భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఢిల్లీ (CLiC2NEWS): భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవపు వేడుకల సందర్భంలో దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. మహిళలు అడ్డంకులను అధిగమించి ముందుకు వెళ్తున్నారని, దేశానికి అతిపెద్ద ఆశాదీపాలు మన పుత్రికలేన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు పూర్తి చేసుకుంటోందని, ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వార్షికోత్సవం జరుపుకొంటున్నామన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులందరికీ వందనాలు తెలియజేశారు. స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడం కోసం వారంతా తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. వారందరినీ మరోసారి స్మరించుకుందాం అని రాష్ట్రపతి అన్నారు.