అరకు మాజి ఎంపి కొత్తపల్లి గీత అరెస్టు

హైదరాబాద్ (CLiC2NEWS): పంజాబ్ నేషనల్ బ్యాంకు (పిఎన్‌బి) కేసులో సిబిఐ అధికారులు అరకు మాజి ఎంపి కొత్తపల్లి గీతను అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 1లక్ష జరిమానా విధించింది. 2014లో వైఎస్ ఆర్ పార్టీ తరపున అరకు ఎంపిగా కొత్తపల్లి గీత ఎన్నికయ్యారు. అనంతరం ఆపార్టీని వదిలి జనజాగృతి పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. తర్వాత ఆమె బిజెపిలో చేరి.. తన పార్టీని కూడా బిజెపిలో విలీనం చేశారు.
విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో పిఎన్‌బి బ్యాంకు నుండి లోన్ తీసుకొని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలతో బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిబిఐ అధికారులు కొత్తపల్లి గీతను అరెస్ట్ చేశారు. అనంతరం గీతను కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. రూ. లక్ష జరిమానా విధించింది. గీతతో పాటు ఆమె భర్త పి. రామకోటేశ్వరరావుకు కూడా జైలు శిక్ష, జరిమానా విధించారు. ఆదేవిధంగా ఆమెకు సహకరించిన బ్యాంకు అధికారులకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కంపెనీకి కూడా కోర్టు రూ. 2లక్షల జరిమానా విధించింది. అనంతరం గీతను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆమెతరపు న్యాయవాదులు తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.