కలపతో ట్రెడ్‌మిల్.. మండపేట వాసి ప్రతిభ
మండపేట (CLiC2NEWS): తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణానికి చెందిన ఓ కార్పెంటర్ తన ప్రతిభను వెలికి తీసాడు. తీరిక వేళల్లో చెక్కలను ఉపయోగించి చిన్న పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, చిన్న చిన్న గృహోపకరణ వస్తువులు తయారు చేయడం తన హాబీగా మార్చుకున్నాడు. అదే క్రమంలో ఆ కళాకారుడికి వినూత్న ఆలోచన తట్టింది. తన నైపుణ్యంతో ఉడెన్ ట్రెడ్ మిల్ ను తయారు చేసి వావ్ అనిపించాడు. ఇంతకీ ఆ కళాకారుడు ఎవరూ తెలుసుకోవాలని ఉంది కదూ. పట్టణ శివారు గొల్లపుంత కాలనీలో నివాసం ఉంటున్న కడియపు శ్రీనివాస్. వంశ పారంపర్యంగా వస్తున్న వడ్రంగి వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజు వారీ పనుల్లో భాగంగా తాను పని చేసే ఓ యజమాని ఇంటి వద్ద ఎలక్ట్రికల్ ట్రెడ్ మిల్ ను చూసాడు. కరెంట్ సాయంతో నడిచే ఆ యంత్రాన్ని చూసి కలపతో చేయాలని సంకల్పించాడు. అందుకు అవసరమైన బేరింగ్స్, చెక్కలు, బెల్ట్ మెటీరియల్ ను వినియోగించి ట్రెడ్ మిల్ ను తయారు చేశాడు. ఈ వీడియోను ఓ స్నేహితుడికి పంపగా ఆయన సోషల్ మీడియా వేదికల్లో సరదాగా పోస్ట్ చేసాడు. అంతే ఇంకే ముంది తెలంగాణ రాష్ట్రం వెళ్ళి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వాట్సాప్ లో దర్శనం ఇచ్చింది. ఆ వీడియో చూసి కేటీఆర్ ఆశ్చర్యచకితులై వెంటనే సారు ట్విట్టర్ లో వావ్ అంటూ పోస్టు చేశారు. తెలంగాణ వ్యక్తిగా భావించిన కేటీఆర్ కళాకారుడికి అభినందనలు తెలిపారు. అతని వివరాలు తెలుసుకొని తగిన ప్రోత్సాహం ఇవ్వాలని తెలంగాణ టీ వర్క్స్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా ప్రచురించడంతో మరింత వైరల్ గా మారింది. తక్కువ ఖర్చుతో కరెంటు సాయం లేకుండా రూపొందించిన ట్రెడ్ మిల్ ను చూసి సామాన్యులు సైతం మాకు కావాలంటే మాకు కావాలని ఫోన్ లు చేయడం విశేషం.