8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు: సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS): ప్రభుత్వ బడులలో చదువుకొనే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఎపి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, బైజూస్ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాలల్లో 4 నుండి 10వ తరగతి వరకు ఎడ్యు-టెక్ విద్యను అందించనున్నారు. బైజూస్ ద్వారా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయనున్నట్లు తెలియజేశారు.
మరోవైపు ప్రతి సంవత్సరం 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తామని సిఎం జగన్ వెల్లడించారు. ఈ సెప్టెంబర్‌లోనే విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తామని అన్నారు. వీడియే కంటెంట్ ద్వారా పాఠ్యాంశాలను అర్థం చేసుకునేలా తరగతి గదిలో టివిలు ఏర్పాటు చేయనున్నట్లు సిఎం స్పష్టం చేశారు.