తిరుమల ఘాట్ రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ట్రాఫిక్‌జామ్‌

తిరుమల (CLiC2NEWS): తిరుమల రెండో క‌నుమ‌దారిలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. బుధవారం ఉదయం 5.40 గంటల ప్రాంతంలో భారీ సైజు టన్నుల‌ కొద్ది బరువున్న రాయి కొండ‌పై నుంచి ఇక్క‌డ ర‌హ‌దారి పై ప‌డిండి. దాంతో ఘాట్ రోడ్డు ధ్వంసం అయింది. ఈ ఘ‌ట‌న‌లో ర‌హ‌దారి మూడు చోట్ల పాక్షికంగా ధ్వంస‌మైంది. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన స‌మ‌యంలో ఈ మార్గంలో వ‌స్తున్న ఆర్టీసీ బ‌స్సుకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. వెంట‌నే స్పందించిన టిటిడి అధికారులు, సిబ్బంది ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఈ మార్గంలో కొండ‌పైకి వెళ్లే వాహ‌నాల‌ను తాత్కాలికంగా ఆపివేశారు.

మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు రెండవ ఘాట్‌ రోడ్‌లో పూర్తిగా వాహనాలు నిలిపివేయడంతో అలిపిరిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కాగా దీనికి ప్ర‌త్యామ్నాయంగా లింక్‌రోడ్డు నుంచి విడ‌త వారీగా కొండ‌మీద‌కి పంపేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కొండ‌పై నుంచి కిందికి వ‌చ్చే వాహ‌నాల‌కు ఎలాంటి ఇబ్బందిలేదని టిటిడి వ‌ర్గాలు తెలిపాయి. మొదటి ఘాట్‌ రోడ్డు నుంచి విడతల వారీగా తిరుమలకు వెళ్లడానికి వాహనాలకు అనుమతిస్తున్నట్లు టీటీడీ సీవీఎస్వో గోపీనాధ్ జెట్టి తెలిపారు. కాగా రెండవ ఘాట్ రోడ్డును టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.