విద్యాసంస్థల్లో ఈనెల 20వరకు ఆన్లైన్ బోధన కొనసాగించాలి: హైకోర్టు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు ఈ రోజు మరోసారి విచారణ చేపట్టింది. వైరస్ తీవ్రత పూర్తిగా తొలగిపోలేదని, రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ బోధన కూడా కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది.ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్లైన్ బోధన కొనసాగించాలని పేర్కొంది.
హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు తప్పకుండా అమలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కరోనా నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మేడారం సమ్మక్క – సారక్క జాతరలో కొవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని, అదేవిధంగా సమతామూర్తి సహస్రాబ్ధి వేడుకల్లోనూ నిబంధనలు అమలయ్యేలా చూడాలని అడ్వకేట్ జనరల్‌కు కోర్టు తెలిపింది. నిర్లక్ష్యం కారణంగా కరోనా మళ్లీ విజృంభించకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని హైకోర్టు తెలిపింది.