రాష్ట్రానికి బాకాయిలను విడుదల చేయండి: మంత్రి హారీశ్‌రావు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని మంత్రి హరీశ్ రావు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధికి సంబంధించిన రెండేళ్ల బకాయిలు రూ. 900 కోట్లను మంజూరు చేయాలని లేఖలో కోరారు.
నీతి ఆయోగ్ సూచించిన ప్రకారం రాష్ట్రానికి రూ. 24,205 కోట్లు రావాలి. 14వ ఆర్ధిక సంఘం స్థానిక సంస్థలకు రూ. 817.61 కోట్లు ఇవ్వాలన్న సిఫారసులను కేంద్రం తిరస్కరించింది. 15వ ఆర్ధిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి రూ. 723కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని సూచించింది. 2014-15 లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబధించిన తెలంగాణ వాటాను పొరపాటున ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారని, ఈ విషయాన్ని ఎపి ప్రభుత్వంతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకెళ్లామని, ఇంకా అవి సర్దబాటు కాలేదని అన్నారు. 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఐజిఎస్టి నిధుల్లో రాష్ట్ర వాటాగా పెండింగ్‌లో ఉన్న రూ. 210 కోట్లను సర్దుబాటు చేయాలి అని మంత్రి హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు.