సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. ఆవుల సుబ్బారావు అరెస్టు
హైదరాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమి నిర్వాహుకుడు ఆవుల సుబ్బారావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్‌లో జరిగిన విధ్వంసంలో ఆవుల సుబ్బారావు పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. 16 తేదీన హైదరాబాద్ చేరుకొని ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువకులను రెచ్చగొట్టి రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించేల పథక రచన చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతనికి తెలుగు రాష్ట్రాల్లో డిఫెన్స్ అకాడమీలు ఉన్నాయి. అగ్నిపథ్ పథకం వల్ల కోచింగ్ సెంటర్లన్నీ మూతపడే పరిస్థితి నెలకొంటుందని యువకులను రెచ్చగొట్టినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్ గ్రూప్‌లో పలు పోస్టుల ఆధారంగా చూపిస్తున్నారు. మిగతా అకాడమీల డైరెక్టర్ల పాత్రపై కూడా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
రైల్వేస్టేషన్లో దాడి కేసులో సుబ్బారావు ప్రమేయం ఉందని పోలీసులు ముందునుంచి అనుమానించారు. రైల్వేస్టేషన్లో విధ్వంసం సృష్టించాలన్న ప్రణాళిక, కార్యచరణను సుబ్బారావు దగ్గరుండి పర్యవేక్షించినట్లు పోలీసులకు సాక్ష్యాలు లభించాయి. తన ముఖ్య అనుచరులు శివ, మల్లారెడ్డితో మాట్లాడి.. వారి ద్వారా ఆర్మీ అభ్యర్థులను రప్పించుకొని వారికి మద్దతుగా తన అనుచరులను మాస్కలతో రైల్వేస్టేషన్‌కు పంపించాడు. వారు విధ్వంసం మొదలు పెట్టిన కొద్దిసేపటికే గుంటూరుకు వెళ్లిపోయాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు సుబ్బారావు అనుచరులతో పాటు మరో ముగ్గురిని టాస్క్‌ఫోర్స్ పోలీసలు అదుపులోకి తీసుకొని విచారించగా.. సుబ్బారావుకు రైల్వే విధ్వంసానికి సంబంధం ఉందని తెలిపారు.