రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి సమావేశం
కరోనా టెస్టుల సంఖ్య వేగవంత చేయాలి

ఢిల్లీ (CLiC2NEWS): కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రపుభుత్వం నేడు అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం అన్ని రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశంలో కరోనా నిర్థారణ పరీక్షల వేగం పెంచాలని సూచించారు.ఇంతవరకు దేశంలో ఈ కొత్త రకం కనిపించ లేదని స్పష్టం చేశారు. అయినప్పటికి అన్ని రాష్ట్రాలు అవసరమైన ఆరోగ్య సదుపాయాలు సమకూర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా విమానాశ్రయాలపై నిఘా ఉంచాలని, విదేశాలనుండి వచ్చేవారికి ఆర్టి-పిసిఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని, ఎవరికైనా పాజిటివ్‌గా నిర్థారణయితే ఆ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణకు పంపించాలని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ తో ప్రమాదమని హెచ్చరిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ 14 దేశాలకు వ్యాపించింది.