ఓఆర్ఆర్ -2లో 60 కాలనీలకు తాగునీటి సరఫరా షురూ
ఓఆర్ఆర్ - 2 ప్రాజెక్టుపై జలమండలి ఎండీ సమీక్ష
హైదరాబాద్ (CLiC2NEWS): ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకు రూ.1,200 కోట్లతో చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్ – 2 ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఓఆర్ఆర్ ఫేజ్ – 2 పనులపై జలమండలి ఎండీ దానకిశోర్ సమీక్ష నిర్వహించారు. పైప్‌లైన్, రిజర్వాయర్ల నిర్మాణ పనుల పురోగతిని ఆయన తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ.. మొదటి ప్రాధాన్యతగా తీసుకున్న కాలనీల్లో ఇప్పటికే 60 కాలనీల్లో పైప్‌లైన్ పనులు పూర్తి చేసి తాగునీటి సరఫరా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ 60 కాలనీలలో కొత్తగా 215 కిలోమీటర్ల పైప్‌లైన్ వేసినట్లు తెలిపారు. మొదటి ప్రాధాన్యతగా నిర్ణయించిన మరో 58 కాలనీల్లో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఎండీ ఆదేశించారు. మరో 10 రోజుల్లో ఈ కాలనీల్లో కూడా పైప్‌లైన్ విస్తరణ పనులు పూర్తి చేసి నీటి సరఫరా ప్రారంభించాలని సూచించారు. ఈ 58 కాలనీల్లో కొత్తగా 75 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ప్రాంతాల్లో కొత్త కనెక్షన్లు దరఖాస్తు చేసుకునే వారు జలమండలి వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని ప్రజలకు ఎండీ దానకిశోర్ సూచించారు. ఇప్పటికే పైప్‌లైన్ పూర్తైన ప్రాంతాల్లో కొత్త కనెక్షన్ల నమోదు కోసం జలమండలి ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తోందని ఆయన తెలిపారు.
రెండు ప్యాకేజీల్లో నిర్మిస్తున్న ఓఆర్ఆర్ ఫేజ్ – 2 పనులను దశలవారీగా ఈ డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఎండీ దానకిశోర్ ఆదేశించారు. ఈ దిశగా పనుల్లో వేగం పెంచాలని సూచించారు. వర్షాకాలంలో పైప్‌లైన్ పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని, కాబట్టి వర్షాకాలం ప్రారంభం నాటికే పైప్‌లైన్ పనులు మొత్తం పూర్తి చేసేలా వేగంగా పనులు జరపాలని ఆయన సూచించారు.
పనులు వేగంగా జరిగేందుకు సరిపడా కార్మికులు ఉండేలా చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పైపులు, స్పెషళ్లు, ఇతర నిర్మాణ సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రిజర్వాయర్ల నిర్మాణ పనుల్లో సైతం వేగం పెంచాలని ఆయన పేర్కొన్నారు. పైప్‌లైన్ విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో బ్యారీకేడ్లు ఏర్పాటు చేయాలని, కార్మికుల కోసం తగు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్ స్వామి, జలమండలి సీజీఎంలు, జీఎంలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.