మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సిఎం కెసిఆర్

సిద్దిపేట (CLiC2NEWS): కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ ను ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టమని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ వద్ద నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ జాతికి అంకితం చేశారు. స్విచ్ఛాన్ చేసి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లోకి సిఎం కెసిఆర్ నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ…
ఈ జలాశయం నిర్మాణంలో 58 వేల కు పైగా కార్మికులు పాల్లొన్నారని అన్నారు. ఇది మల్లన్న సాగర్ కాదని.. తెలంగాణ జనహృదయసాగరమని… తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరమని పేర్కొన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు శాశ్వతంగా మంచినీటి సమస్యను దూరం చేసే గొప్ప ప్రాజెక్టు ఇది అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
“ గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాభిషేకం చేస్తామని ఆనాడు చెప్పాం.. ఈ రోజు కలశాల్లో గోదావరి నీటిని తీసుకెళ్లి అభిషేకం చేస్తాం… కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మంత్రి హరీష్ రావు పాత్ర ఎనలేనిది. గతం నీటి పారుదల శాఖ మంత్రి గా ఆయన ఎంతో కృషి చేశారు. మల్లన్నసాగర్ లో కొన్ని గ్రామాలు ముంపు నకు గురయ్యాయి. వారి త్యాగం వెలకట్టలేనిది. పరిహారం అందని వారు ఎవరైనా ఉంటే వారికి అందేలా చూస్తాం“ అని కెసిఆర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.