తెలంగాణ పౌరుషాల గడ్డ.. మీ బెదిరింపులిక్కడ పనిచేయవ్: సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో రెండో రోజు శాసనసభ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డారని.. విద్యుతాఘాతాలతో అనేక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. బిల్లులు కట్టని వారిపై విద్యుత్ అధికారులు దాడులు చేయగా.. కొందరు విషం తాగి ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. విద్యుత్ సహా అనేక సమస్యలపై పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రాలు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాయన్నది ప్రగతి సూచికలో ముఖ్యమైనదిగా అధునిక ప్రపంచం పరిగణిస్తుందని సిఎం అన్నారు.
పునర్విభజన చట్టం హామీల అమల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. విద్యుత్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరగా.. అప్రజాస్వామికంగా ఏడు మండలాలపై ఆర్డినెన్స్ తెచ్చి, శాసనసభకు ప్రతిపాదించకుండానే వాటిని ఎపికి అప్పగించారన్నారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కూడా ఎపికే కేటాయించారని సిఎం గుర్తుచేశారు. ఎపికి రూ.3వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని, దానికి మరో రూ. 3వేల కోట్ల వడ్డీ కట్టాలని కేంద్రం సూచించినదని అన్నారు. బకాయిలు నెలలో కట్టకపోతే చర్యలు తీసుకుంటామని కూడా అన్నారు. మరి తెలంగాణకు ఎపి నుండి రూ. 17 వేల కోట్లు రావాలి.. వాటిసంగతేంటని అన్నారు. కృష్ణపట్నం సహా అనేక రంగాల్లో తెలంగాణ వాటా ఉంది. మేమివ్ఆల్సిన రూ. 6వేల కోట్లు మినహాయించుకుని మిగతావి కేంద్రమే ఇప్పించాలన్నారు.