అగ్నిప‌థ్: సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌లో ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు

హైద‌రాబాద్ (CLiC2NEWS): కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్‌పై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌లో ఆందోళ‌న‌కారులు అగ్నిప‌థ్‌ను వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న‌కు దిగారు. అగ్నిప‌థ్‌ను ర‌ద్దు చేసి య‌థావిధిగా సైనిక ఎంపిక కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తూ యువ‌కులు ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు దిగారు. ఆందోళ‌న‌కారులు చేప‌ట్టిన నిర‌స‌న తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. హైద‌రాబాద్ నండి కోల్‌క‌తా వైపు వెళ్లే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పంటించారు. రైలు ప‌ట్టాల‌పై పార్సిల్ సామాన్లు వేసి వాటిని త‌గ‌లబెట్టారు. స్టేష‌న్‌లోని షాప్‌లు, డిస్‌ప్లే బోర్డుల‌ను ధ్వంసం చేశారు. ఆందోళ‌నకారుల‌ను అదుపు చేయ‌డానికి పోలీసులు భాష్ప‌వాయువు ప్ర‌యోగించారు.

త్రివిధ ద‌ళాల్లో సైనిక నియామ‌కాల కోసం ‘అగ్నిప‌థ్’ పేరుతో కేంద్రం కొత్త స‌ర్వీస్ ప‌థ‌కం తీసుకొచ్చింది. ఈనియామ‌కాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హ‌త వ‌య‌సును 17.5 నుండి 21 ఏళ్లుగా నిర్ణ‌యించారు.
నాలుగేళ్ల పాటు సేవ‌లందించాక వీరిలో 25% మంది మాత్ర‌మే సైన్యంలో కొన‌సాగుతారు. ఈ ప‌థ‌కం కింద చేరిన వారిని అగ్ని వీరులుగా పిలుస్తారు. ఈ ఏడాది మొత్తం 46వేల మంది సైనికుల నియామ‌కం చేప‌ట్ట‌నుంది. అయితే కొవిడ్ కార‌ణంగా గ‌త రెండేళ్ల‌గా ఎటువంటి నియామ‌కాలు జ‌ర‌గ‌లేదు. దీంతో కేంద్రం ఈ సంవ‌త్స‌రం కొంత స‌డ‌లింపు ఇచ్చింది. 2022 నియామ‌కాల‌కు సంబంధించి అర్హ‌త‌ను గ‌రష్టంగా 23 ఏళ్ల‌కు పెంచ‌తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు గురువారం ర‌క్ష‌ణ శాఖ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అగ్నిప‌థ్ పేరుతో నాలుగేళ్ల ఉద్యోగం మాకు అక్క‌ర్లేదు. పాత ప‌ద్ధ‌తిలో నియామ‌కాలు చేప‌ట్టాల‌ని దేశ‌వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.