వచ్చేనెల 28 నుంచి బీహార్ లో ఎన్నికలు
నవంబర్ 10న ఫలితాలు
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నామని సీఈసీ సునిల్ అరోరా శుక్రవారం మీడియాకు తెలిపారు. 71 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28వ తేదీన తొలి దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. 16 జిల్లాల్లో.. 31 వేల పోలింగ్ స్టేషన్లలో ఆ ఎన్నికలు జరుగుతాయి. ఇక రెండవ దశలో 94 స్థానాలకు నవంబర్ 3వ తేదీన 17 జిల్లాల్లో.. 42 వేల పోలింగ్ స్టేషన్లలో జరగనున్నాయి. ఇక మూడవ దశ ఎన్నికలు నవంబర్ 7వ తేదీన 78 స్థానాలకు.. 15 జిల్లాల్లో.. 33.5 వేల పోలింగ్ స్టేషన్లలో ఉంటాయని సీఈసీ తెలిపారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 10వ తేదీన ఉంటుందని సునిల్ ఆరోరా తెలిపారు. కాగా కోవిడ్ నిబంధనల్లో భాగంగా.. కాగా కోవిడ్ నేపథ్యంలో భారీగా మాస్క్‌లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లను బీహార్ ఎన్నికలను వాడనున్నారు. ఎన్నికల వేళ 7 లక్షల శానిటైజర్లు, 46 లక్షల మాస్క్‌లు, 6 లక్షల పీపీఈ కిట్లు, 7.6 లక్షల ఫేస్ షీల్డ్‌లు, 23 లక్షల హ్యాండ్ గ్లౌజ్‌లు వాడనున్నారు. ఏర్పాట్లలో జాప్యం చేయవద్దని అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కాగా 243 స్థానాల్లో 38 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించినట్లు సీఈసీ సునిల్ తెలిపారు. ఈవీఎం బటన్లను నొక్కేందుకు గ్లౌజ్‌లను ఓటర్లకు ఇవ్వనున్నారు. కోవిడ్ వల్ల క్వారెంటైన్లో ఉన్నవారికి కూడా ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. అయితే ఎన్నికల రోజున చివరి గంట కోవిడ్19 రోగులకు అనుమతి కల్పించారు. వారి వారి పోలింగ్ స్టేషన్ల వద్ద ఈ అవకాశం ఇవ్వనున్నారు. ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలో క్వారెంటైన్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు. క్వారెంటైన్ ఓటర్లకు పోస్టల్ ఓటింగ్‌కు కూడా అనుమతి ఇచ్చారు. పోస్టల్ ఓటింగ్‌కు అదనంగా .. పోలింగ్ చివరి గంట బూత్‌లో ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ సమయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్ధారించారు. అయితే పెంచిన గంట సమయం.. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు వర్తించదని సీఈసీ సునిల్ అరోరా తెలిపారు.