ప్ర‌జ‌ల స్పీక‌ర్‌.. బాల‌యోగి

ఢిల్లీలో ఉండే నాయ‌కుడు గ‌ల్లీలో ఉండేవాడు.. ఎప్పుడూ బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు.. పేద ప్ర‌జ‌ల మ‌ధ్య క‌లిసి జేవించేవారు..
వారి క‌ష్ట‌సుఖాల్లో పాలుపంచుకునేవారు. ఆయ‌న ఢిల్లీ స్థాయి నాయ‌కుడిగా ఎదిగినా ప్ర‌జ‌లతో మ‌మేకమ‌య్యేవారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప గుణం బాల‌యోగి సొంతం. ఆయ‌నే ప్ర‌జ‌ల స్పీక‌ర్‌.. ప్ర‌జ‌ల మ‌నిషి..
మ‌న తెలుగు తేజం జిఎంసి బాల‌యోగి. ఈ రోజు జి.ఎం.సి.బాలయోగి 69వ జయంతి..
ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఘ‌న నివాళులు అర్పిద్దాం.

 

తెలుగు రాష్ట్రాలలో లోక్ సభ స్పీకర్ గా పని చేసిన రెండవ వ్యక్తి గంటి మోహన్ చంద్రబాల యోగి. మొదటి స్పీకర్ నీలం సంజీవరెడ్డి. కాగా లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా గోడె మురహరి పని చేసారు. ఎపుడూ సామాన్యులతో మమేకమై వారి కష్టనష్టాలను చ‌వి చూసిన మహోన్నత నాయకులు బాలయోగి. 1989లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సమావేశానికి ముఖ్యమంత్రి గా హాజరైనపుడు బాలయోగిని చూసి, ” నేను బాలయోగి అంటే యోగి పుంగవుడు అనుకున్నాను. మీరు ప్రతీరోజూ మా ప్రభుత్వం పై జడ్.పి.చైర్మన్ గా విమర్శలు చేస్తున్నారు. ఇంటిలిజెన్స్ వారు చెపితే విన్నాను. ఇపుడు చూస్తున్నాను”” అని చెప్పడం కాకినాడ లో పాత్రికేయ వృత్తిలో నేను ఉన్నప్పుడు జరిగింది.

నేడు (అక్టోబ‌రు 1వ తేదీ) జి.ఎం.సి.బాలయోగి 69వ జయంతి. తూర్పుగోదావ‌రి జిల్లా అభివృద్ధి ప్రదాత గంటి మోహనచంద్ర బాలయోగి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. బాలయోగి 1951, అక్టోబర్ 1న తూర్పు గోదావరి జిల్లా యెదురుగన్నయ్య, సత్యమ్మ లంక గ్రామంలో గంటి దంపతులకు ఒక దళిత రైతు కుటుంబములో జన్మించారు.

(బాల‌యోగి పేరు నేప‌థ్యంః తూర్పుగోదారి జిల్లాలోని ముమ్మిడి వరం గ్రామంలో బాల‌యోగి అనే 16 యేళ్ల యువ‌కుడు చిత్తూరు నాగ‌య్య న‌టించిన‌ భ‌క్త పోత‌న సినిమా చూసి ప్ర‌భావితుడై కొన్నేళ్ల‌పాటు త‌ప‌స్సు చేశారు. ఆ యోగి పుంగవుడి పేరునే మ‌న బాల‌యోగికి పెట్ట‌ట‌డం జ‌రిగింది. ఆ కాలంలోనే స‌ప్త‌రుషులు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో మాన‌వులుగా జ‌న్మించి త‌ప్ప‌స్సు చేసి బాల‌యోగులుగా మారారు అని ఈప్రాంతం వాళ్ల న‌మ్మకం. ఈ ఏడుగురిలో ముమ్మిడివ‌రం బాల‌యోగి ఒక‌రు.)

 

 

బాల‌యోగి ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ, ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుండి లా డిగ్రీలతో పట్టభద్రుడయ్యారు.1982 ఏప్రిల్ 16 న విజయకుమారిని వివాహము చేసుకున్నాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.1987-91తూర్పు గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు. కాగా ఆయన తొలుత ఎస్ఆర్ఎంటి లో లీగల్ అడ్వయిజర్ గా పని చేసారు. కాకినాడ కోర్టులో న్యాయవాది గా పని చేసారు. అపుడే జూనియర్ సివిల్ జడ్జి గా ఎంపికయ్యారు. అయితే 1987లో ఎన్టీఆర్ ఆయనను జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి గా ఎంపిక‌ చేసారు.

మరణంః 2002, మార్చి 3 న భీమవరము నుండి తిరిగివస్తుండగా సాంకేతిక లోపము వలన హెలికాప్టరు ఒక కొబ్బరి చెట్టుకు తగిలి కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామం సమీపములోని ఒక చేపల చెరువులో కూలిపోయి, ఆ ప్రమాదములో బాలయోగి మరణించారు.

 

  • 1991లో 10వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనారు.
  • 1996 – 1998 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు, ఉన్నత విద్యా శాఖా మంత్రి
  • 1998 – 12వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనారు.
  • 1998, మార్చి 24 – 2002, మార్చి 3 లోక్‌సభ స్పీకర్
  • 1999 13వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనారు.

 

-టి.వి.గోవిందరావు

Leave A Reply

Your email address will not be published.