నేడు, రేపు కోస్తా, రాయ‌ల‌సీమ‌లో వ‌ర్షాలు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎండాకాలం కావ‌డంతో మే నెల‌లో ఉష్ణోగ్ర‌త‌లు అధికంగా న‌మోద‌వుతున్నాయి. ప‌గ‌లంతా ఎండ‌లు.. సాయంత్రం అవ్వంగానే వ‌ర్షాలు, ఈదురు గాలులు వీస్తున్నాయి. శుక్ర‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసాయి. ప‌లు చోట్ల ఈ వాన‌లు రాత్రి వ‌ర‌కు కొన‌సాగుతూనే ఉన్నాయి. ప‌లు చోట్ల విద్యుత్ స్తంబాలు ప‌డిపోవ‌డం, క‌రెంటు తీగ‌లు తెగిపోవ‌డం, చెట్లు కూలిపోవ‌డం జ‌రిగింది. ఈ అకాల వ‌ర్షాల‌తో ఎపిలోని ప‌లు జిల్లాల్లో రైతులు ఆర‌బోసిన ధాన్యం నీటిపాలైంది. నెల్లూరు జిల్లా ఉద‌య గిరిలో 56.75 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. చిల‌క‌లూరిపేట మండ‌లంలో 51.50 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. గుంటూరు, అనంత‌పురం, క‌డ‌ప, ఒంగోలు జిల్లాల్లోని ప‌లు చోట్ల వ‌ర్షాలు కురిసాయి. ఈ అకాల వ‌ర్షాల‌తో ప‌లు చోట్లు విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది.

బంగాళ‌ఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌న వాయువ్య‌దిశ‌గా క‌దులుతూ.. శ‌నివారం సాయ‌త్రం స‌మ‌యానికి వాయుగుండంగా మారే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇది ఆదివారం సాయంత్రానికి మ‌రింత బ‌ల‌ప‌డి తుపానుగా మారే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. ఈ అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో శ‌ని, ఆది వారాల్లో కోస్తా, రాయ‌ల‌సీమ జిల్లాల్లోని ప‌లు చోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన జ‌ల్లులు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మ‌త్స‌కారులు స‌ముద్రంలో వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని విపత్తు నిర్వ‌మ‌ణ సంస్థ డైరెక్ట‌ర్ బి. ఆర్‌. అంబేద్క‌ర్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.