్నాడో ఆ సర్వేశ్వరునికే తెలియాలని కూడా పలువురు డాక్టర్లు దేవున్ని ప్రార్థించారు. అయితే తాము ఇస్తున్న మందులు, చికిత్స చాలబాగా ఉపకరిస్తున్నదని కొందరు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. దాడి తర్వాత ఉన్న పరిస్థితి మాత్రం మానవమాత్రునికి జీవించి ఉండటం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమైంది.

మీడియా ద్వారా విజయ్‌ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఇతర రాష్ట్రాల డాక్టర్లు, దేశ రాజధానిలోని ప్రముఖ డాక్టర్లు కూడా ఆశ్యర్యానికి గురయ్యారు. ముఖ్యంగా న్యూఢల్లీి, ముంబయి, బెంగుళూరు,చెన్నై నుంచి హార్ట్‌ స్పెషలిస్టులు, విజయ్‌ను పరిశీలించేందుకు వస్తామని, అంతటి క్రిటికల్‌ కండిషన్‌లో ఉన్నప్పటికీ ఆయనకు ప్రాణహాని కలుగకపోవడంపై మొత్తంగా పరిస్థితిని స్వయంగా తెలుసుకోవాలనే ఆతురత వారిలో కనిపించింది.

ఇందుకు అనుకూలమైన సమయం చెప్పాలని కూడా ఆ డాక్టర్ల ఆ బృందం నిమ్స్‌ వైద్యులను సంప్రదించింది. రోగి కండిషన్‌ను వివరిస్తూ , కొద్ది రోజుల్లో మరింతగా పరిస్థితి మెరుగవుతుందని, అప్పుడు రావచ్చని నిమ్స్‌ బృందం వారికి వివరించింది. వైద్య రంగంలో ఇదో అద్భుతం అని నిమ్స్‌కు ప్రతిష్ఠ పెరిగింది, డాక్టర్లకు కూడా జాతీయ స్థాయిలో పేరు, ప్రఖ్యాతలు వచ్చాయి.

విజయ్‌పై హత్యాప్రయత్నం జరిగిన నాటి నుంచి ముఖ్యమంత్రి ఎక్కువ సమయం బంగ్లాకే పరిమితమవుతున్నారు. అప్పటి నుంచి భార్యను అంటిపెట్టుకొని ఉంటున్నారు. ఆమె పదేపదే విజయ్‌ను కలవరిస్తున్నది. ఆస్పత్రిలో ఉన్న విజయ్‌ను ఒకసారి చూడాలని ఆమె గట్టిగా కోరుతుండటంతో మళ్లీ తన కార్యదర్శిని పురమాయించి, మర్నాడు సతీమణితోపాటు ఆస్పత్రికి వస్తున్నాని చెప్పాడు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి నిమ్స్‌ డైరెక్టర్‌తో సంప్రదించి సమయం ఖరారు చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కుటుంబరావు కూడా నిమ్స్‌ ఆస్పత్రి డాక్టర్లతో సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. తనకు తెలిసిన వారితో కూడా ప్రయత్నించినా ఎవరూ ఈ విషయంలో తమ నిస్సహాయతను వ్యక్తంచేశారు. ఎవరితోనూ మాట్లాడకుండా, ఏదో పోగొట్టుకున్నదానిలా ఒంటరిగా ఉంటున్న విరంచి పరిస్థితిని చూస్తున్న తండ్రి, ఆమెను తిరిగి మామూలు స్థితికి తేవడం సాధ్యంకావడంలేదు.

విరంచికి విజయ్‌తో కొద్దికాలం కిందటే పరిచయం అయినప్పటికీ తక్కువ సమయంలోనే వారి మనస్సులు కలిసిపోయి, ఇరువురి మధ్య గాఢ బందమేదో పెనువేసుకుపోయింది. విజయ్‌తో గడిపిన ఆ కొద్ది రోజులే ఆమెకు మరీమరీ గుర్తుకు వస్తున్నాయి. విజయ్‌ మాటతీరును మర్చిలేకపోతున్నది.

విజయ్‌ తనతో ఒకరోజు ప్రస్తావించిన ప్లాటోనిక్‌ లవ్‌( అమలిన శృంగారం) ఆమెకు గుర్తుకు వచ్చి తనలో తనే మాట్లాడుకుంది. ఈ విషయం ఎందుకు విజయ్‌ తనతో అన్నాడో అని తర్జనభర్జన పడుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. పెళ్లి, శృంగారంతో సంబంధం లేకుండా ఇరువురి మనస్సులు పెనవేసుకున్న రాధామాధవుల ప్రేమలా తామిద్దరం ఉండిపోవాలనా? ఏమిటీ విజయ్‌ ఉద్ధేశ్యం…పదేపదే అమలిన శృంగారం అంశం మదిని తొలిచేస్తున్నది. వివాహం చేసుకొని మానవసంబంధ వాంఛలను తీర్చుకోవడం ప్రేమ కాదని, బహుశ విజయ్‌ అనుకొని ఉంటాడనే స్పృహ ఆమెకు కలిగింది. తాను పాఠ్య పుస్తకాల్లో అమలిన శృంగారం గురించి చదివింది. ప్రముఖ క్లాసికల్‌ గ్రీక్‌ తత్వవేత్త ప్లేటో రచనల ద్వారా ప్లాటోనిక్‌ ప్రేమ విషయం ప్రాచూర్యంలోకి వచ్చింది. తృణకంకణం అనే ఖండ కావ్యంలో ఇదే కీలకంగా రచన సాగింది. ఇదంతా ఆమెకు కొత్తగా అనిపిస్తున్నది. విజయ్‌తో తనకున్నది ఇలాంటి ప్రేమయేనా అని ఆమె యోచిస్తున్నది. ఒక్కసారి విజయ్‌ను చూడాలని ఆమె మనస్సు ఆరాటపడుతున్నది. అందుకే తండ్రిని చూసినప్పుడల్లా విజయ్‌ వద్దకు పోదాం డాడీ అంటూ మారాం చేస్తున్నది. తన పరిచయాలతో ఈ పని చేయలేనని ఆయనకు తెలుసు కానీ ప్రయత్నాలను మాత్రం ఆపలేదు.

ఆస్పత్రిలో ఉన్న విజయ్‌ను చూడటానికి ముఖ్యమంత్రి రావడానికి పెద్దగా అడ్డంకులుండవు. అందుకు సతీమణిఅన్నపూర్ణమ్మను తోడ్కొని సిఎం రావడంతో నిమ్స్‌ డైరెక్టర్‌, వైద్యం అందిస్తున్న డాక్టర్ల బృందం ఆయనకు స్వాగతం చెప్పారు. ఇది చూసిన అన్నపూర్ణమ్మకు మనస్సు చివుక్కుమనిపించింది. అక్కడ తన బాబు చావుబతుకుల మధ్య ఉంటే పూలబొకే ఇచ్చి భర్తను స్వాగతించడం ఆమెకు నచ్చలేదు.ఎప్పుడెప్పుడు విజయ్‌ను చూడాలనే ఆతురతతో ఆమె ఉండగా, డాక్టర్లు సిఎంను ఛాంబర్‌లోకి తీసుకు వెళ్లి కూర్చోబెట్టడం కూడా ఆమెకు తిరస్కారభావంతోనే చూస్తున్నది. ప్రోటోకాల్‌ కోసం అంటూ డాక్టర్లు ప్రవర్తిస్తున్న తీరును ఆమె నేరుగా వ్యతిరేకించకపోయినప్పటికీ…ఇంకా జాప్యాన్ని సహించలేక…వెంటనే విజయ్‌ దగ్గరకు పోదాం లేవండి అని భర్తను దాదాపు చేయిపట్టుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో,డాక్టర్లకు కూడా ఐసియుకు దారి తీయక తప్పలేదు.

ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో అచేతనంగా ఉన్న విజయ్‌ను చూసి అన్నపూర్ణమ్మ కళ్లనీళ్లు పెట్టుకుంది. కొంత దూరం నుంచి మాత్రమే చూడాలని డాక్టర్లు ఆమెను విజయ్‌ మంచం వద్దకు అనుమతించలేదు. మాటపలుకు లేకుండా పడుకున్న విజయ్‌ను తనివి తీరా చూసింది. ఆమెకు కన్నీళ్లు ఆగడం లేదు. ఆమెను కదిలించి, అక్కడి నుంచి తీసుకెళ్లడానికి సిఎం కూడా సాహసించడం లేదు. కొంత సమయం గడిచిన తర్వాత ముఖ్యమంత్రి…ఇక పోదామని చేయిపట్టుకోగానే చేయి విదిల్చింది ఆమె.

నేను బాబు దగ్గరే ఉంటాను. మీరు ముఖ్యమంత్రి కదా ఈ మాత్రం మీ మాట చెల్లుబాటు కాదా అంటూ ఆగ్రహంగా భర్తవైపు చూసింది. విజయ్‌ పిఎ ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఏదైనా అవసరం వస్తుదేమో నని అందుబాటులో ఉంటున్నాడు. అయితే విజయ్‌కు నా అన్న వాళ్లు ఎవరూ లేకపోవడంతో వేరే వాళ్లు ఎవరిని ఐసియూ వరకు అనుమతించడం లేదు. రంజిత్‌తో సహా యువ శాసనసభ్యులు అప్పుడప్పుడు దూరంగానే నిలబడి చూసి పరిస్థితిని డాక్టర్ల వద్ద వాకబ్‌ చేసి వెళ్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విజయ్‌ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నందున డాక్టర్ల బృందం ఎంతో జాగరూకతతో తమ సేవలను అందిస్తున్నది. దీంతో ఇతరులెవరూ ఆయన కోసం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.

సర్‌,మేడం ఎక్కువ సేపు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు తీసుకుపోవడం మంచిదని డ్యూటీ డాక్టర్‌ మరోసారి సిఎంకు గుర్తు చేశారు. దీంతో ఒక అడుగు ముందుకు వేసిన సిఎం తిరిగి వెనుకకు వచ్చి,

నీవే చెప్పవయ్య, నేను చెప్పలేను అంటూ నిలబడ్డాడు.

డాక్టర్‌ చిన్నగా వెళ్లి అన్నపూర్ణమ్మ వద్ద కొద్దిసేపు నిలబడ్డాడు.

మేడం మీరు చాలా సేపటి నుంచి నిలబడ్డారు, కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ వద్దురు గానీ రండి అంటూ చెబుతుండగా గుర్రుగా చూసింది ఆమె.

పర్వాలేదమ్మా,మేమంతా విజయ్‌ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. మీరు ఎప్పుడంటే అప్పుడు వచ్చి చూడవచ్చు. మీకు ఎక్కువ శ్రమ అవుతుందని చెప్పానంతే, రండి ఛాంబర్‌లో కొద్దిసేపు కూర్చొని వద్దురంటూ మరీమరీ చెప్పడంతో కదలక తప్పలేదు ఆమెకు.

నిమ్స్‌ డైరెక్టర్‌ ఛాంబర్‌కు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితోపాటు తాను కూర్చుంది అన్నపూర్ణమ్మ. ఆస్పత్రి సిబ్బంది వాళ్లందరికీ కూల్‌డ్రిరక్స్‌ సర్వ్‌ చేశారు. అయితే ఆమె వాటిని తిరస్కరించి, ఆవేదనతో కూర్చున్నారు.

ముఖ్యమంత్రి ఆస్పత్రికి వచ్చినట్లుగా తెలియడంతో మీడియా మొత్తం అక్కడకు చేరుకుంది. సిఎంను కలుస్తామని వారు సమాచారం పంపించినప్పటికీ ఆయన దానిని పట్టించుకోలేదు.

చాలా సమయం అయింది, మళ్లీరేపు వద్దామని సిఎం తొందర చేయడంతో ఆయనతో పాటు బయలు దేరకతప్పలేదు అన్నపూర్ణమ్మకు.

అంగరక్షకులు ముందు నడుస్తుండగా ముఖ్యమంత్రి దంపతులు కారు ఎక్కడానికి వస్తున్నారు. అయితే ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి విజయ్‌ పై జరిగిన దాడిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

తర్వాత మాట్లాడుతానంటూ సిఎం ముందుకు కదులుతుండగా, అన్నపూర్ణమ్మ మాత్రం అక్కడే నిలబడిరది. దీంతో మీడియా వాళ్లు తమ మైకులు ఆమె వద్దకు తీసుకు రావడంతో ఆమె…

ఆ దుర్మార్గులు మట్టికొట్టుకుపోతారు. అంటూ ఆవేశంగా ఆరిచినంత పనిచేసింది. ఒకవైపు కన్నీళ్లు కారుతున్నాయి.మీడియా వాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఎవడు చేసాడో, చేయించాడో, మా బాబుది కలలో కూడా ఇతరులకు హాని కూడా ఆలోచించని మనస్తత్వం. ఏదైనా వాడు కోలుకుంటున్నాడు. మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి కరుణించాడు. మా బాబు విజయ్‌కు ఆ దేవుని ఆశీస్సులున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ వాడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. దాడి చేసిన వాళ్లను పోలీసులు ఇంకా పట్టుకోలేదు. అంతా ఏమి జరుగుతున్నదో ఏమో, అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

మేడం, మీరు విజయ్‌ను బాబు అంటున్నారు. స్వంత కొడుకులాగా…ఏమిటమ్మా మీ అనుబంధం అంటూ ఒక విలేకరి ప్రశ్నించాడు.

అవును వాడు మా బాబే. ఎంతో ప్రేమగా మేం చూసుకుంటున్నాం. వాడు కూడా నన్ను అమ్మా అంటూ పిలుస్తూ, మాతో ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాడు. మేం ఇద్దరమే ఇటీవల తిరుపతికి వెళ్లి వచ్చాం. అవును వాడు మా బాబే…ఇక మా ఇంట్లోనే ఉంటాడు. అంటూ ఆవేశంగా చెబుతున్న భార్య వద్దకు వచ్చిన సిఎం ఆమెను నిలువరించే పనిచేస్తున్నాడు. కానీ ఆమె ఆవేధన తగ్గడం లేదు. వెక్కివెక్కి ఏడ్చుతోంది. ఆ పరిస్థితిలో మరో ఏ విలేకరి కూడా ఆమెను కదలించే ధైర్యం చేయలేదు. భర్త చేయూతతో మెల్లిగా నడుస్తూ కారు ఎక్కింది అన్నపూర్ణమ్మ.

ఆస్పత్రి నుంచి బంగ్లా వరకు ఒకే కారులో భార్యాభర్తలిద్దరు పక్కపక్కనే ఉన్నా, వారి మధ్య మౌనమే రాజ్యమేలింది. భార్యతో మరో మాట మాట్లాడేందుకు ఎందుకో సిఎం చొరవ తీసుకోలేకపోతున్నారు. ఆమె తనలోకంలో తానుంది. బాబు కోలుకోగానే వెంటనే తన బంగ్లాకు తీసుకు వచ్చి. తన చేతితో తినిపించాలని ఆమె ఆలోచిస్తున్నది. ప్రతి రోజు తప్పకుండా విజయ్‌ను చూసి రావాలని, భర్త వద్దన్నా వినరాదని, అవసరమైతే తాను ఒక్కదానిని వెళ్లాలని కూడా అనుకుంది.

భార్య ధోరణి రోజురోజుకు విపరీతంగా మారుతున్నదని సిఎం తలపోస్తున్నాడు. విజయ్‌తో విడదీయరాని అనుబంధం ఏర్పడిరదని, దీనిని ఎలా తుంచివేయాలనే ఆలోచన కూడా ఆయనకు వచ్చింది.కానీ ఇలాంటి సమయంలో భార్య మనస్సుకు ఏ కొద్ది గాయం అయినా అది మరింత క్లిష్ట పరిస్థితికి దారితీస్తుందని, ఆమెకు వేరే రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందని, హిస్టీరియా, ఇతరత్రా వ్యాధులు వస్తాయని డాక్టర్‌ చెప్పిన విషయం ఆయనకు గుర్తుకు వచ్చింది. విజయ్‌ విషయంలో ఆమెను ఏవిధంగానూ ఇక కష్టపెట్టరాదని సిఎం నిర్ణయించుకున్నాడు.

బంగ్లాకు వెళ్లి కొంత సేద తీరిన తర్వాత అప్పటికే ఆలస్యం అయిందని వర్కర్సు భోజనానికి రమ్మని పిలవడంతో ఎంతో బలవంతం మీద ఆమె వచ్చి డైనింగ్‌ టేబుల్‌ మీద కూర్చుంది. వడ్డించిన భోజనాన్ని చేతులతో కలుపుతున్నదే కానీ, నోట్లోకి ఒక్క ముద్ద కూడా పోలేదు. వర్కర్సు ఇదంతా చూస్తూ ఉండిపోయారు. సిఎం కూడా ఆమెను అనునయిస్తూ…

కొంచెమైనా తిను పూర్ణా, నీరసం అవుతావు. నీవు ఆరోగ్యంగా ఉంటేనే కదా విజయ్‌ను చూడటానికి వెళ్లవచ్చు. నీవు మంచిగా లేకుంటే వాన్ని ఎవరు చూస్తారు చెప్పు, విజయ్‌ కోసమైనా నీవు తినాలని సిఎం చెప్పగానే ఆమె గబాగబా తినడం ప్రారంభించింది. విజయ్‌ పేరు చెబితేనే భోజనం చేస్తున్న భార్య వైపు అదోలా చూస్తూ తాను భోజనం చేయడం కూడా మరిచాడు ముఖ్యమంత్రి. ఆమె పూర్తిగా తినే వరకు ఆమె వైపు చూస్తూ, ఇద్దరూ ఒక్కసారే లేచి చేతులు కడుక్కున్నారు.

ముఖ్యమంత్రి కూడా గతంకు భిన్నంగా ఆలోచించడం ప్రారంభించాడు. తనకేమైంది. తాను రాజకీయంగా ఎదగడానికి తొక్కిన అడ్డతోవలు, చేసిన దుర్మార్గాలు, చేయించిన చెడ్డపనులు అన్నీ ఆయన మస్తిస్కంలో సుడులు,సుడులుగా తిరుగుతున్నాయి. చూద్దాం భవిష్యత్తులో మరెన్ని ఆటుపోట్లకు లోనుకావాల్సి వస్తుందో అనుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు. భార్య పరిస్థితి ఆయనను చాలా భయపెడుతున్నది. రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగినా,కోట్లాది సంపద కూడబెట్టినా…ఇవేమీ తన సహధర్మచారిణికి సంతోషం కలిగించలేదని ఆయనకు తెలుసు. సంతానం కలుగలేదనే ఆమె బెంగను ఇక ఎప్పటికీ తీరే అవకాశం లేనందున ఆమె సూచన ప్రకారం విజయ్‌ను దత్తత తీసుకోకపోవడంలోని ఔచిత్యం కూడా సిఎంకు అంతుబట్టడం లేదు.

రాష్ట్ర ప్రజల్లో ప్రస్తుతం విజయ్‌ కు వచ్చిన పాపులారిటీ తక్కువేమీ కాదు. తనకంటే వాన్ని ప్రజలు అధికంగా ప్రేమిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా విజయ్‌ను భవిష్యత్తులో కీలక నేతగా ఇప్పటికే గుర్తించింది. ప్రజాభిమానం విజయ్‌కు అధికంగా ఉందని ఇటీవలి రెండు సంఘటనలురుజువు చేసాయి. వాడు కోలుకున్న తర్వాత పూర్ణ, వీలునామా, దత్తత అంశాలను మరోసారి తనను నిలదీసే ప్రమాదం ఉంది. అప్పుడు ఏ సమాధానం చెప్పాలో కూడా తనకు తెలియని పరిస్థితి ఏర్పడిరది. విజయ్‌ రాజకీయంగా బలపడినందున కావాలని తాను దత్తత తీసుకుంటున్నానని కూడా ప్రత్యర్థులు ఆరోపించే అవకాశాలు లేకపోలేదు.అనేక ఆలోచనలు ఆయన మెదడును తొలిచివేస్తున్నాయి. దేనికీ కనీస పరిష్కారం కనిపించని దుస్థితిని మొదటిసారిగా ఆయన ఎదుర్కొంటున్నారు. చాలాసేపు కుర్చీలో కూర్చొన్నాడు. తర్వాత బెడ్‌పై పడుకున్నా, అవే ఆలోచనలు వస్తున్నాయి. ఎటూపాలుపోని స్థితిలో అటుఇటు బొర్లు తున్నాడు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని స్థిమితపడేందుకు ప్రయత్నిస్తున్నాడు సిఎం.

ముఖ్యమంత్రి సతీమణి, విజయ్‌ విషయంలో ఎంతో ఆవేధనతో మాట్లాడిన మాటలకు మీడియా అధిక ప్రాధాన్యతనే ఇచ్చింది. ముఖ్యమంత్రి కుటుంబంతో సన్నిహిత సంబధాలున్న విజయ్‌పై దాడి జరిగి ఎక్కువ రోజులే అవుతున్నా, రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఇప్పటివరకు నింధితుల ఆచూకీ కూడా తెలుసుకోలేక పోవడాన్ని మీడియా తప్పుపట్టింది. అన్నపూర్ణమ్మ మాతృ హృదయం విజయ్‌ కోసం తల్లడిల్లుతున్నదని, రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నట్లుగానే ఆమె కూడా విజయ్‌ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నదని, ఆమె ప్రార్థనలు ఎప్పటికీ సాకారం అవుతాయో చూడాలని ఎలక్ట్రానిక్‌ మీడియా పదేపదే ప్రసారం చేస్తున్నది.

మీడియాలో అన్నపూర్ణమ్మ ఆవేధన చూసిన విరంచి కూడా మరోసారి విచారంలో మునిగిపోయింది. విజయ్‌ ఎలా ఉన్నాడో కనీసం టివి వాళ్లు కూడా ఆయనను చూపకపోవడంతో ఆమెలో మరింత ఆందోళన ఏర్పడిరది. విజయ్‌ను చూడాలనే కోరిక కలగడంతో తండ్రి నిస్సహాయత గుర్తుకు వచ్చింది.పాపం డాడీ ఎందరినో అడిగి చూసాడు, ఎవరూ సహకరించలేదని సమాధానపడింది.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-38)

Leave A Reply

Your email address will not be published.