దేశంలోనే ప్రప్రథమంగా వర్చువల్ పాఠశాల..
ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలి వర్చువల్ పాఠశాలను ప్రారంభించారు. దేశంలోని ఎక్కడి విద్యార్థి అయినా సరే ఈ వర్చువల్ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. భౌతికంగా పాఠశాలలకు వెళ్లలేని వారికి ఇదొక సదవకాశం. ఈ సందర్భంగా సిఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమెదటిగా ప్రారంభించిన ఢిల్లీ మోడల్ వర్చువల్ పాఠశాల ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు అనుంబంధంగా పనిచేస్తుందని తెలిపారు. నేటి నుండి ఈ పాఠశాలలో 9-12వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ పాఠశాలలో జెఇఇ, నీట్, సియుఇటి పరీక్షలకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
విద్యార్థులు లైవ్ క్లాస్‌లకు హాజరుకావచ్చు. రికార్డ్ చేసిన క్లాస్ సెషన్స్, స్టడీ మెటీరియల్‌ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన సదుపాయాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు ఒక్కో విద్యార్థికి ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. ఈ పాఠశాలకు సంబంధించిన డిజిటల్ లైబ్రరీ సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. కరోనా సమయంలో నిర్వహించిన వర్చువల్ క్లాస్‌ల స్ఫూర్తితోనే ఈ స్కూల్‌ను ప్రారంభించినట్లు సిఎం వెల్లడించారు.