దేశ సంక్షేమం కోరుకునే శక్తులన్నీ ఏకం కావాలి : ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): దేశాన్ని అభివృద్ధి పరిచే వ్యవసాయ సంక్షేమం దిశగా సాగే సుపరిపాలన కోసం అడుగులు వేయాల్సి ఉందని రైతు సంఘాల నేతలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపును ఇచ్చారు. తెలంగాణ సర్కార్ అమలు చేస్తోన్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, పలు రైతు కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు శనివారం కెసిఆర్‌ను కలుసుకున్నారు. వీరంతా ప్రగతి భవన్‌లో వ్యవసాయం, సాగునీటి రంగం తదితర అంశాలపై రూపొందించిన డాక్యుమెంటరీని ముఖ్యమంత్రితో కలిసి వీక్షించారు.
తర్వాత రైతుల సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడారు.. “రైతు సమస్యల పరిష్కారం కోసం పాలకులు ఆలోచించాలి. ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను అన్వేషించాలి. దేశంలో అనేక వర్గాలు తమ ఆకాంక్షలు, హక్కులను నెరవేర్చకునేందుకు ఇంకా పోరాటాలకు ఎందుకు సిద్ధమవుతున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం పని చేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేయడం అనే పొంతనలేని ప్రక్రియ దేశంలో కొనసాగుతుండడం దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితుల్లో దేశాన్ని కాపాడేందుకు ప్రజల సంక్షేమం కోరరుకునే శక్తులు ఏకం కావాల్సి ఉంటుంది. కేంద్రంలో ని పాలకుల నిర్లక్ష్యం లాంటి పలు విషయాలను విశ్లేషించుకొని, చర్చించాల్సిన సందర్భం ఇదే“ అని సిఎం తెలిపారు.