పోలీసులు నన్ను నెట్టేశారు
దేశంలో నడిచే అకాశం కూడా లేదా?: రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హత్రాస్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్ గాంధీకి, పోలీసులకు గ్రేటర్ నోయిడా వద్ద తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. ఇవాళ (గురువారం) హత్రాస్ యువతి తల్లితండ్రులను కలుసుకునేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ వెళ్లారు. వాహనాల్లో వెళ్లాలనుకున్న ఆ ఇద్దర్నీ పోలీసులు అడ్డుకున్నారు. హత్రాస్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రేటర్ నోయిడా వద్ద రాహుల్ వాహనాన్ని నిలిపేశారు. దీంతో వాళ్లు కాలినడకలో హత్రాస్ దిశగా పయనం అయ్యారు. ఢిల్లీ-యూపీ హైవేపై రాహుల్ కాలిబాట పట్టారు. ఆ సమయంలో పోలీసులు తనను నెట్టివేసినట్లు రాహుల్ ఆరోపించారు. తనపై లాఠీచార్జ్ కూడా చేసినట్లు ఆయన ఆరోపించారు. తనను నేలపై పడేసినట్లు రాహుల్ తెలిపారు.
ఈ క్రమంలో పోలీసులు రాహుల్‌ను కిందతోసేశారు. దీనిపై రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘పోలీసులే నన్ను కిందకు తోసేశారు. నాపై లాఠీఛార్జ్ చేశారు. ఏం చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పాలి. రోడ్డుపై కేవలం మోదీయే నడవాలా? సామాన్యులు నడిచే హక్కు లేదా? మా వాహనాలను ఆపేశారు. అందుకే మేం నడక ప్రారంభించాం.’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన కేవలం ఆర్ ఎస్ ఎస్ నేతలు మాత్రమే రోడ్డుమీద నడవాలా? అని మోడీ సర్కార్‌ను నిలదీశారు.
మా పోరాటం ఆగదుః ప్రియాంక
ఉన్నావ్ ఘటనలాగే హత్రాస్ బాధితురాలి తరఫున పోరాటం చేస్తామని ప్రియాంక గాంధీ అన్నారు. యూపీలో మహిళలపై ఆకృత్యాలు ఆగడం లేదన్నారు. యువతి అంత్యక్రియల విషయంలో పోలీసులు అనుసరించిన తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. దోషులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.