Covid in China: ఆంక్షల చట్రంలో చైనా నగరాలు
బీజింగ్ (CLiC2NEWS): చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రెండున్నర కోట్ల నబా కలిగిన షాంఘై లో గత రెండు వారాలుగా లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికి కరోనా ఉధృతి కట్టడిలోకి రావడం లేదు. అలాగే సుఝౌ ప్రావిన్సులో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. చైనా నగరాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతుండటంతో అక్కడ కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రస్తుతం చైనాలో 40 కోట్ల మంది ఆంక్షల గుప్పిట్లో ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
గవేకాల్ డ్రాగొనామిక్స్ అధ్యయనం ప్రకారం చైనాలోని 100 ప్రధాన నగరాల్లో దాదాపు 87 చోట్ల కఠినంగా కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నట్లు సమాచారం. అలాగే నొమురా హోల్డింగ్స్ సంస్థ ఆర్థిక వేత్తల అంచనా ప్రకారం 37.3 కోట్ల మంది చైనీయులు పలు రకాల కొవిడ్ ఆంక్షల్లో కొనసాగుతున్నట్లు అంచనా.. ప్రధాన నగరాల్లో కొవిడ్ ఆంక్షల కారణంగా చాలా సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి.