ఆర్.ఆర్.ఆర్లో జూనియర్ భీమ్, సీతారామ్లు..!
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించే ఆర్. ఆర్. ఆర్.సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ రామ్చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ప్రతీ చిత్రంలో ఏదో ఒక కొత్తదనంతో రాజమౌళి ప్రేక్షకులను అలరిస్తుంటారు. సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ రాశారు. ఎంఎం.కీరవాణి బాణీలను జోడించారు. ఈ సినిమాలో అజరు దేవగణ్, శ్రియ అతిథి పాత్రల్లో కనిపించి సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ లాక్డౌన్ కారణంగా విడుదల వాయిదాపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఈ సినిమాలో కథానాయకులుగా నటిస్తున్న ఎన్టిఆర్, రామ్చరణ్ లకు బాలనటులుగా చక్రి, వరుణ్ బుద్ధదేవ్, స్పందన చతుర్వేది లు కనిపించనున్నారు. స్పందన తన ఇన్స్టాగ్రామ్లో ఫొటోలను షేర్ చేస్తూ.. ”ఆర్.ఆర్.ఆర్ షూటింగ్లో అందమైన మధుర జ్ఞాపకాలు.. దీన్ని ఆశీర్వాదంగా ఫీల్ అవుతున్నా” అని తెలిపింది.
బాలనటుడు చక్రి మీడియాతో మాట్లాడుతూ.. కొమరం భీమ్ (తారక్) చిన్నప్పటి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపాడు. దీంతో అల్లూరి సీతారామరాజు (చరణ్) చిన్నప్పటి పాత్రను మరో బాలనటుడు వరుణ్ బుద్ధదేవ్ నటించవచ్చునేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు. సీత (అలియా భట్) గా స్పందన నటిస్తున్నట్లు సమాచారం.