గడీల ఛతప్రతి: అదరగొట్టిన లిఖిత్ `ఆరెంజ్ ఆర్మీ`
ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ టెలివిజన్ చానెల్ `స్టార్ స్పోర్ట్స్` (తెలుగు)లో వర్ధమాన నవయువ సంగీత కళాకారుడు
లిఖిత్ దోర్బల స్వరపరిచి, పాడి, ప్రధాన పాత్ర (మ్యూజిక్ వీడియో) పోషించిన
`ఆరెంజ్ ఆర్మీ` క్రికెట్ ఫ్యాన్ ఆంథమ్ సెప్టెంబర్ 27న ప్రసారమైంది.
గత కొద్ది నెలలుగా సామాజిక మాధ్యమాలలో విశేష ఆదరణ పొందిన ఈ థీమ్ సాంగ్, ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న `ఐపిఎల్-13` సీజన్ నేపథ్యంలో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి చవిచూసిన `సన్‌రైజర్స్` (హైదరాబాద్) రానున్న రోజుల్లో `అద్భుత క్రీడా నైపుణ్యాన్ని` ప్రదర్శించి విజయం దిశగా దూసుకుపోవాలన్న ఆకాంక్షతో సాగే ఈ పాట ప్రతీ ఒక్క క్రీడాభిమానిలోనూ బలవత్తరమైన స్ఫూర్తిని నింపుతుందనడంలో సందేహం లేదు. `ఓటమైనా, గెలుపైనా మేమంతా ఎప్పటికీ మీ వెంటే ఉంటామని, మనసులోని మన లక్ష్యానికి ప్రాణం పోయడానికి సైన్యం వలె దూసుకెళ్లమని, అభిమానులంతా ఏకకంఠంతో కోరుకుంటున్న రీతిలో ఈ గీతం సాగుతుంది. పాట లిరిక్స్‌కు తగ్గట్టుగా స్వరపచడమే కాక వీడియో చిత్రీకరణ కూడా అందరినీ ఆకట్టుకొంటున్నది.
గత మార్చిలో జరుగవలసిన ఈ ఐపీఎల్, `కరోనా` కారణంగా వాయిదా పడి, సెప్టెంబరు 19న మొదలైనప్పటికీ ఎలాంటి నిరుత్సాహానికి తావులేని రీతిలో సహ వీక్షకులను చైతన్య పరిచే క్రమంలో భాగంగా లిఖిత్ `ఆరెంజ్ ఆర్మీ` పాటను ప్రసారం చేయడం ప్రశంసనీయం. 21 సంవత్సరాల లిఖిత్ అన్నీ తానై, నెలల తరబడి శ్రమించి రూపొందించిన `ఆరెంజ్ ఆర్మీ` పాట నేపథ్యాన్ని తెలుసుకొంటే, క్రికెట్ పట్ల, సంగీతం పట్ల తనలో ఉన్న ప్రేమాభిమానాలు` ఎంతటివో తెలుస్తుంది. దుబాయ్ `ఐపిఎల్-13` సీజన్ ప్రారంభం కావడానికి మూడు రోజులు ముందుగానే, `సన్‌రైజర్స్ హైదరాబాద్` ఆఫీషియల్ ఫ్యాన్ ట్యూబ్ చానెల్లో ఈ `ఆరెంజ్ ఆర్మీ` ఫ్యాన్ థీమ్ వీడియో సృష్టికర్త లిఖిత్ దోర్బల ఇంటర్వ్యూను ప్రసారం చేశారు. అందులో ఈ పాటకోసం తానెలా కష్టపడిందీ చెప్పుకొచ్చాడు. `క్రికెట్ పై ఉన్న అవ్యాజమైన ప్రేమతోనే తాను మూడేండ్ల క్రితమే ఈపాట(ట్యూన్)కు రూపకల్పన చేశానని, లిరిక్స్ నుంచి ఆడియో-వీడియో వరకు పూర్తి అంకితభావంతో మేమంతా పని చేశామని` అన్నాడు. టీమ్ఈలోని వారంతా నవయువకులే కావడం గమనార్హం. `అందరిలోనూ అంతటి అంకితభావం ఉండటమే ఈ థీమ్సాంగ్ వీడియో విజయవంతం కావడానికి ప్రధాన కారణమని` లిఖిత్ అంటాడు. కరోనా మనదేశంలోకి పూర్తి స్థయిలో ప్రవేశించడానికి ముందే ఆడియో-వీడియో చిత్రీకరణలు పూర్తయినట్లు చెప్పాడు. `వరల్డ్ మ్యూజిక్డే -2020` (జూన్ 21) నాడు తన యూట్యూబ్ చానల్లో పాటను విడుదల చేసిన కొద్ది గంటల్లోనే వందల సంఖ్యలో వ్యూస్‌ను సంపాదించుకొన్న తీరునుబట్టి, ఇది ప్రజలను ఎంతలా ఆకట్టుకున్నదో అర్ధమవుతుంది. `తమ కష్టానికి ప్రతిఫలం లభించినందుకు ఆనందంగా ఉందని` లిఖిత్ పై ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ `ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ థీమ్ సాంగ్` దేశంలోని ప్రధాన థీమ్ సాంగ్‌లలో చోటు సంపాదించుకోవడం విశేషం.
గడచిన 3 నెలలలోనే, ఇప్పటికి ఈ పాట సుమారు 6,000కు పైగా వ్యూస్ ను సంపాదించుకొంది. రెండు రోజుల్లోనే 2,000 వ్యూస్ వచ్చాయి. తన యూట్యూబ్ చానల్లో లిఖిత్ ఇప్పటికి (సెప్టెంబర్ 28) మొత్తం 53 వీడియోలు పోస్టు చేయగా, 1390 మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. అత్యధికంగా 21,000 వ్యూస్‌ను సాధించిన వీడియో (మనోహరా/వసీగరా) ఒక రికార్డు కాగా, `కనవే కనవే` సోలో పియానో పాట అయితే కేవలం రెండు నెలల్లోనే 5,300 వ్యూస్‌ను సాధించింది. ఇప్పటి వరకు తన చానల్‌కు మొత్తం 1,45,000కు పైగా వ్యూస్ వచ్చాయి. ఐదేండ్ల వయసులో, తాను ఒకటో తరగతిలో ఉండగా, చిటిచిట్టి వేల్లతో కీబోర్డుపై పాటలను వాయించడంతో మొదలైన లిఖిత్ దోర్బల సంగీత కళాసాధన గత 16 ఏండ్లుగా నిరంతరాయంగా సాగుతూ, అనేక విజయాలను నమోదు చేసింది. ప్రాథమిక విద్యాభ్యాసం సాగినంత కాలం వివిధ ప్రత్యేక కార్యక్రమాలలో బృందాలతో భాగంగానేకాక సోలోగాను అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. అక్కినేని నాగేశ్వరరావు, డాక్టర్ నూకల చిన సత్యనారాయణ, డాక్టర్ సి. నారాయణరెడ్డి, యద్దనపూడి సులోచనారాణి, సబితా ఇంద్రారెడ్డి, గంగాధరశాస్త్రి, చొక్కాపు వెంకటరమణ వంటి ప్రసిధ్ధులతో బహుమతులు, అవార్డులు, అభినందనలు అందుకొన్నాడు. ఆరేండ్ల వయసులోనే కండ్లకు గంతలు కట్టుకొని, హైదరాబాద్ త్యాగరాయ గానసభ ప్రజావేదికపై కీబోర్డు వాయించిన సందర్భంగా ప్రముఖుల ప్రశంసలు పొందాడు.
కీబోర్డు నుంచి పియానోకు మారిన తర్వాత `ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్` గ్రేడ్లలో ఏడాదికి ఒకటి చొప్పున ఏడింటిని పూర్తి చేసి, ప్రస్తుతం 8వ గ్రేడ్‌కు సిద్ధమవుతున్నాడు. తొలుత ఎస్. వెంకట రమణ వద్ద ప్రాథమిక స్థాయి సంగీతం నేర్చుకొని, తదనంతరం అవినాష్ (రాకాన్ ఇన్స్టిట్యూట్, గచ్చిబౌలి) గైడెన్స్‌లో ఆరు గ్రేడ్స్ పూర్తి చేశాడు. `హైదరాబాద్ వెస్టర్న్ మ్యూజిక్ అసోసియేషన్`లో సంస్థ వ్యవస్థాపకులు జో కోస్టర్ మార్గదర్శకత్వంలో ఏడవ గ్రేడు పూర్తి చేసి, ప్రస్తుతం జే పార్టే వద్ద అదే సంస్థలో ఎనిమిదవ గ్రేడ్ కోసం సిద్ధమవుతున్నాడు. ప్రత్యేకమైన, ఆసక్తికరమైన బాణీలతో అన్ని వయసులవారికి నచ్చేలా సంగీత సృజన చేయాలన్నదే తన లక్ష్యంగా చెబుతున్న లిఖిత్ దోర్బల భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకొందాం.