పరువు పరువు హత్య కేసు: అదుపులో ఆరుగురు నిందితులు

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని బేగంబజార్ పరువుహత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డిసిపి జోయల్ డేవిస్ మీడియాకు వెల్లడించారు.
నీరజ్‌ను హత్య చేసింది సంజన పెదనాన్న కుమారులు అని, హత్య చేసేందుకు వారు 15 రోజులుగా కుట్ర చేశారని తెలిపారు. నీరజ్, సంజనల ప్రేమ వివాహం యువతి వాళ్ల ఇంట్లో ఇష్టం లేదు. వివాహానంతరం సంజనతో ఎలాంటి సంబంధం లేదని ఆమె కుటుంబసభ్యులు వదిలేశారు. కాని పెదనాన్న కుమారులు మాత్రం పరువు పోయినట్లు భావించారు. పెళ్లి చేసుకున్నప్పుడే తమకు ప్రాణాపాయం ఉందని నీరజ్, సంజనలు ఫిర్యాదు చేశారు. అప్పుడే ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని తెలిపారు.
నీరజ్‌కు పల్లీల వ్యాపారం ఉంది. నీరజ్ తరచూ షాపుకు రావడం.. నిందితుల ఇల్లు కూడా సమీపంలోనే ఉండటం వల్ల వారు ఎక్కువగా ఎదురు పడటం జరిగింది. పదేపదే నీరజ్‌ను ఇంటి సమీపంలో చూస్తూ తట్టుకోలేక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం నీరజ్‌ను హతమార్చారు. నిందితుడిగా గుర్తించిన వారిలో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసులో సంజన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు తెలియలేదు. ప్రస్తుతం ఆరుగురు కలిసి హత్య చేసినట్లు గుర్తించారని, వారిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు.
సంజన, నీరజ్‌లు ఏడాదిన్నర కిందట ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి రెండునెలల బాబు ఉన్నాడు. వీరి వివాహం ఇష్టంలేని సంజన కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. నీరజ్ శుక్రవారం సాయంత్రం హత్యుకు గురైనాడు. తన సోదరులే హత్య చేశారని మృతుని భార్య సంజన తన రెండు నెలల వయసున్న బాబుతో బేగంబజార్ కూడలిలో ధర్నాకు దిగింది. ఏడాదిగా తన సోదరులు బెదిరిస్తున్నట్లు ఆమె చెప్పారు.