యువతకు పుస్తకాలే నేస్తాలు..

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రదర్శన

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): యువతకు సంతోషాన్నిచ్చి, బాధను పంచుకునే చక్కని నేస్తాలు పుస్తకాలేనని మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ డైరెక్టర్ డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. బుధవారం అశోక్ నగర్ లోని అశోక్ నగర్ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ” జాతీయ యువజన దినోత్సవం “సందర్భంగా పుస్తకం ప్రదర్శన నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కరోనా తో అందరూ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.ఈ సమయాన్నీ పుస్తకాలు చదవడానికి ఉపయోగించాలన్నారు. పుస్తకాలు కొత్త ప్రపంచంలో విహరింపచేసి కొత్త కొత్త అనుభవాలను, అనుభూతులను పంచి పరిణతికి, మనోవికాసానికి దోహదం చేసే అద్భుత మార్గదర్శకాలన్నారు. యువతకు మంచి ప్రవర్తనను పెంపొందించే అద్భుత సాధనాలన్నారు. యువత లక్ష్య సాధనకు మానసిక బలం ఉండాలన్నారు. పుస్తక పఠనం అలసటలో, ఆవేదనలో, ఆర్తిలో, సుఖంలో, సంతోషంలో ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాయన్నారు. పిల్లలకు బాల్యం నుంచే పుస్తకాలు చదవటం అలవాటు చేయాలన్నారు. ముఖ్యంగా యువత అలసత్వ ధోరణిని విడనాడి, కరోనా మార్గ దర్శకాల పాటింపుతో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
రచయిత డా. ఈటెల సోమన్న మాట్లాడుతూ రచయితలు గతించిపోవచ్చు కాని, పుస్తకాలు నశించవన్నారు. గ్రంథాల నుంచి స్ఫూర్తిని పొందుతూనే వున్నామన్నారు. వాటిలోని సందేశాలను, నీతులను యువత అనుసరించాలన్నారు. యువత ఆలోచనలలో ఆధునికత ఉండేలా చూసుకోవాలన్నారు.

సినియర్ జర్నలిస్టు, రచయిత జయసూర్య మాట్లాడుతూ పుస్తకాలు చదవటం శ్వాస పీల్చటం లాంటిదన్నారు. ఒక పుస్తకం, ఒక కలం, ఒక ఉపాధ్యాయుడు.. ఇవి ఈ ప్రపంచాన్నే మార్చగలవని తెలిపారు. ఆస్తులు పోవచ్చు, భవనాలు కూలిపోవచ్చు, కాని పుస్తకాలు నశించవన్నారు.

పి.ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ పి.టి.టిచర్ కె.అన్నపూర్ణ మాట్లాడుతూ పుస్తకాలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరం లాంటిదన్నారు. అశాంతిమయ క్షణాల్లో, నిరాశా నిస్పృహలలో, ఒంటరి తనంలో పుస్తకమే నిజమైన నేస్తమన్నారు.పుస్తకాలు అనే స్నేహితులు సుఖ దుఃఖాలలో తోడుగా నిలుస్తాయన్నారు. బాధలో, మనని ఎప్పుడూ విడిచి పెట్టవన్నారు. లోపాలను దిద్ది మంచి దారిలో పెడతాయన్నారు.

పుస్తక ప్రదర్శనలో డా.హిప్నో కమలాకర్ , రచించిన పుస్తకాలు, పిల్లల పుస్తకాలు,జీవితం చరిత్రలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈకార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు డి.రామముర్తి, కార్యదర్శి బి.సూర్య ప్రకాశ్, సి.హెచ్.సుభాషిణి , క్లినికల్ సైకాలజిస్ట్ హిప్నో సరోజా రాయ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.