హైదారాబాద్‌లో అదృశ్యమైన బాలుడు ఢిల్లీలో ప్రత్యక్షం..

హైదరాబాద్ (CLiC2NEWS): ఈనెల 17వ తేదీన తప్పిపోయిన బాలుడు ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు. మల్లేపల్లి బడీమసీదు ప్రాంతంలో ఉంటున్న కారు డ్రైవర్ హనీఫ్ కుమారుడు ఆయాన్ ఫిబ్రవరి 17వ తేదీన తప్పిపోయాడు. తల్లిదండ్రులు , పోలీపసులు అన్నిచోట్లా వెతుకుతున్నారు. పోలీసులు మూడు కమిషనరేట్ల పరిధుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి వివరాలు ట్విటర్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. వాటిని చూసిన ఢిల్లీలోని పోలీసులు సమాచారం ఇచ్చారు. అందిన సమాచారం మేరకు హబీబ్‌నగర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన విమానంలో వెళ్లి బాలుణ్ని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈనెల 19వ తేదీన ఒక అపరిచిత వ్యక్తి ఠాణాకు వచ్చి తన ఆధార్, ఇతర వివరాలు నమోదుచేసి ఆయాన్‌ను అప్పగించి వెళ్లాడంటూ నిజాముద్ధీన్ పోలీసులు చెప్పారు. మల్లేపల్లిలో ఉన్న ఆయాన్‌ను ఆ వ్యక్తే చేరదీసి రైల్లో ఢిల్లీకి తీసుకువెళ్లాడు అని పోలీసుల దగ్గర ఆధారాలు లభించాయి. అయితే కిడ్నాప్ చేసిన వ్యక్తి రైల్లో ఎందుకు తీసుకెళ్లాడు? ఎందుకు ఢిల్లీ పోలీసులకు అప్పగించాడు? కిడ్నాప్ చేసుంటే ఆధార్‌కార్డ్ వివరాలు పోలీసులకు ఎందుకిచ్చాడు అని ఆరాతీస్తున్నారు.