మూడు నెలల చిన్నారి.. ఆరుసార్లు విక్రయం..

మంగళగిరి (CLiC2NEWS): మూడు నెలల చిన్నారిని ఆరుసార్లు విక్రయించి సొమ్ము చేసుకున్న 11 మంది నిందితులను మంగళగిరి ఆర్భన్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి నగరంలోని గుండాలయ పేటకు చెందిన మొడబలిమి మనోజ్, రాణి దంపతులకు ముగ్గురు ఆడపిల్లల సంతానం. చెడు అలవాట్లకు బానిసైన మనోజ్ తన చిన్నకూతురు మూడు నెలల చిన్నారిని రూ, 70 వేలకు విక్రయించాడు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తులో పాపను మరో ఐదు సార్లు అమ్మినట్లు తేలింది. ఈ విక్రయంలో రూ. 10.37 లక్షలు చేతులు మారాయి. మనోజ్‌తో పాటు 11 మంది నిందితులను గుర్తించారు.
మనోజ్ పాపను రూ. 70 వేలకు గాయత్రికి విక్రయించగా.. ఆమె వద్దనుండి నందా అనే వ్యక్తి రూ. 1.20 లక్షలకు తీసుకున్నాడు. ఆయన షేక్ నూర్జహాన్ అనే మహిళకు రూ. 1.87 లక్షలకు అమ్మారు. ఆమె బొమ్మాడ ఉమాదేవికి కూ. 1.90 లక్షలకు విక్రయించింది. ఆమె కరికముక్క విజయలక్ష్మికి రూ. 2.20 లక్షలకు అమ్మారు. ఆమె వద్ద నుండి వర్రే రమేష్ అనే వ్యక్తి కొనుక్కున్నారు. మొత్తంగా చిన్నారి విక్రయం ద్వారా రూ. 10.37 లక్షలు చేతులు మారాయి. పాపను వరుసగా నల్గొండ జిల్లా, హైదరాబాద్, ఏలూరు, విజయవాడలో అమ్మి సొమ్ము చేసుకున్నారు. చివరకు పాపను విజయవాడలో ఉన్నట్లు తెలుసుకొని పాపను తల్లికి అప్పగించారు.